ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడలకు ముందు భారత బాక్సింగ్ సమాఖ్య సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ప్రొఫెషనల్ బాక్సర్లలకు దేశం తరపున ఆడనివ్వకుండా బీఎఫ్ఐ నిరాకరిస్తూ వస్తోంది. అయితే తాజాగా అలాంటి బాక్సర్లకు కూడా అధికారిక ఈవెంట్లలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తూ బాక్సింగ్ సమాఖ్య నిర్ణయం తీసుకుంది. దీంతో చాలామంది ప్రొఫెషనల్ బాక్సర్లకు కేవలం తమకోసమే కాకుండా దేశం కోసం కూడా రింగ్ లో సత్తాచాటే అవకాశం లభించనుంది. 

బీజింగ్ ఒలింపిక్స్ లో సత్తాచాటి కాంస్య పతకాన్ని సాధించిన విజేందర్ సింగ్ రెండేళ్లక్రితం ప్రొఫెషనల్ భాక్సర్ గా మారాడు. దీంతో ఈసారి అతడు దేశం తరపున ఒలింపిక్స్ పాల్గొంటాడా...లేదా అన్న డైలమాలో అభిమానులు వుండగా బీఎఫ్ఐ తాజాగా ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో 2020 టోక్యో ఒలింపిక్స్ లో భారత్ తరపున బరిలోకి దిగే అవకాశం విజేందర్ కు లభించింది. 

అయితే ఒలింపిక్స్ మెయిన్ ఈవెంట్స్ కు అర్హత సాధించాలంటే అంతకుముందు క్వాలిఫయింగ్ ఈవెంట్స్ లో రాణించాల్సి వుంటుంది. ఇందులో సత్తాచాటిన బాక్సర్లకే ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. 

బీఎఫ్ఐ తీసుకున్న తాజా నిర్ణయాన్ని విజేందర్ స్వాగతించాడు. దీనికోసం తాము ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నామని తెలిపాడు. ప్రొఫెషనల్ బాక్సర్ గా మా కోసం మేం ఆడతాం.  కానీ  ఒలింపిక్స్ వంటి క్రీడలు దేశం కోసం ఆడతామని అన్నాడు. ఒక్కసారి త్రివర్ణ పతాకంతో కూడిన షర్ట్ ను ధరించామంటే తమను తామే  మరిచిపోతామని అన్నాడు. ప్రతిష్టాత్మక క్రీడల్లో దేశం కోసం పోరాడే అవకాశం రావడం అదృష్టం. అలాంటి అదృష్టం మరోసారి తనకు రావాలని...ఈసారి స్వర్ణ పతకమే లక్ష్యంగా పోరాడతానని విజేందర్ పేర్కొన్నాడు.