ముగిసిన సైనా నెహ్వాల్ పోరాటం...క్వార్టర్ ఫైనల్ చేరిన రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడి...
థాయిలాండ్ ప్లేయర్ బుసానన్‌తో మ్యాచ్‌లో పోరాడి ఓడిన సైనా నెహ్వాల్... మెన్స్ డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్ చేరిన రెండు భారత జోడీలు... క్వార్టర్ ఫైనల్‌కి హెచ్‌ఎస్ ప్రణయ్..
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ 2022లో భారత సీనియర్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. రౌండ్ 16లో వరల్డ్ 12వ ర్యాంకర్ థాయిలాండ్ ప్లేయర్ బుసానన్ ఓంగ్‌బంరంగ్‌ఫాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 17- 21, 21-16, 13-21 తేడాతో పోరాడి ఓడింది సైనా నెహ్వాల్...
2006 నుంచి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొంటున్న సైనా నెహ్వాల్, 2015లో ఫైనల్ చేరి రజతం గెలిచింది. 2017 ఎడిషన్‌లో కాంస్య పతకం గెలిచిన సైనా నెహ్వాల్, ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయింది. 2018లో క్వార్టర్ ఫైనల్ చేరిన పీవీ సింధు, 2019, 2022 సీజన్‌లలో మూడో రౌండ్ నుంచే నిష్కమించింది. వివాహం కారణంగా 2021 ఎడిషన్‌కి దూరంగా ఉంది సైనా నెహ్వాల్.
సైనా నెహ్వాల్ ఓటమితో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ 2022 వుమెన్స్ సింగిల్స్‌లోనూ భారత్ పోరాటం ముగిసినట్టైంది. ఇప్పటికే వుమెన్స్ డబుల్స్‌లోనూ భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు టోర్నీ నుంచి నిష్కమించారు...
మెన్స్ సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో హెచ్ ప్రణయ్, లక్ష్యసేన్‌ని 17-21, 21-16, 21-17 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కి దూసుకెళ్లాడు. కామన్వెల్త్ గేమ్స్ 2022లో స్వర్ణం సాధించిన లక్ష్యసేన్, ప్రణయ్ చేతుల్లో ఓడిపోవడం ఇది రెండోసారి.
మెన్స్ డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి జోడి క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. వరల్డ్ 32వ ర్యాంకు డానిష్ జోడి సోలిస్- మరోకిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-8, 21-10 తేడాతో ఘన విజయం అందుకున్నారు సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి- చిరాగ్ శెట్టి...
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ చరిత్రలో ఇప్పటివరకూ మెన్స్ డబుల్స్ నుంచి భారత ప్లేయర్లు ఎవ్వరూ క్వార్టర్ ఫైనల్‌కి చేరలేకపోయారు. అయితే ఈ సీజన్‌లో ఏకంగా రెండు జోడీలు ఈ ఫీట్ సాధించారు. సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి - చిరాగ్‌శెట్టికి ముందు ఎం.ఆర్.అర్జున్ - ధృవ్ కపిల జోడి క్వార్టర్ ఫైనల్‌కి దూసుకెళ్లింది...
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ 2022 టోర్నీలో భారత మెన్స్ డబుల్స్ జోడీ ఎంఆర్ అర్జున్-ధృవ్ కపిల జోడి అద్భుత విజయాలతో క్వార్టర్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. వరల్డ్ 41 ర్యాంకింగ్ సింగపూర్ జోడీతో జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 18-21, 21-15, 21-16 తేడాతో అద్భుత విజయం అందుకుంది అర్జున్ - ధృవ్ కపిల జోడి...
క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ‘ది డాడీస్’గా పేరొందిన ఇండోనేషియా జోడీ హెండ్రా సెటివన్- మహ్మద్ అహ్సన్‌తో తలబడబోతున్నారు అర్జున్ - ధృవ్ కపిల. అంతకుముందు మెన్స్ డబుల్స్ రెండో రౌండ్‌లో అర్జున్ - ధృవ్ కపిల జోడి సంచలన విజయం అందుకుంది. వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ కాంస్య పతక విజేతలు, వరల్డ్ నెం.8 డానిష్ జోడీ కిమ్ అస్రప్ - అండర్స్ రస్మెసన్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-17, 21-16 తేడాతో సంచలన విజయం అందుకుని ప్రీ క్వార్టర్ ఫైనల్‌కి అర్హత సాధించారు...
సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి-చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జపాన్ ప్లేయర్లు యోగొ కొబాయషి -టకురో హోకీలతో తలబడబోతున్నారు.