టీమిండియాలో జిడ్డు బ్యాటింగ్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్. వికెట్లు పడుతున్న సమయంలో గోడ కట్టినట్లుగా ప్రత్యర్థి బౌలర్ల దూకుడుకు అడ్డుకట్ట వేయడంతో ద్రవిడ్ సిద్ధహాస్తుడు.

గంటలకు గంటలు క్రీజులో పాతుకుపోయి.. ఒక పట్టాన ఔటయ్యేవాడు. దీంతో బౌలర్లు అసహనానికి గురైన సందర్భాలు ఎన్నో. ద్రవిడ్ తర్వాత అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు తెరపైకి వచ్చాడు పుజారా.

తక్కువ వేగంతో పరుగులు చేయడంతో పాటు .... సుధీర్ఘ ఇన్నింగ్సులు ఆడటంతో నిపుణుడిగా పుజారా తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. స్ట్రైక్ రేటు తక్కువ.. వన్డే, టీ20లకు పనికిరాడని మాజీల చేత విమర్శలు సైతం అందుకున్నాడు.

అయితే అలాంటి వారికి పుజారా తన బ్యాటింగ్‌తోనే షాకిచ్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో కేవలం 61 బంతుల్లో సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు. గ్రూప్-సిలో భాగంగా గురువారం రైల్వేస్, సౌరాష్ట్ర జట్లు తలపడ్డాయి.

మొదట బ్యాటింగ్ చేసిన సౌరాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. హార్విక్ దేశాయ్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన పుజారా.. తన సహజ శైలికి భిన్నంగా ధాటిగా ఆడాడు.

కేవలం 29 బంతుల్లో అర్థశతకం పూర్తి చేశాడు. అర్ధసెంచరీ తర్వాత కూడా దూకుడు కంటిన్యూ చేసిన పుజారా కేవలం 61 బంతుల్లో సెంచరీని బాదేశాడు. ఇందులో 14 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. ఈ సెంచరీ ద్వారా సౌరాష్ట్ర తరపున టీ20లలో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా చతేశ్వర్ పుజారా రికార్డుల్లోకి ఎక్కాడు.

ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 300+, లిస్ట్-ఏ క్రికెట్‌లో 150+, టీ20లలో 100 పరుగులు చేసిన ఆటగాళ్లుగా వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ రికార్డుల్లోకి ఎక్కారు. తాజా శతకంతో పుజారా వారి స్థానాన్ని అందుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఓడిపోయింది.