కామన్వెల్త్ గేమ్స్‌లో అపశృతి... క్రీజులోనే కొట్టుకున్న ప్లేయర్లు! ఇంగ్లాండ్ - కెనడా హాకీ మ్యాచ్‌లో...

ఇంగ్లాండ్- కెనడా మధ్య జరిగిన హాకీ మ్యాచ్‌లో తోపులాట... ఓ ప్లేయర్‌కి రెడ్ కార్డు, మరో ప్లేయర్‌కి ఎల్లో కార్డు చూపించిన రిఫరీ... 

Commonwealth Games 2022: Hockey Player sent-off for chocking rival in match between Canada vs England

బర్మింగ్‌హమ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ గేమ్స్‌ ఇప్పటిదాకా ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా సాగాయి. కరోనా కేసులు వెలుగుచూసినా, అప్పుడప్పుడు వర్షం అంతరాయం కలిగించినా ఏ ఆటకూ పెద్దగా నష్టం అయితే కలగలేదు. అయితే తాజాగా ఇంగ్లాండ్, కెనడా మధ్య జరిగిన మ్యాచ్‌లో అపశృతి చోటు చేసుకుంది...

గ్రూప్ బీలో ఉన్న ఆతిథ్య ఇంగ్లాండ్ హాకీ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది. కెనడాతో జరిగిన మ్యాచ్‌‌లో ఆతిథ్య ఇంగ్లండ్ 4-1 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. ఆరంభం నుంచి ఈ మ్యాచ్‌లో హై డ్రామా నడిచింది. ఓ ఇంగ్లాండ్ ఆటగాడు తన హాకీ స్టిక్‌తో కెనడా ప్లేయర్‌పైకి దాడికి దిగేందుకు ప్రయత్నించాడు. దీన్ని గమనించిన రిఫరీ, సదరు ప్లేయర్‌కి ఎల్లో కార్డు చూపించింది...

ఈ సంఘటన తర్వాత ప్లేయర్లందరూ ఆవేశానికి లోనయ్యారు. కొద్దిసేపటికే ఇంగ్లాండ్‌ టీమ్‌ ప్లేయర్ క్రిస్ గ్రిఫిత్స్, కెనడా ప్లేయర్ బల్‌రాజ్ పనేసర్‌ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, క్రీజులోనే కొట్టుకోవడం మొదలెట్టారు. ఇద్దరు ఆటగాళ్లు చొక్కాలు పట్టుకుని తోసుకున్నారు...

మిగిలిన ప్లేయర్లు, రిఫరీ కలుగచేసుకుని వీరిని విడదీసేందుకు ప్రయత్నించారు. ఇంగ్లాండ్ ప్లేయర్ క్రిస్ గ్రిఫిత్స్‌ని బలంగా తోసేసిన కెనడా ప్లేయర్ బల్‌రాజ్ పనేసర్‌కి రెడ్ కార్డు చూపించి మ్యాచ్‌ నుంచి బయటికి పంపిస్తూ నిర్ణయం తీసుకున్నాడు రిఫరీ. అతనితో గొడవ పడిన క్రిస్‌ గ్రిఫిత్స్‌కి ఎల్లో కార్డు ఇచ్చారు...

గొడవ తర్వాత కొద్దిసేపు విరామం తర్వాత ఆట మళ్లీ మొదలైంది. రెడ్ కార్డు కారణంగా కెనడా టీమ్‌లో ఓ ప్లేయర్ తక్కువగా ఉండడంతో దాన్ని అడ్వాంటేజ్‌గా మార్చుకున్న ఇంగ్లాండ్, 5-1 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది.

అక్కడి నుంచి వరుస గోల్స్ చేస్తూ వెళ్లిన ఇంగ్లాండ్ జట్టు, 11-2 తేడాతో మ్యాచ్‌ని గెలిచి సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లింది. గ్రూప్ బీలో రెండో స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ జట్టు, గ్రూప్ ఏ టేబుల్ టాపర్ ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.

గ్రూప్ బీ టేబుల్ టాపర్ భారత హాకీ జట్టు, గ్రూప్ ఏలో ఉన్న సౌతాఫ్రికాతో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది. మహిళా హాకీ టోర్నీలో గ్రూప్ ఏ నుంచి ఇంగ్లాండ్, భారత జట్లు, గ్రూప్ బీ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సెమీ ఫైనల్‌కి అర్హత సాధించాయి. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత పురుషుల జట్టు రెండు సార్లు (2010, 2014) రజత పతకాలు గెలవగా, మహిళా హాకీ జట్టు 2002లో స్వర్ణం, 2006లో రజత పతకం గెలిచింది. 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన భారత మహిళా హాకీ జట్టు భారీ అంచనాలతో బర్మింగ్‌హమ్ కామన్వెల్త్ గేమ్స్‌లో బరిలో దిగుతోంది... 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios