పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు నమోదయ్యింది. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన పసికూనలు యూఏఈ, చైనా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ రికార్డు నమోదయ్యింది. 203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చైనా మహిళా జట్టు కేవలం 14 పరుగులకే ఆలౌటై అంతర్జాతీయ టీ20 క్రికెట్లోనే అత్యంత తక్కువ స్కోరు సాధించిన జట్టుగా చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. 

థాయ్‌లాండ్‌ ఉమెన్స్‌ టి20 స్మాష్‌ టోర్నీ లో భాగంగా ఈ యూఏఈ, చైనా జట్లు తలపడ్డాయి. అయితే మొదట యూఏఈ జట్టు బ్యాటింగ్ కు దిగి చైనా బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. 

204 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చైనా కనీస పోరాట పటిమను చూపించలేకపోయింది. అసలు ఓ అంతర్జాతీయ క్రికెట్ జట్టేనా అన్న అనుమానాలు కలిగేలా వారి బ్యాటింగ్ సాగింది. యూఏఈ బౌలర్ల దాటికి కేవలం 14 పరుగులకే చైనా జట్టు ఆలౌటయ్యింది. చైనా ఆటగాళ్లలో లిలి అనే బ్యాట్ మెన్ సాధించిన 4 పరుగులే అత్యధికం. మిగతావారిలో ఏడుగురు బ్యాట్ ఉమెన్స్ డకౌటవగా యాన్‌ లింగ్, యింగ్‌ జూ చెరో 3, జాంగ్‌ చాన్‌ 2 పరుగులు సాధించారు. 

ఇలా ఓ చెత్త రికార్డు చైనా ఖాతాలో చేరగా..యూఏఈ ఖాతాలో ఓ భారీ విజయం చేరింది. చైనాను కేవలం 14 పరుగులకే కట్టడి చేయడం ద్వారా యూఏఈ  189 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా యూఏఈ మహిళల జట్టు రికార్డులనెలకొల్పింది.