ఏ క్షణాన ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్‌పైన్ రిషబ్ పంత్‌పై స్లెడ్జింగ్ కు దిగాడో అదే ఇపుడు అతడికి మంచి పబ్లిసిటీ ఇస్తోంది. తాత్కాలిక వికెట్ కీఫర్ గా జట్టులోకి వచ్చిన నువ్వు వన్డే సీరిస్ కు దూరమవుతావు కదా...ఆ సమయంలో నా పిల్లలను ఆడిస్తావా అంటూ పైన్ రిషబ్ పంత్ రెచ్చగొడుతూ స్లెడ్జింగ్ చేశాడు. దానికి రిషబ్ కూడా తనదైన శైలిలో ధీటుగా జవాభిచ్చాడు కూడా. అయితే పైన్ స్లెడ్జింగ్ కారణంగా రిషబ్ కు మంచి ప్రచారం లభిస్తోంది. 

ఆస్ట్రేలియా కెప్టెన్ పైన్ వ్యాఖ్యలను సరదాగా తీసుకున్న పంత్ అతడి భార్యా పిల్లలను కూడా కలిశాడు. పైన్ మాటలను నిజం చేస్తున్నాడా అన్న అనుమానం కలిగేలా రిషబ్ బోనిపైన్ తో పాటు వారి పిల్లలతో కలిసి ఫోటో దిగాడు.ఈ ఫోటోను సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేసిన టిమ్‌పైన్ భార్య రిషబ్ పంత్ ని మంచి బేబీ సిట్టర్ అంటూ ప్రశంసింది. 

మళ్లీ తాజాగా బోనిపైన్ మరోసారి రిషబ్ పంత్ పై సరదా వ్యాఖ్యలు చేశారు. తన ఇంట్లో ప్యాకింగ్ చేయాల్సిన వస్తువులు చిందరమందరగా పడివున్నాయంటూ పేర్కొన్న బోనిపైన్... పంత్ తమ పిల్లలను ఆడిస్తే తాను ఆ పనులు చూసుకుంటానంటూ కామెంట్ చేసింది. ఇంట్లో ప్యాకింగ్ చేయడానికి సిద్దంగా వున్న వస్తువుల పోటోలను కూడా జతచేస్తూ ఇన్స్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. 

అయితే తాజాగా ఈ బేబీ సిట్టర్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ రోహిత్ శర్మ కూడా  రిషబ్ పంత్‌పై సరదా ట్వీట్ చేశాడు.  తన కుమార్తెను ఆడించడానికి బేబీ సిట్టర్ కావాలంటూ.. ఇటవల తండ్రి అయిన రోహిత్ శర్మ పంత్ ని కోరాడు. ‘శుభోధయం బడ్డీ.. నీవు మంచి బేబీ సిట్టర్‌వని విన్నా. రితికాను సంతోషంగా ఉంచాలంటే నాకు ఓ బేబీ సిట్టర్‌ కావాలి అంటూ రోహిత్ సరదాగా పేర్కొన్నాడు.