ఆసియా కప్ లో అప్ఘానిస్తాన్ జట్టు సూపర్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఇప్పటికే గ్రూప్ బి లో అగ్రస్థానంలో నిలిచి అప్ఘాన్ సంచలనం సృష్టించింది. శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి అగ్రశ్రేణి జట్లను ఓడించి సూపర్ 4 కు చేరుకుంది. అయితే శుక్రవారం సూపర్ 4 లో బాగంగా జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు ను కూడా ఓడించినంత పని చేసింది. అయితే చివరివరకు పోరాడిన పాక్ చివరి ఓవర్లో విజయం సాధించి గట్టెక్కింది.

మొదట బ్యాటింగ్ చేసిన అప్ఘాన్ 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. కెప్టెన్ అస్గర్ అప్గాన్ మెరుపు బ్యాటింగ్ కు హహ్మతుల్లా షాహిదీ సమయోచిత షాట్లు తోడవటంతో అప్ఘాన్ మంచి స్కోరు సాధించింది. అస్గర్ 56 బంతుల్లో 67 పరుగులు చేయగా షాహిదీ 118 బంతుల్లో 97 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇతడు కొద్దిలో సెంచరీ మిసయ్యాడు.

ఇక 258 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ కు ఆదిలోనే షాక్ తగిలింది. పరుగుల ఖాతా తెరవకుండానే వఖార్ జమాన్ అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత పాక్ బ్యాట్ మెన్స్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తడ్డారు. రెండో వికెట్‌కి ఓపెనర్‌ ఇమామ్, బాబర్‌ ఆజమ్‌ 154 పరుగుల బాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో ఇమామ్ రనౌట్ మ్యాచ్ ను మలుపుతిప్పింది. ఆ తర్వాత పాక్ బ్యాట్ మెన్స్ వరుసగా పెవిలియన్ బాట పట్టడంతో ఉత్కంట పెరిగింది.  షోయబ్ మాలిక్ (43 బంతుల్లో 51 నాటౌట్) చివరివరకు క్రీజులో నిలిచి పాక్ కు విజయాన్ని అందించాడు. 

పాక్ 49.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. అప్ఘాన్ సంచలన బౌలర్ రషీద్ ఖాన్ 3, మజీబ్ ఉల్ రెహ్మాన్ 2, గుల్బదిన్ నబి 1 వికెట్ పడగొట్టారు.