డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు, మనకు జీవితాంతం ఎదో ఒక బంధం తోడుగా ఉంటారు అనుకోవడం భ్రమే అవుతుంది. మనకు శాశ్వతంగా తోడుగా ఉండే బంధం పరమాత్ముడు ఒక్కడే. భౌతిక దేహానికి జీవితాంతం తోడు ఉండేది తన గుండె ధైర్యం తప్ప మరోకటి లేదు. పుట్టుకతో తలిదండ్రులు ఉంటారు, వారు మన జీవితాంతం మనతో ఉంటారని చెప్పగలమా..? ఇక పొతే తోబుట్టువులు అనేక కారణాల వలన వాళ్ళు ఎలాగు మనతో శాశ్వతంగా కలిసి ఉండరు. 

జీవిత భాగస్వామి మనకు ఈడు వచ్చాక వస్తుంది, ఆ బంధం ఎన్నాళ్ళు కొనసాగుతుందో చెప్పలేము. ఇక సంతాన విషయ పరంగా ఆలోచిస్తే వాళ్ళు పెరిగి పెద్దగయ్యాక, రెక్కలోచ్చాక వాళ్ళు మనతో ఎలాగూ ఉండరని అందరికి తెలుసు. ఇక మిత్రులంటారా చిన్నప్పుడు కలిసి చదువుకున్న వాళ్ళు కాలేజి స్థాయికి వచ్చాక ఎంత మంది కలిసి పై చదువులలో తోడుగా ఉంటారో చెప్పలేము ఆ తర్వాత కొత్త మిత్రులు.. అలా ఎవరు ఎన్నాళ్ళు కొనసాగుతారో చెప్పలేము. మనం పుట్టిననాటి నుండి గిట్టేవరకు కేవలం భగవత్బంధం తప్ప ఏ బంధం చివరి వరకు శాశ్వతంగా మనతో నిలవదు. ఇదే నిత్యం ఇదే సత్యం.

ఈ బంధాల మాయలో పడి అందరిని గుడ్డిగా నమ్మకండి ఎందుకంటే మనిషి అవసరం ఉంటే నాకు నువ్వే సర్వస్వం అంటారు, అదే అవసరం తీరాక నువ్వెంత అంటారు ఇది మానవ నైజం. మనం ఏర్పరచుకునే బంధాలు మన విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మనమెంత గొప్ప వారమైన మనం ఎంచుకునే స్నేహితుల బట్టే మన ఎదుగుదల పతనం ఆధారబడి ఉంటాయి. కర్ణుడంతటి వానికే చెడు స్నేహం వల్ల పతనం తప్పలేదు. అందుకే స్నేహ బంధాన్ని ఎంచుకునే ముందు సరైన నిర్ణయం తీసుకోవడం ఎంతో అవసరం.

అశాశ్వతమైన బంధాలల్లో మనిషికి మనిషి అవసరం ఎంతో అవసరపడుతుంది. అనుకూలమైన బంధం వలన తెగిపోతున్న బంధాన్ని కలుపుతుంది. ప్రతికూల బంధం వలన కలిసున్న బంధాన్ని విడగోడుతుంది. ఆస్తులు పంచుకునే రక్త సంబంధం కన్నా మమతలు పెంచుకునే ఆత్మీయ సంబంధం గొప్పది. సూక్షంలో మోక్షంలాగ.

మానవ నైజం ఏంటంటే.. మనిషి బ్రతికి ఉన్నప్పుడు పట్టించుకోం, అదే పోయాక మాత్రం వారి ఫోటోలపై ప్రేమ కురిపిస్తాం, గొప్పగా చెప్పుకుంటాం. ఏలాగు ఫోటో మాట్లాడదు అని తెలిసినా.. మనిషి బ్రతికి ఉన్నప్పుడు ప్రేమగా తినిపించకుండా పోయాక సమాధి దగ్గర పంచభక్ష పరమాన్నాలు పెడతాం. మనిషి విలువ మరణిస్తే కానీ అర్థం కాదా ? ఉన్నప్పుడే వారిని ప్రేమగా చూసుకుంటే బాగుంటుంది కద. ఈ జన్మలో ఏర్పడిన బంధాలన్నీ గతజన్మలోని ఋణానుబంధం వలననే ఏర్పడుతాయి. మనిషిగా పుట్టిన మానవుడు తన భాధ్యతలను విస్మరింపక కన్నవారి విలువలు మరవకూడదు. మన కర్మల ఫలితంగా బంధాలు ఏర్పడుతాయి కాబట్టి ఏ బంధంతో రుణపడి ఉండ కూడదు.

అన్ని బంధాలలో కెల్లా భగవద్భందమే శాశ్వతమైనది కానీ ప్రస్తుత జన్మలో అందరితో ఋణానుబంధాలలో ఎవరికి ఎలాంటి రుణపడి లేకుండా జాగ్రత్త పడాలి. భాధ్యతాయుతమైన జీవనాన్ని కొనసాగిస్తూ బ్రతికున్నన్ని రోజులు కర్తవ్య భాధ్యతలను దైవాదేశంగా స్వీకరించి వినమ్రపూర్వకంగా కర్తవ్య భాధ్యతలను చేపట్టాలి. ఎవరైతే తన జీవన ప్రయాణంలో బంధఋణవిమోచన కల్గించుకుంటారో వారికి దైవం దగ్గరౌతాడు. వచ్చే జన్మలో అన్ని బంధాలతో అనుకూలతలు, ఆప్యాయతలు ఉండేలా మార్గం సుగమం అవుతుంది. శాశ్వతమైనది భగవద్భమే కానీ ఈ జన్మలో ఏర్పడిన బంధాలతో తామరాకుపై నీటి బిందువోలె వ్యవహరిస్తే సద్గతి పొందుతాము.