పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు త్రినాంకుర్‌ నాగ్‌(26)  ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డారు.   రైల్వే ఉద్యోగి అయిన త్రినాంకుర్‌ రైల్వే కార్‌ షెడ్‌లో పని చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే..  కోల్‌కతాకు చెందిన త్రినాంకుర్‌కు చిన్న నాటి నుంచే బ్యాడ్మింటన్‌ పట్ల ఆసక్తి కనబరిచేవాడు. ఈ క్రమంలోనే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పలు టోర్నీల్లో విజేతగా నిలిచాడు. ప్రస్తుతం ఇతడు రాష్ట్ర డబుల్స్‌ నంబర్‌ వన్‌ ర్యాంకింగ్‌ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

కాగా స్పోర్ట్స్‌ కోటాలో రైల్వే ఉద్యోగం పొందిన త్రినాంకుర్ ప్రస్తుతం ఈస్ట్రన్‌ రైల్వేస్‌లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రైల్వే కార్‌ షెడ్‌లో విధులు నిర్వర్తిసున్న సమయంలో హై టెన్షన్‌ కరెంటు తీగ తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో అతడిని బీ ఆర్‌ సింగ్‌ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు రైల్వే అధికారులు తెలిపారు.