ఏషియన్ గేమ్స్ 2023: టీమిండియా గోల్డ్ హ్యాట్రిక్.. సెమీస్‌లో ఓడిన భారత మహిళా హాకీ టీమ్..
స్వర్ణం నెగ్గిన భారత ఆర్చరీ పురుషుల కాంపౌండ్ టీమ్... సెమీ ఫైనల్ చేరిన భారత పురుషుల కబడ్డీ జట్టు... ఏడేళ్ల తర్వాత చైనా చేతుల్లో ఓడిన భారత మహిళా హాకీ జట్టు..
ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. అక్టోబర్ 5న భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు చేరాయి. స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్‌లో దీపికా పల్లికల్- హరీందర్ పాల్ సింగ్ స్వర్ణం గెలిచారు. అలాగే ఆర్చరీ మహిళా కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో జ్యోతి, అదితి, పర్‌ణీత్, చైనీస్ తైపాయ్‌తో జరిగిన ఫైనల్‌లో గెలిచి పసిడి పతకం పట్టేశారు. తాజాగా భారత ఆర్చరీ పురుషుల కాంపౌండ్ టీమ్ కూడా పసిడి పతకాన్ని గెలిచింది..
ఆర్చరీ పురుషుల కాంపౌండ్ టీమ్ ఫైనల్‌లో భారత ఆర్చర్లు ఓజాస్ డియోటెల్, అభిషేక్ వర్మ, ప్రథమేశ్ జాకర్, సౌత్ కొరియా జోహూన్ జూ, జీవాన్ యంగ్, జాంజో కిమ్‌తో జరిగిన మ్యాచ్‌లో 235-230 పాయింట్ల తేడాతో గెలిచారు. భారత్ ఖాతాలో ఇది 21వ గోల్డ్ మెడల్.
భారత పురుషుల కబడ్డీ జట్టు, వరుస విజయాలతో సెమీ ఫైనల్‌కి ప్రవేశించింది. గ్రూప్ స్టేజీలో జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 56-30 తేడాతో విజయం అందుకుంది భారత జట్టు. అక్టోబర్ 6న పాకిస్తాన్‌తో సెమీ ఫైనల్ ఆడుతుంది భారత పురుషుల కబడ్డీ జట్టు..
భారత మహిళల హాకీ జట్టు సెమీ ఫైనల్‌లో పరాజయం పాలైంది. వరల్డ్ 12వ ర్యాంకులో ఉన్న చైనాతో జరిగిన మ్యాచ్‌లో 0-4 తేడాతో ఓడింది వరల్డ్ నెం.7 భారత జట్టు. నవంబర్ 2016 నుంచి వరుసగా చైనాపై 11 మ్యాచులు గెలిచిన భారత జట్టు, ఫైనల్ చేరే ఛాన్స్‌ని చేజార్చుకుంది.
రెజ్లింగ్‌లో భారత మహిళా రెజర్ల్ అంటిమ్ పంగల్, కాంస్యం గెలిచింది. మంగోలియా రెజ్లర్ బట్ ఓచిర్ బోలోర్‌తుయాతో జరిగిన మ్యాచ్‌లో 3-1 విజయాన్ని అందుకుంది అంటిమ్. ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భారత్‌కి ఇది 86వ మెడల్..
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ హెచ్.ఎస్ ప్రణయ్ సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించాడు. వరల్డ్ నెం.2 ర్యాంకర్ లీ జీ జియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 21-16, 21-23, 22-20 తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకున్నాడు ప్రణయ్. గత 41 ఏళ్లలో ఏషియన్ గేమ్స్‌లో సెమీస్ చేరిన భారత పురుష బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా నిలిచాడు ప్రణయ్. ఇంతకుముందు 1982 ఏషియన్ గేమ్స్‌లో సయ్యద్ మోదీ, సెమీస్ చేరి కాంస్యం గెలిచాడు.