ఆరు నెలలు సావాసం చేస్తే.. వాళ్లు వీళ్లౌతారు.. వీళ్లు వాళ్లౌతారనే సామేత వినే ఉంటారు. అయితే.. ఈ సామేత స్నేహితుల విషయంలో చాలా వరకు నిజమని తేలగా.. మరి ఎన్నో సంవత్సరాలుగా సహజీనం చేస్తున్న భార్యభర్తల్లో ఎంత వరకు నిజమనే విషయంపై ఇటీవల ఓ సంస్థ సర్వే చేయగా.. పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ది గార్డియన్‌లోని ఒక నివేదిక ప్రకారం, అమెరికా‌లోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు ఈ విషయాన్ని విశ్లేషించడానికి సంవత్సరాలుగా కలిసి ఉన్న వేల జంటల ఫోటోలను తీశారు. ముఖాలను విశ్లేషించడానికి ఈ బృందం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించింది. పీహెచ్‌డీ స్టూడెంట్‌ టీ-మేకార్న్, పరిశోధనా భాగస్వామి మిచల్ కోసిన్స్కితో కలిసి పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్న వేలాది జంటల ఛాయాచిత్రాలను జల్లెడ పట్టారు. 

వివాహం అయిన 25 సంవత్సరాల తరువాతి ఫోటోలు.. వారు వివాహం చేసుకోవడానికి ముందు తీసిన ఫోటోలను తీసుకున్నారు. ఇలా దాదాపు 517 జంటల డాటాను సేకరించారు. ఇందుకు గాను స్టాన్‌ఫోర్డ్‌ పరిశోధకులు స్వచ్ఛంద సేవకుల సాయం తీసుకున్నారు. వలంటీర్లకు టార్గెట్‌కి సంబంధించిన ఫోటో ఇచ్చి.. దానితో పాటు ఐదు ఇతర ఫోటోలు ఇచ్చారు. ఈ 5 ఫోటోల్లో ఒకటి టార్గెట్‌ భాగస్వామిది కూడా ఉంటుంది. ఇక ఈ మొత్తం ఫోటోల్లో ముఖ సారూప్యతలను గమనించమని వలంటీర్లను కోరారు పరిశోధకులు. అలానే ఫేసియల్‌ రికగ్నైజేషన్‌ టెక్నాలజీతో కూడా ఇలానే చేశారు. అయితే.. వారిలో ఎలాంటి పోలికలు కానీ.. సారూప్యత కానీ కనిపించలేదట.