Praveen Sobti: ఈ భీముడు క్రీడల్లోనూ తోపే.. భారత్ కు రెండు స్వర్ణ పతకాలు అందించిన ప్రవీణ్ సోబ్తి
Mahabharat’s Bheem Actor Passes Away: ఆరడుగుల దేహం.. క్రీడాకారులకు ఉండాల్సిన దేహదారుఢ్యం ఆయనకు సహజంగా అబ్బాయి. సినిమాల్లోకి రాకముందే ఆయన విశ్వ వేదికలపై మువ్వన్నెల పతకాన్ని రెపరెపలాడించారు.
భారతదేశంలో 1980- 90వ దశకంలో బుల్లితెరపై ఆబాలగోపాలన్ని పంచిన సీరియర్ ‘మహాభారత..’. దాదాపు భారతీయ భాషలన్నింట డబ్ అయిన ఈ ఎపిక్ సీరియల్ లో.. భీముడి పాత్రదారి ప్రవీణ్ కుమార్ సోబ్తీ (74) సోమవారం రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో కన్నుమూశారు. మహాభారత సీరియల్ కంటే ముందు, తర్వాత పలు సినిమాలలో కూడా నటించిన ప్రవీణ్ కు నటనలోనే కాదు.. క్రీడల్లోనూ ప్రావీణ్యముంది. భారత్ కు ట్రాక్ అండ్ అథ్లెట్ విభాగంలో పలు మేజర్ ఈవెంట్లలో పతకాలను అందించాడు ప్రవీణ్.. ఆసియా గేమ్స్ లో భారత్ కు రెండు స్వర్ణ పతకాలు కూడా సాధించిపెట్టాడు.
పంజాబ్ కు చెందిన ప్రవీణ్ సోబ్తి ఆరడుగులు ఉండేవాడు. సహజంగానే క్రీడాకారుడి దేహదారుడ్యం అతడికి అబ్బింది. 6 అడుగుల ఆరు అంగుళాలు ఉన్న ప్రవీణ్.. డిస్కస్ త్రో తో పాటు హ్యమర్ త్రో (షాట్ పుట్ వంటి ఒక గుండ్రటి రాతికి తాడు కట్టి విసేరిది) లో కూడా నిష్ణాతుడు. ఈ రెండు విభాగాల్లో అతడు భారత్ కు ఆసియా గేమ్స్ లో నాలుగు పతకాలు కూడా సాధించిపెట్టాడు. ఇందులో రెండు స్వర్ణాలు ఉండగా.. ఒక రజతం, ఒక కాంస్యం ఉంది.
ఒలింపిక్స్ లో కూడా..
ఆసియా గేమ్స్ తో పాటు ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్స్ లో కూడా భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించిన ప్రవీణ్.. 1968లో మెక్సికో లో జరిగిన ఒలింపిక్ గేమ్స్ తో పాటు ఆ తర్వాత 1972 మునిచ్ ఒలింపిక్స్ లో కూడా భారత్ తరఫున పాల్గొన్నాడు. టెహ్రాన్ లో 1974లో జరిగిన ఆసియా గేమ్స్ లో డిస్కస్ త్రో విభాగంలో స్వర్ణం సాధించాడు. ఆసియా గేమ్స్ తో పాటు ఇతర ఈవెంట్లలో రాణించిన ప్రవీణ్.. ఒలింపిక్స్ లో పతకం నెగ్గాలన్న కల నెరవేరలేదు.
క్రీడల్లో రాణించడంతో అతడికి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో డిప్యూటీ కమాండెంట్ గా ఉద్యోగం వచ్చింది. క్రీడల్లో అతడు చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం అతడిని అర్జున అవార్డుతో సత్కరించింది.
బాలీవుడ్ ఎంట్రీ..
కాగా.. 1970వ దశకం లో క్రీడల నుంచి మెల్లగా నిష్క్రమించిన ప్రవీణ్ చూపు వెండితెర మీద పడింది. ‘రక్ష’ చిత్రంతో హిందీ పరిశ్రమలోకి నటుడిగా అడుగుపెట్టిన ఆయన.. బాలీవుడ్ మెగాస్టార్ నటించిన షాహెన్షా చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత ఘజాబ్, హమ్ సే హై జమానా, జగీర్, యుద్ద్, జబర్దస్త్, మహాశక్తిమాన్, సింగాసన్.. వంటి ఎన్నో హిట్ సినిమాలలో నటించారు. తెలుగులో కూడా ఆయన ‘కిష్కింద కాండ’ అనే సినిమాలో నటించారు.
క్రీడాకారుడిగా రాణించినా.. బాలీవుడ్ సినిమాలలో మెరిసినా రాని పేరు ప్రఖ్యాతులు ఆయనకు ‘మహాభారత’ సీరియల్ కల్పించింది. ఈ ధారావాహికలో భీముని పాత్రకు ఆయన సరిగ్గా సరిపోయారు. బీఆర్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన ఈ ఎవర్ గ్రీన్ సీరియల్ తో ఆయన ఇమేజ్ ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్లింది.
రాజకీయాల్లోకి..
క్రీడలు, సినిమాతో పాటు రాజకీయాల్లో కూడా ఆయన తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2013లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. 2013 ఎన్నికల్లో ఆప్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఆయన బీజేపీలో చేరారు.