2018 సంవత్సరాన్ని భారత జట్టు మంచి జోష్ తో ముగిస్తోంది. దేశీయంగానే కాక విదేశాల్లో జరిగిన సీరిసుల్లో కూడా భారత ఆటగాళ్లు రాణిస్తూ మంచి ఫలితాలను రాబట్టారు. మొత్తానికి అటు జట్టు, ఇటు ఆటగాళ్లు ఐసిసి ర్యాంకింగ్స్ లో టాప్ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇలా టాప్ ర్యాంకులతో 2018 సంవత్సరాకి వీడ్కోలు, 2019సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నారు. తాజాగా ఐసిసి ప్రకటించిన ర్యాంకులు కింది విధంగా వున్నాయి. 

టెస్టులతో పాటు వన్డేల్లో టీంఇండియా ఇటీవల కాలంలో అత్యుత్తమంగా రాణిస్తోంది. దీంతో ఈ రెండు విభాగాల్లో జట్టు టాప్ ర్యాంకుల్లో నిలిచింది. టెస్టుల్లో మొదటి స్థానంలో నిలవగా వన్డే మరియు టీ20లలో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.  

ఇక టీంఇండియా ఆటగాళ్ల వ్యక్తిగత ర్యాంకింగ్స్ విషయానికి వస్తే టెస్టుల్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్ లో నిలిచాడు. అతడు మొత్తంగా 931 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచాడు. వన్డే ర్యాకింగ్స్ లో కూడా కోహ్లీ 899 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక టీ20ల విషయానికి వస్తూ కోహ్లీ బాగా వెనుకబడి వున్నాడు. అతడు 639 పాయింట్లతో ఏకంగా 15వ స్థానంలో నిలిచాడు. 

ఇక ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట సీరిస్ లో తన బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్న చటేశ్వర్ పుజారా టెస్ట్ ర్యాకింగ్స్ లో 3వ స్థానాన్ని ఆక్రమించాడు. అతడి ఖాతాలో 834 పాయింట్లున్నాయి. మొత్తంగా కోహ్లీ, పుజారాలు ఇద్దరే టెస్ట్ ర్యాకింగ్స్ లో టాప్ 10 లో నిలిచారు. 

వన్డేల్లో వరుసగా మొదటి రెండు స్థానాల్లో భారత ఆటగాళ్లే నిలిచారు. మొదటి స్థానంలో కెప్టెన్ కోహ్లీ నిలవగా రెండవ స్థానాన్ని 871 పాయింట్లతో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆక్రమించాడు. ఇక 767 పాయింట్లతో టీంఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ 9 వ స్థానంలో నిలిచాడు. 

టీ20 లలో భారత ఆటగాళ్లు వెనుకబడ్డారు. భారత ఓపెనర్లు లోకేశ్ రాహుల్ 719 పాయింట్లతో 7వ స్థానంలో నిలవగా, వైస్ కెప్టెన్ రోహిత్ 689 పాయింట్లతో 10వ స్థానానికి  పరిమితమయ్యాడు. మిగతా రెండు ఫార్మాట్లలోనూ టాప్ ప్లేయర్ గా నిలిచిన కోహ్లీ టీ20లో మాత్రం 15 వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. 

ఇక బౌలర్ల విషయానికి వస్తే టెస్టుల్లో రవీంద్ర జడేజా 796 పాయింట్లతో 6వ స్థానంలో, రవిచంద్రన్ అశ్విన్ 770 పాయింట్లతో 8వ ర్యాంకులో నిలిచారు. వన్డేల్లో భారత యువ బౌలర్ బుమ్రా 841 పాయింట్లతో టాప్ లో నిలవగా కుల్దీప్ యాదవ్ 723 పాయింట్లతో 3వ స్థానంలో, 683 పాయంట్లతో చాహల్ 6 స్థానంలో నిలిచాడు. టీ20లో కుల్దీప్ యాదవ్ 714 పాయింట్లతో 3వ స్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో కుల్దీప్ ఒక్కడే టాప్ 10లో చోటు సంపాదించాడు.