బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఆ దేశ క్రికెట్ కెప్టెన్ మోర్తాజా ఘన విజయం సాధించాడు. వన్డే కెప్టెన్‌గా కొనసాగుతూనే రాజకీయాల్లోకి ప్రవేశించిన మోర్తాజా అధికార అవామీ లీగ్ పార్టీ తరపున నరైల్-2 నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాడు.

ఇవాళ జరిగిన ఓట్ల లెక్కింపులో మోర్తాజా తన సమీప ప్రత్యర్థిపై 2,74,418 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించాడు. మరోవైపు ఎన్నికల ఫలితాల్లో ప్రధాని షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ కూటమి దూసుకుపోతోంది.

ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు అవామీ లీగ్ 260 సీట్లను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సారథ్యంలోని కూటమి కేవలం 7 స్థానాలతో సరిపెట్టుకుంది.

ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో విజయం సాధించారు. బంగ్లాదేశ్ పార్లమెంట్‌కు ఆదివారం జరిగిన ఎన్నికలు హింసాత్మకంగా ముగిశాయి. పోలింగ్‌ సందర్భంగా చెలరేగిన హింసలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.