Suryakumar Yadav : ఆసియా కప్ డబ్బంతా ఆర్మీకే..: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Suryakumar Yadav : దాయాది పాకిస్థాన్ ని చిత్తుచిత్తుగా ఓడింది ఆసియా కప్ 2025 విజేతగా నిలిచింది టీమిండియా. ఈ ఆనందాన్ని రెట్టింపు చేసేలా ఇండియన్ ఆర్మీకి అద్భుత బహుమతి ప్రకటించారు సూర్యకుమార్ యాదవ్.

సూర్యకుమార్.. నువ్వు సూపర్ సామీ
Suryakumar Yadav : ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసియా కప్ 2025 టోర్నీ ఆరంభం నుండి తన ఆటతోనే కాదు నిర్ణయాలతోనూ అభిమానులకు ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ తో మ్యాచ్ సమయంలో ఆ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, ఆట సమయంలోనూ వారితో టీమిండియా ఆటగాళ్ళు కనీసం పలకరించకపోవడం చర్చనీయాంశంగా మారింది. టీమిండియా ఆటగాళ్లతీరు అంతర్జాతీయ స్థాయిలో కాస్త వివాదాస్పదంగా మారినా ఇండియన్స్ ని మాత్రం ఆకట్టుకుంది. పహల్గాం ఉగ్రదాడి వెనక పాకిస్థాన్ ఉందన్నది కాదనలేని నిజం.. అలాంటి శత్రుదేశంతో స్నేహం వద్దని భారతీయులు కోరుకుంటున్నారు... అందుకు తగ్గట్లుగానే పాక్ తో మ్యాచ్ సమయంలో జెంటిల్ మెన్స్ లా వ్యవహరించారు టీమిండియా ఆటగాళ్లు.
ఆసియా కప్ ఫీజంతా ఆర్మీకే : సూర్యకుమార్ యాదవ్
అయితే పాకిస్థాన్ తో ఆసియా కప్ ఫైనల్లో తలపడిన సూర్యసేన మరో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మెగా టోర్నీలో పాక్ తోనే కాదు ఆడిన ప్రతి మ్యాచ్ లో విజయం సాధించింది భారత జట్టు. ఇలా టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడిన టీమిండియా తన ఖాతాలో మరో ఐసిసి ఆసియా కప్ విజయాన్ని వేసుకుంది. శత్రుదేశం పాకిస్థాన్ ను చిత్తుచేసిమరీ సాధించిన ఈ విజయం చాలా ప్రత్యేకం... దీన్ని మరింత ప్రత్యేకంగా మార్చారు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఈ ఆసియా కప్ ద్వారా తనకు లభించే మొత్తం మ్యాచ్ ఫీజును దేశ రక్షణకోసం పాటుపడుతున్న ఇండియన్ ఆర్మీకి అందించనున్నట్లు ప్రకటించారు కెప్టెన్. ఈ విషయాన్ని పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ సమయంలో సూర్యకుమార్ యాదవ్ ప్రకటించారు.
ఆసియా కప్ ట్రోపీ లేకుండానే టీమిండియా సంబరాలు
అయితే ఆసియా కప్ 2025 విజేతగా నిలిచినా ట్రోఫీని మాత్రం స్వీకరించలేదు టీమిండియా. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే అందరి దృష్టి ట్రోఫీ ప్రదానోత్సవం ఎలా సాగుతుందనేదానిపై నిలిచింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్, ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) ఛైర్మన్ అయిన మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి భారత జట్టు నిరాకరించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియా ఈ నిర్ణయానికి బలంగా కట్టుబడివుంది... అందుకే భారత జట్టు ట్రోఫీ లేకుండానే గెలుపు సంబరాలు చేసుకుంది.
ఫోటో షూట్ కి కూడా సూర్య దూరం
ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ ఆరంభానికి ముందు ఫోటోషూట్ కూడా వివాదంగా సాగింది. ఏదైనా టోర్నమెంట్ లేదా సిరీస్ సమయంలో కెప్టెన్లు ట్రోఫీతో ఫోటోషూట్ తీసుకోవడం ఆనవాయితీ. ముఖ్యంగా ఫైనల్‌కు ముందు రెండు జట్ల ఆటగాళ్లు ట్రోఫీకి ఇరువైపులా నిలబడి ఫోటోలు తీసుకునే సంప్రదాయం ఉంది. కానీ ఈసారి ఆసియా కప్ ఫైనల్‌కు ముందు జరిగిన ట్రోఫీ ఫోటోషూట్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ పాల్గొనలేదు. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా ట్రోఫీతో ఒంటరిగా నిలబడి ఫోటోలు దిగాడు.
టాస్ సమయంలో ఆసక్తికర ఘటన
అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక మ్యాచ్ టాస్ సమయంలో ఇద్దరు వ్యాఖ్యాతలు కనిపించడం ఇదే తొలిసారి. తొలి రెండు భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన రవిశాస్త్రి ఫైనల్ మ్యాచ్‌కు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించాల్సి ఉంది. అయితే రవిశాస్త్రితో పాటు మరొక వ్యాఖ్యాతను నియమించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ను అభ్యర్థించింది. దీంతో రవిశాస్త్రితో పాటు వకార్ యూనిస్‌ను వ్యాఖ్యాతలుగా నియమించింది. టాస్ సమయంలో రవిశాస్త్రి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్‌ను ఇంటర్వ్యూ చేయగా, వకార్ పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ మాట్లాడాడు.