CWG 2022: భారత్ పెనాల్టీ ‘షూట్ అవుట్’. సెమీస్‌లో ఆసీస్ చేతిలో ఓటమి..
Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్-2022 లో భారత హాకీ జట్టుకు ఆస్ట్రేలియా షాకిచ్చింది. సెమీస్ చేరిన మహిళల హాకీ జట్టు.. ఆసీస్ చేతిలో ఓడింది.
కామన్వెల్త్ క్రీడలలో భాగంగా జరుగుతున్న హాకీ పోటీలలో భారత మహిళల జట్టుకు షాక్ తగిలింది. సెమీస్ లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడింది. 1-1తో మ్యాచ్ సమమైనా చివర్లో పెనాల్టీ షూట్ అవుట్ లో భారత్ కు ఓటమి తప్పలేదు. షూట్ అవుట్ లో ఆసీస్ 3-0తో ఆధిక్యం సాధించింది. భారత్ ఒక్క గోల్ కూడా కొట్టలేకపోయింది. దీంతో ఆసీస్ ఫైనల్స్ కు వెళ్లగా భారత జట్టు కాంస్యం కోసం గతేడాది ఛాంపియన్లు న్యూజిలాండ్ తో పోటీ పడనుంది.
శుక్రవారం అర్ధరాత్రి జరిగిన సెమీస్ పోరులో భారత జట్టు.. ఆసీస్ తో తలపడింది. ఆట ప్రారంభమైన పదో నిమిషంలోనే ఆస్ట్రేలియా ప్లేయర్ రెబెకా గ్రీనర్ తొలి గోల్ కొట్టి ఆసీస్ ను 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లింది.
తొలి హాఫ్ ముగిసేసరికి ఆసీస్ జట్టు ఆధిపత్యం చెలాయించింది. కానీ రెండో హాఫ్ లో భారత జట్టు పుంజుకుంది. ఆట 49వ నిమిషంలో వందన కార్తీకేయ భారత్ తరపున తొలి గోల్ కొట్టింది. ఆ తర్వాత కూడా భారత్ కు గోల్ కొట్టే అవకాశాలు వచ్చినా భారత ఆటగాళ్లు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. కీలక పెనాల్టీ కార్నర్ లు మిస్ చేసుకున్నారు. చివరికి మ్యాచ్ 1-1 తో టై అయింది.
ఫలితం తేలకపోవడంతో షూట్ అవుట్ ద్వారా ఫలితం నిర్ణయించారు. అయితే ఆసీస్ తరఫున అంబ్రోసియా మెలోన్, కైట్లిన్ నోబ్స్, అమీ లాటన్ లు గోల్ కొట్టారు. కానీ భారత్ తరఫున నేహా, లల్రేమసైమి, నవనీత్ కౌర్ లు గోల్స్ కొట్టడానికి ప్రయత్నించినా ఆసీస్ గోల్ కీపర్ అలీషా పవర్.. తన అనుభవన్నంతా ఉపయోగించి భారత్ కు ఒక్క గోల్ కూడా రాకుండా అడ్డుకుంది.
ఈ గెలుపుతో ఆసీస్.. ఫైనల్స్ కు అర్హథ సాధించింది. ఇక భారత జట్టు.. కాంస్యం కోసం న్యూజిలాండ్ తో తలపడనుంది.