2020 లో జరగనున్న ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ క్రీడల కోసం సంసిద్దమవుతున్న సమయంలో వాడా భారత్ కు షాకిచ్చింది. భారత ఆటగాళ్ళు నిషేధిత ఉత్ప్రేరకాలు, డ్రగ్స్ ఉపయోగించకుండా నియింత్రించే నాడా ఆదర్వంలో నడిచే లేబోరేటరీ గుర్తింపును ఆరేళ్ల పాటు రద్దు చేసింది. దీంతో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజన్సీ(నాడా) కి ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి.  ఇకపై ఆటగాళ్లకు డోపింగ్ టెస్టులు నిర్వహించిన ప్రతిసారీ నాడా వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజన్సీ(వాడా) చేత గుర్తింపుపొందిన విదేశీ లేబోరేటరీస్ ను ఆశ్రయించాల్సి వస్తుంది.  

భారత్ లోని జాతీయ డోప్ టెస్టింగ్ లేబోరేటరీ(ఎన్‌డీటీఎల్)  అంతర్జాతీయ ప్రమాణాలను పాటించడంలేదని గుర్తించినట్లు వాడా అధికారులు తెలిపారు. ఈ ఏడాది మేలో వాడా నిపుణుల బృందం  ఎన్‌డిటి  ల్యాబోరేటరీని పరిశీలించింది.  అలాగే మరోసారి స్వతంత్ర కమిటీ కూడా తనిఖీ  చేపట్టింది. ఈ రెండు బృందాలు తమ నివేదికను ఇటీవలే వాడా ఎగ్జిక్యూటివ్ కమిటీకి సమర్పించాయి. వీటి ఆధారంగానే ఎన్‌డీటీఎల్ పై నిషేధం విధించామని వాడా తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. 

అయితే భారత్ కు చెందిన యాంటీ డోపింగ్ సంస్థ తమ ఆటగాళ్లకు డోప్ పరీక్షలు యధావిదిగా నిర్వహించుకోవచ్చని తెలిపింది. అయితే వారు సేకరించే శాంపిల్స్ ను  మాత్రం ఎన్‌డీటీఎల్‌ లో కాకుండా వాడా గుర్తింపుకలిగిన లేబోరేటరీస్ లో పరీక్షలు చేయించాలని సూచించింది. నిషేధం తక్షణమే అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఈ ల్యాబ్ లో పరీక్షల కోసం వుంచిన నమూనాలను కూడా ఇతర ల్యాబోరేటరీస్ కు తరలించాలని సూచించింది. 

అయితే నిషేధ కాలంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎన్‌డీటీఎల్ ను తీర్చిదిద్దుకోవాలని వాడా సలహా ఇచ్చింది. అయితేనే మళ్ళీ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని... లేదంటే నిషేధాన్ని  అలాగే కొనసాగించాల్సి వస్తుందని వాడా హెచ్చరించింది.