మోదీ పాదం తాకబోయిన చంద్రబాబు.... వారించిన ప్రధాని... వైరల్ గా మారిన ఎమోషనల్ సీన్
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకార వేదికపై ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కర్, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.
గత ఐదేళ్లు ఎన్నో ఆటుపోట్లు, సవాళ్లు, సంక్షోభాలు ఎదుర్కొన్న చంద్రబాబు కల నెరవేర్చుకున్నారు. అసెంబ్లీలో శపథం చేసినట్లే ముఖ్యమంత్రి అయ్యారు. సీఎంగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. బుధవారం కేసరపల్లిలో సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ వేదికపై ఆసక్తికర ఘటన జరిగింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత నరేంద్ర మోదీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ క్రమంలో భావోద్వేగానికి గురైన చంద్రబాబు.. మోదీ కాళ్లు తాకబోయారు. వెంటనే ఆపిన మోదీ... మరోసారి చంద్రబాబును హగ్ చేసుకున్నారు. ఈ దృశ్యాలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్కు సమీపంలో బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కల్యాణ్, నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ సహా 24 మంది టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు.
ఈ వేడుకను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలి వచ్చారు. దీంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. వందలాది బస్సులు, కార్లు, ఇతర వాహనాలు కేసరపల్లి వైపు ప్రయాణించడంతో రహదారులు కిక్కిరిసిపోయాయి. దారులున్నీ కేసరపల్లి వైపే అన్నట్లు పరిస్థితి మారింది. ఇక, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ.. ఆయన కుటుంబ సభ్యులు ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.