Asianet News TeluguAsianet News Telugu

నీరజ్ చోప్రా జావెలిన్ త్రోని కోటిన్నరకి కొనుగోలు చేసిన బీసీసీఐ... టోక్యో ఒలింపిక్స్‌లో...

ఈ-వేలంలో టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా వాడిన జావెలిన్ త్రోని రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసిన బీసీసీఐ...

BCCI bought Neeraj Chopra's javelin during e-auction for 1.5 crores after Tokyo Olympics gold
Author
First Published Sep 2, 2022, 6:50 PM IST

టోక్యో ఒలింపిక్స్ 2020లో పతకాలు నెగ్గిన, ప్రాతినిథ్యం వహించిన అథ్లెట్లు వాడిన జెర్సీలు, క్రీడా పరికరాలు, బ్యాట్లను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేలం వేసిన విషయం తెలిసిందే. టోక్యో నుంచి స్వదేశానికి వచ్చిన తర్వాత భారత అథ్లెట్లను ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. ఈ సమయంలో అథ్లెట్లు, తాము వాడిన క్రీడా పరికరాలను మోదీకి కానుకగా ఇచ్చారు...

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన నీరజ్ చోప్రా, తన జావెలిన్ త్రోని, భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు తన షెటిల్ బ్యాట్‌ని, ఫెన్సర్ భవానీ దేవీ తాను వాడిన కత్తిని ప్రధాని నరేంద్ర మోదీకి కానుకగా ఇచ్చారు. ఇలా మోదీ కార్యాలయానికి చేరిన క్రీడా పరికరాలన్నింటినీ, కేంద్రం ఈ-వేలంలో అమ్మకానికి పెట్టింది...

వీటిని అమ్మగా వచ్చిన మొత్తాన్ని ప్రధాన మంత్రి సహాయ నిధికి వాడతామని కేంద్ర క్రీడా సంస్కృతిక శాఖ తెలియచేసింది. ఈ వేలంలో టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా వాడిన జావెలిన్ త్రో... ఏకంగా రూ.కోటిన్నర పలికింది.

ఇంత భారీ మొత్తం చెల్లించి, జావెలిన్ త్రోని కొనుగోలు చేసింది మరెవరో కాదు... వరల్డ్స్ రిచెస్ట్ క్రికెట్ బోర్డు బీసీసీఐ. అవును... భారత క్రికెట్ బోర్డే, నీరజ్ చోప్రా వాడిన జావెలిన్ త్రోని రూ.1.5 కోట్లు చెల్లించి ఈ వేలంలో కొనుగోలు చేసిందట...

టోక్యో ఒలింపిక్స్‌లో విజేతలుగా నిలిచిన అథ్లెట్లను సన్మానించడానికి, వారి స్పాన్సర్‌షిప్ కోసం భారీగా ఖర్చు చేసింది భారత క్రికెట్ బోర్డు. విశ్వవేదికపై పతకాలు గెలిచి, భారత గౌరవాన్ని నిలబెట్టిన భారత అథ్లెట్లకు కోట్లల్లో నగదు బహుమతులను ప్రకటించింది బీసీసీఐ...

నీరజ్ చోప్రా, బాక్సర్ లవ్‌లీనా, బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుతో పాటు వెయిట్‌ లిఫ్టర్ మీరాభాయి ఛానుకి తలా కోటి రూపాయల నగదు బహుమతిని అందించింది బీసీసీఐ. అలాగే ఒలింపిక్స్ విజేతలను సత్కరించడానికి, సన్మానించడానికి మరో రూ.14 కోట్ల దాకా ఖర్చు చేసింది... భారత్‌లో క్రీడాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చిన బీసీసీఐ, ఒలింపిక్ అసోసియేషన్‌తో చేతులు కలిపింది. 

వచ్చే ఒలింపిక్స్ సమయానికి భారత్‌కి పతకాలు తేగల క్రీడాకారులను గుర్తించేందుకు, వారికి సరైన గైడెన్స్ ఇచ్చేందుకు రూ.100 కోట్ల వరకూ ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతోంది భారత క్రికెట్ బోర్డు. అయితే ఇందులో ఎంత వరకూ కరెక్టుగా వాడతారన్నదే సగటు భారతీయుడికి కూడా తెలుసు.

ఐపీఎల్ 2023-27 ప్రసార హక్కుల విక్రయం ద్వారా రూ.48 వేల కోట్లు ఆర్జించిన భారత క్రికెట్ బోర్డు, ఆ మొత్తాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తెలియక ఇలా అనవసర ఖర్చులు చేస్తోందని వాపోతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఇలా హంగులు, ఆర్భాటాలకు వృథాగా కోట్లకు కోట్లు ఖర్చు పెట్టే బదులు ఆ మొత్తాన్ని అవకాశం కోసం ఎదురుచూస్తున్న పేద పిల్లల్లోని టాలెంట్‌ని గుర్తించి, వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడం కోసం వాడితే బాగుంటుందని సలహా ఇస్తున్నారు...

Follow Us:
Download App:
  • android
  • ios