కాఫీ విత్ కరణ్ షోలో ఇంకెప్పుడూ అలాంటి ప్రశ్నలు అడగనని బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ అన్నారు. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోకి హాజరైన ఇండియన్ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కే ఎల్ రాహుల్.. వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. దీంతో.. బీసీసీఐ ఈ ఇద్దరు క్రికెటర్లపై నిషేధం విధించింది. తాజాగా.. ఆ నిషేధాన్ని ఎత్తివేసింది.

నిషేధం తొలగించడంతో హార్దిక్‌ పాండ్యా న్యూజిలాండ్‌ వెళ్లి జట్టుతో కలుస్తాడని... రాహుల్‌ భారత ‘ఎ’జట్టు తరఫున బరిలోకి దిగుతాడని బీసీసీఐ ప్రకటించింది. దీనిపై ‘కాఫీ విత్‌ కరణ్‌’ షో హోస్ట్‌, బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్‌ జోహార్ స్పందించారు. పాండ్యా, రాహుల్‌పై బీసీసీఐ నిషేదం ఎత్తివేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. 

పాండ్యా, రాహుల్ పై బీసీసీఐ నిషేధం విధించడంతో చాలా కుంగిపోయానని కరణ్ తెలిపారు. నా పిచ్చి ప్రశ్నల వల్లే వారు ఈ వివాదంలో చిక్కుకున్నారని.. ఇంకెప్పుడూ ఇలాంటి ప్రశ్నలు అడగనని చెప్పారు. ఇదే విషయం మీద తాను పాండ్యా, రాహుల్ కి క్షమాపణలు కూడా చెప్పానని ఆయన అన్నారు. వారిద్దరూ పెద్ద మనసుతో తనను క్షమించినట్లు ఆయన వివరించారు. పాండ్యా అంటే తన తల్లికి చాలా ఇష్టమని.. ఇలా తన షో ద్వారా అతను వివాదంలో ఇరుక్కోవడం తన తల్లిని చాలా బాధించిందని చెప్పారు. 

షోలో పాండ్యా, రాహుల్‌ కామెంట్లను ఎడిట్‌ చేయొచ్చు కదా అని చాలామంది అన్నారని, కానీ నేనది గ్రహించలేకపోయానని కరణ్‌ వాపోయారు. తనకు క్రికెటర్లంటే చాలా ఇష్టమని చెప్పారు. కానీ ఇంత వ్యవహారం జరిగిన తర్వాత ‘కాఫీ విత్‌ కరణ్‌’కు మళ్లీ వారు వస్తారో రారో అని అనుమానం వ్యక్తం చేశారు.