ఏషియన్ గేమ్స్ 2023: గురి చూసి కొడుతున్న భారత షూటర్లు.. భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు..
భారత్ ఖాతాలో ఒకే రోజు 5 పతకాలు.. షూటింగ్‌లో మరో రెండు స్వర్ణాలు.. టెన్నిస్ డబుల్స్‌లో రజత పతకం.. నిరాశపరిచిన పీవీ సింధు..
ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. మిగిలిన అథ్లెట్ల నుంచి ఆశించిన స్థాయి పర్ఫామెన్స్ రాకపోయినా షూటింగ్‌లో మాత్రం భారత్‌కి పతకాల పంట పండుతోంది. తాజాగా మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్‌లో భారత్ ఓ స్వర్ణం, ఓ రజతం కైవసం చేసుకుంది..
పాలక్ గులియా, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించగా, ఇషా సింగ్ రజతం గెలిచింది. మెన్స్ టీమ్ 50 మీటర్ల రైపిల్ 3పీ ఈవెంట్‌లో భారత షూటింగ్ టీమ్ సభ్యులు ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, స్వప్నిల్ కుశాల్, అఖిల్ షోరెన్ స్వర్ణం కైవసం చేసుకున్నారు..
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో పాలక్ గులియా, దివ్యా తండిగోల్ కలిసి రజతం గెలిచారు. టెన్నిస్‌లో మెన్స్ డబుల్ ఈవెంట్‌లో ఫైనల్ చేరిన సాకేత్ మెనేని, రామ్‌కుమార్ రామనాథన్ రజతంతో సరిపెట్టుకున్నారు..
ఏషియన్ గేమ్స్‌లో భారత్ ఈ రోజు 9:40 సమయానికి 5 పతకాలు గెలిచింది. ఇందులో రెండు స్వర్ణాలు, మూడు రజత పతకాలు ఉన్నాయి. భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మానికా బత్రా, క్వార్టర్ ఫైనల్‌కి చేరింది. థాయిలాండ్ ప్లేయర్ సుథాసినీ సవేత్తబట్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-2 తేడాతో విజయం సాధించింది మానికా బత్రా.
టేబుల్ టెన్నిస్ పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో భారత టాప్ ప్లేయర్లు శరత్ కమల్, సాథియన్ రౌండ్16 నుంచి నిష్కమించారు. చైనా జోడి జెండాంగ్ ఫాన్- చుకిన్ వాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 0-3 తేడాతో ఓడింది భారత టీటీ మెన్స్ జోడి..
స్విమ్మింగ్ 200 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో భారత స్విమ్మర్ సజన్ ప్రకాశ్, 1:58.40 సెకన్లలో టార్గెట్‌ని అందుకుని ఫైనల్‌కి అర్హత సాధించాడు. బ్యాడ్మింటన్‌లోనూ భారత మహిళా జట్టుకి నిరాశే ఎదురైంది. మహిళల టీమ్ ఈవెంట్‌లో భారత్, థాయిలాండ్ చేతుల్లో 0-3 తేడాతో చిత్తుగా ఓడింది.
టాప్ సీడ్ పీవీ సింధు, వరల్డ్ నెం.12వ ర్యాంకర్ ప్లేయర్‌తో ఓడిపోయింది. త్రిషా - జోలి జోడితో పాటు అస్మిత్ కూడా థాయిలాండ్ షెటర్ల చేతిలో ఓడిపోయారు.