2018 మహిళల టీ20 ప్రపంచకప్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. అంటిగ్వాలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్‌లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది.. అయితే ఆసీస్ బౌలర్ల ధాటికి పరుగులు రావడం కష్టమైంది.

క్రమం తప్పకుండా వికెట్లు పడుతుండటంతో ఇంగ్లీష్ జట్టు 19.4 ఓవర్లలో 105 పరుగులకు అలౌట్ అయ్యింది. ఓపెనర్ వ్యాట్ 43, కెప్టెన్ వైట్ 25 పరుగులు చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సాయపడ్డారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు రంగంలోకి దిగిన ఆసీస్ ఆడుతూ పాడుతూ టార్గెట్ ఫినిష్ చేసింది.

ఓపెనర్లు మెరుపు ఆరంభాన్నివ్వగా తర్వాత వచ్చిన గార్డినర్ 33, కెప్టెన్ లానింగ్ 28 భారీ షాట్లతో అలరించడంతో 15.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణించిన గార్డెనర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా.. టోర్నీలో నిలకడగా రాణించిన హేలీకి ‘‘ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’’ దక్కింది.

మరోవైపు టోర్నీని ప్రవేశపెట్టిన దగ్గరి నుంచి ఈ టైటిల్‌ను ఆసీస్ గెలవడం ఇది నాలుగోసారి.. ఇంతకు ముందు 2010, 12, 14లలో ఆస్ట్రేలియా జగజ్జేతగా ఆవిర్భవించింది. 2020 టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియా వేదికగా జరుగుతుంది.