Commonwealth Games 2022: డోప్ టెస్టులో దొరికిన మరో భారత అథ్లెట్.. ఐదుకు చేరిన సంఖ్య
Commonwealth Games 2022: మరో మూడు రోజులలో ప్రారంభం కాబోతున్న కామన్వెల్త్ క్రీడలలో భారత్ కు వరుస షాకులు తాకుతున్నాయి. ఇప్పటికే నలుగురు అథ్లెట్లు డోప్ టెస్టులో పట్టుబడగా తాజాగా...
ఈనెల 28 నుంచి బర్మింగ్‌హోమ్ వేదికగా ప్రారంభం కాబోయే కామన్వెల్త్ గేమ్స్‌కు ముందే టీమిండియాకు వరుస షాకులు తాకుతున్నాయి. రోజుకో క్రీడాకారుడు డోప్ టెస్టులో పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఈ జాబితాలో నలుగురు క్రీడాకారులుండగా తాజాగా మహిళల 4x100మీటర్ల బృందంలోని మరో సభ్యురాలు డోప్ టెస్టులో పట్టుబడినట్టు తెలుస్తున్నది.
కామన్వెల్త్ కు బయలుదేరడానికి ముందు 4x100మీటర్ల బృందంలోని ఓ అథ్లెట్ కు గతంలో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) నిర్వహించిన డోప్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చినట్టు తేలింది. దీంతో సదరు క్రీడాకారిణిని కామన్వెల్త్ బృందం నుంచి తప్పించారు. అయితే ఆ అథ్లెట్ ఎవరు..? అన్నదానిని మాత్రం అథ్లెటిక్స్ ఫెడరేషన్ వెల్లడించలేదు.
ఇదే విషయమై అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తో స్పందిస్తూ.. ‘అవును నిజమే. మహిళల 4x100మీటర్ల బృందంలోని ఒక అథ్లెట్ డోప్ టెస్టులో పాజిటివ్ గా తేలింది. మేము ఆమెపై చర్య తీసుకుంటాం..’ అని తెలిపింది.
గతవారం ఇద్దరు పారా అథ్లెట్లు అనీష్ కుమార్, సురేంద్రన్ పిళ్లైలు డోప్ టెస్టులో విఫలమయ్యారు. వీరిపై నిషేధం కూడా జారీ అయింది. జులై 20న భారత స్టార్ స్ప్రింటర్ ధనలక్ష్మీతో పాటు ట్రిపుల్ జంపర్ ఐశ్యర్య బాబులు డోప్ టెస్టులో పట్టుబడ్డారు.
ధనలక్ష్మీకి విదేశాల్లో అథ్లెటిక్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) లో నిర్వహించిన డోపింగ్ టెస్టులో పాజిటివ్ అని తేలింది. ఇక గత నెలలో చెన్నైలో జరిగిన ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్స్ లో భాగంగా సేకరించిన శాంపిల్స్ లో ఐశ్వర్య డోపింగ్ కు పాల్పడిందని తేలింది. ఈ ఇద్దరూ నిషేధిత స్టెరాయిడ్స్ వాడినట్టు తేలడంతో ధనలక్ష్మీ, ఐశ్వర్య బాబు లు ఈ మెగా ఈవెంట్ నుంచి తప్పుకున్నారు.
ఇక ఐశ్వర్య విషయానికొస్తే.. ట్రిపుల్ జంప్ లో ఆమె గతనెలలో జరిగిన ఇంట్ స్టేట్ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్ లో జాతీయ రికార్డు నెలకొల్పింది. కానీ అదే క్రీడల్లో భాగంగా ఆమె నుంచి సేకరించిన శాంపిల్స్ లో ఐశ్వర్య నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు తేలింది. దీంతో ఈ ఇద్దరూ కామన్వెల్త్ క్రీడలకు దూరమయ్యారు.