ఇస్లామాబాద్: పాకిస్తాన్ కు ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది. తమ దేశంలో రెండు అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచులు ఆడాలని పాకిస్తాన్ చేసిన ప్రతిపాదనను ఆస్ట్రేలియా తిరస్కరించింది. భద్రతా కారణాలను చూపుతూ పాకిస్తాన్ లో తాము ఆడలేమని స్పష్టం చేసింది. 

సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ కథనం ప్రకారం.... పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదనను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రస్తుతానికి తిరస్కరించినప్పిటకీ భవిష్యత్తులో ఆ విషయంపై ఆలోచన చేయనున్నట్లు తెలిపింది. 

తమ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది భద్రత తమ ప్రథమ ప్రాధాన్యమని, ఆ విషయంలో తాము రాజీ పడబోమని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. 

పాకిస్తాన్ తో యుఎఈలో ద్వైపాక్షిక మ్యాచులు ఆడాలనే తమ నిర్ణయం నుంచి ప్రస్తుతం వెనక్కి తగ్గలేమని, తర్వాతి సిరీస్ పాకిస్తాన్ లో జరిగే విషయంపై ఆలోచన చేస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా అధికార ప్రతినిధి తెలిపారు. 

అయితే, తమ ప్రతిపాదనను ఆస్ట్రేలియా తిరస్కరించిందనే వార్తలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబి) ఖండిస్తోంది. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పింది. 

తమ సమస్యలను తగిన రీతిలో పరిష్కరిస్తే పాకిస్తాన్ లో మ్యాచులు ఆడడానికి తమకు అభ్యంతరం లేదని ఆస్ట్రేలియా వన్డే జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్, పాకిస్తాన్ సంతతికి చెందిన ఆసీస్ క్రికెట్ ఉస్మాన్ ఖవాజా అన్నారు.