Asianet News TeluguAsianet News Telugu

ఆసీస్ గడ్డపై భారత్ చారిత్రక విజయం.. బ్యాట్స్‌మెన్ల పాత్ర ఎంత..?

నాలుగు టెస్టుల బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్లు కీలకపాత్ర పోషించారు. వారే ఛతేశ్వర్ పుజారా, వికెట్ కీపర్ రిషబ్ పంత్, కెప్టెన్ విరాట్ కోహ్లీ. వీరు ముగ్గురు ఆపద సమయంలో అద్భుతంగా ఆడి జట్టును కాపాడారు. 

batsman role over Team India historic series win in Australia
Author
Sydney NSW, First Published Jan 7, 2019, 2:05 PM IST

సుమారు 72 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపైనే ఓడించి టీమిండియా చరిత్ర సృష్టించింది. దిగ్గజాల వల్ల కానీ విజయాన్ని కోహ్లీ సేన సాధించడంతో పలువురు మాజీ క్రికెటర్లు, భారత అభిమానులు టీమిండియాకు అభినందలు తెలిపారు. మరి ఇంతటి చారిత్రక విజయం ఒక్కరి వల్ల సాధించలేదు.

ఇది సమిష్టి విజయం బౌలర్లు, బ్యాట్స్‌మెన్లు కలిసికట్టుగా ఆడి జట్టు విజయానికి సాయం చేశారు. నాలుగు టెస్టుల బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్లు కీలకపాత్ర పోషించారు. వారే ఛతేశ్వర్ పుజారా, వికెట్ కీపర్ రిషబ్ పంత్, కెప్టెన్ విరాట్ కోహ్లీ. వీరు ముగ్గురు ఆపద సమయంలో అద్భుతంగా ఆడి జట్టును కాపాడారు. 

ఛతేశ్వర పుజారా: ముందుగా చెప్పుకోవాల్సింది పుజారా గురించే.. ఓపెనర్ల తర్వాత ఫస్ట్ డౌన్‌లో వచ్చే బ్యాట్స్‌మెన్ వికెట్ల పతనాన్ని అడ్డుకోవడంతో పాటు ప్రత్యర్థి జట్టు బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఆ పనిని పుజారా సమర్థవంతంగా పోషించాడు. ముఖ్యంగా అత్యంత కీలకమైన మెల్‌బోర్న్ టెస్టులో పుజారా సెంచరీ సాధించాడు. దీనిని సాధించడానికి ఎన్నో బంతులను ఎదుర్కోన్నాడని మాజీలు విమర్శించినా.. ఆ ఇన్నింగ్స్ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించేందుకు ఉపకరించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 137 పరుగుల తేడాతో గెలుపొంది 2-1 తేడాతో సిరీస్‌లో ఆధిక్యంలోకి వచ్చింది. ఇక చివరిదైన సిడ్నీ టెస్ట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. నాలుగో టెస్టులో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపిన పుజారా రెండు రోజుల పాటు అడ్డుగోడలా క్రీజులో నిలబడి 193 పరుగులు సాధించాడు. తృటిలో డబుల్ సెంచరీని కోల్పోయాడు. అతను వేసిన పునాదిపై పంత్, జడేజా అద్భుతమైన ఇన్నింగ్స్‌ను నిర్మించి 622 పరుగుల భారీ స్కోరు సాధించారు. ఈ సిరీస్‌లో అద్బుత ఆటతీరు ద్వారా రాహుల్ ద్రావిడ్ తర్వాత ‘‘సెకండ్ వాల్’’ అన్న పేరును సంపాదించాడు. మొత్తం 1258 బంతులను ఎదుర్కొని దిగ్గజాల సరసన నిలిచాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 3 సెంచరీ లు చేసి మొత్తం 521 పరుగులతో టాప్ స్కోరర్‌గా ‘‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’’గా నిలిచాడు. 

రిషబ్ పంత్: వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌గా మాజీ కెప్టెన్ ధోనీ టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించారు. టెస్టుల్లోకి అరంగేట్రం నుంచి ఇతనికి ధోనితో పోలిక పెట్టడం మొదలుపెట్టారు. దానిని ఏమాత్రం వొమ్ము చేయకుండా అద్భుతంగా ఆడుతున్నాడు రిషబ్ పంత్.

అడిలైడ్, పెర్త్ టెస్టుల్లో పెద్దగా ఆకట్టుకోని పంత్ మెల్‌బోర్న్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 39, 33 పరుగులు చేశాడు. అయితే వికెట్ కీపర్‌గా తన సత్తా ఏంటో చూపించాడు. ఈ సిరీస్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 20 మంది ఆసీస్ ఆటగాళ్లను పెవిలియన్‌కు చేర్చి భవిష్యత్‌లో తన ప్లేస్‌ను సుస్థిరం చేసుకున్నాడు.

ఇక సిడ్నీ టెస్టులో అయితే పంత్ వీరవిహారం చేశాడు. వన్డే తరహా ఆటతీరుతో జట్టు భారీ స్కోరు సాధించడంలో సాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా ఆసీస్ గడ్డపై సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు.

అంతేకాకుండా ఆసియాకు ఆవల రెండు సెంచరీలు సాధించిన భారత వికెట్ కీపర్‌గానూ, పాకిస్తాన్‌‌తో ఫైసలాబాద్‌లో జరిగిన టెస్టులో 148 పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన వికెట్ కీపర్‌గా ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. మొత్తం మీద బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో 58.33 సగటుతో 350 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ కూడా ఉంది.

విరాట్ కోహ్లీ: ఈ ఏడాది సూపర్ ఫాంలో ఉన్న టీమిండియా సారథి ఆస్ట్రేలియా గడ్డపైనా ఫాంను కంటిన్యూ చేసే ప్రయత్నం చేశాడు. అయితే తొలి రెండు టెస్టుల్లో అద్భుతంగా ఆడిన కోహ్లీ మెల్‌బోర్న్, సిడ్నీ టెస్టుల్లో అంతగా ఆకట్టుకున్నాడు.

పెర్త్ టెస్టులో 25వ సెంచరీ సాధించిన విరాట్.. ఆస్ట్రేలియాలో 6 సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా సచిన్ సరసన చేరాడు. సచిన్ ఈ ఘనతను 20 మ్యాచ్‌ల్లో సాధిస్తే... కోహ్లీ కేవలం 10 మ్యాచ్‌ల్లోనే ఈ మార్క్ అందుకున్నాడు.

అలాగే 25 సెంచరీలు చేయడానికి సచిన్ 130 ఇన్నింగ్స్‌లు తీసుకుంటే.. కోహ్లీ కేవలం 127 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. ఆసీస్ ఆల్‌టైమ్ గ్రేట్ సర్ డాన్ బ్రాడ్‌మన్ 68 ఇన్నింగ్స్‌ల్లోనే 25 సెంచరీల మార్క్‌ను అందుకుని అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. మొత్తం మీద ఈ సిరీస్‌లో కోహ్లీ 282 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ కూడా ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios