స్వదేశంలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌(ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్) షూటింగ్‌ ప్రపంచకప్‌లో భారత మహిళా షూటర్‌ అపూర్వి చండీలా రికార్డు మోత మొగించారు. రైఫిల్‌ అండ్‌ పిస్టల్‌ విభాగంలో చండీలా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి స్వర్ణ పతకాన్ని సాధించి సంచలనం సృష్టించారు. ఇలా షూటింగ్ ప్రపంచ కప్ ప్రారంభమైన తొలిరోజే భారత్ కు స్వర్ణంతో శుభారంభం లభించింది.  

10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో పోటీ పడ్డ చండీలా స్వర్ణాన్ని సాధించారు. ఫైనల్లో ఏకంగా 252.9 పాయింట్లు సాధించిన ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇలా ఇప్పటివరకు భారత్ తరపున 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం గెలిచిన రెండో మహిళా షూటర్ గా చండీలా నిలిచారు. అంతకు ముందు ఈ విభాగంలో అంజలీ భగవత్ స్వర్ణాన్ని గెలుచుకున్నారు. 

ఈ విజయం గురించి అపూర్వి చండీలా మాట్లాడుతూ...ఇదంతా ఆషామాషీగా లభించిన స్వర్ణం కాదన్నారు. కాస్త కఠిన పరిస్థితులను దాటుకుంటూ ఈ విజయానికి చేరువైనట్లు పేర్కొన్నారు. ఈ స్వర్ణం కోసం చాలా కష్టపడుతూ ప్రాక్టీస్ చేశానని...అందుకు ఫలితం లభించిందన్నారు. అందుకు తానేంతో సంతోషిస్తున్నానని అన్నారు. ఇదే ఫామ్ భవిష్యత్ లో జరిగే ముఖ్యమైన టోర్నీలలో కొనసాగిస్తానని...అందుకోసం మరింత సాధన చేస్తానని అపూర్వీ వెల్లడించారు.   

10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో అపూర్వీ తర్వాత రెండో స్థానంలో చైనా షూటర్ జావో రౌజూ (251.8 పాయింట్లు),  మరో చైనా షూటర్ జూ హాంగ్ (230.4 పాయింట్లతో)మూడో స్థానంలో నిలిచారు.