Asianet News TeluguAsianet News Telugu

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 విజేతగా యాష్లే బార్టీ... 44 ఏళ్ల తర్వాత మొట్టమొదటి ఆస్ట్రేలియా మహిళాగా...

ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో అమెరికా టెన్నిస్ ప్లేయర్ డానియల్ కొలిన్స్‌పై యాష్లే బార్టీ... 44 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచిన మహిళగా...

Australian Open 2022: Ash Barty wins AO2022, First women to after 44 Years beats Danielle Collins
Author
India, First Published Jan 29, 2022, 6:10 PM IST

Australian Open 2022 మహిళల సింగిల్స్‌ విజేతగా నిలిచింది యాష్లే బార్టీ. పేరుకే ఆస్ట్రేలియన్ ఓపెన్ అయినా, అప్పుడెప్పుడో 1978 తర్వాత ఇప్పటిదాకా ఈ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ని ఆస్ట్రేలియా మహిళా ప్లేయర్లు సాధించలేకపోయారు. దీంతో 44 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన ఆస్ట్రేలియా మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది యాష్లే బార్టీ...

మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో అమెరికా టెన్నిస్ ప్లేయర్ డానియల్ కొలిన్స్‌తో తలబడిన యాష్లే బార్టీ... 6-3, 7-6 తేడాతో వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తు చేసి టైటిల్ సాధించింది. 1978లో ఆస్ట్రేలియాకి చెందిన క్రిస్టిన్ ఓనెల్, ఆస్ట్రేలియాన్ ఓపెన్ గెలిచింది. అంతకుముందు కానీ, ఆ తర్వాత కానీ ఆస్ట్రేలియా మహిళా టెన్నిస్ స్టార్లు ఎవ్వరూ ఈ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలవలేకపోయారు...

1980లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ చేరిన ఆసీస్ ప్లేయర్ వెండీ టర్నబుల్, రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఒకనొక దశలో యంగ్ ప్లేయర్ డానియల్ కొలిన్స్ జోరుకి 1-5 తేడాతో వెనకబడిన యాష్ బార్టీ, అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చి వరుస గేమ్‌లతో సెట్‌నే సొంతం చేసుకోవడం విశేషం...

నెం.1 టెన్నిస్ సీడ్ యాష్ బార్టీకి కెరీర్‌లో ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్. ఇంతకుముందు 2019లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచిన యాష్ బార్టీ, 2021లో వింబుల్డన్ టైటిల్ గెలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో మొదటి రౌండ్ నుంచే నిష్కమించిన యాష్ బార్టీ, అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది.

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 ఫైనల్‌ మ్యాచ్‌లో రష్యన్ టెన్నిస్ స్టార్ డానిల్ మెడ్వెదేవ్‌తో తలబడబోతున్నాడు స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్... ఇటాలియన్ టెన్నిస్ ప్లేయర్ మత్తాయో బెర్రెటినీతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 6-3, 6-2, 3- 6, 3-6 తేడాతో విజయం సాధించిన రఫెల్ నాదల్... కెరీర్‌లో ఆరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కి అర్హత సాధించాడు..

2009లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన రఫెల్ నాదల్, ఆ తర్వాత నాలుగు సార్లు ఫైనల్ చేరినా టైటిల్ మాత్రం గెలవలేకపోయాడు. చివరిగా 2019లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లోకి చేరిన రఫెల్ నాదల్, తుదిపోరులో సెర్బియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జొకోవిచ్ చేతుల్లో ఓడిపోయాడు...

ఓవరాల్‌గా రఫెల్ నాదల్‌కి ఇది 29వ గ్రాండ్ స్లామ్ ఫైనల్. ఫైనల్ మ్యాచ్‌లో నాదల్ టైటిల్ సాధిస్తే, రికార్డు స్థాయిలో 21వ గ్రాండ్ స్టామ్ టైటిల్‌ను సొంతం చేసుకుంటాడు... 

గ్రీక్ టెన్నిస్ ప్లేయర్ స్టెఫనోస్ సిట్సీపస్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 6-7, 4-6, 6-4, 6-1 తేడాతో విజయాన్ని అందుకుని ఫైనల్‌కి దూసుకొచ్చాడు డానిల్ మెడ్వదేవ్. ఇంతకుముందు రష్యన్ టెన్నిస్ స్టార్ డానిల్ మెడ్వేదేవ్‌తో నాలుగు మ్యాచులు ఆడగా, మూడింట్లో నాదల్‌కి విజయం దక్కింది...

2020 ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన తర్వాత గాయాలతో సతమతమవుతున్న రఫెల్ నాదల్, రెండున్నరేళ్లుగా సరైన విజయాలు అందుకోవడానికి తెగ ఇబ్బంది పడుతున్నాడు.  కాలి గాయం నుంచి కోలుకున్న తర్వాత రఫెల్ నాదల్‌కి దక్కిన అతిపెద్ద విజయం ఇదే.

Follow Us:
Download App:
  • android
  • ios