బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. అథ్లెట్లు రోడ్లెక్కడం ఆందోళనకరం : రెజ్లర్ల నిరసనపై అభినవ్ బింద్రా
భారత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపులకు సంబంధించి రెజ్లర్లు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెజ్లర్లకు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా మద్ధతు పలికారు.
భారత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా భారత రెజ్లింగ్ వర్గంలోని కొందరు ప్రముఖులు నిరసనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో మాజీ ఒలింపిక్ బంగారు పతక విజేత అభినవ్ బింద్రా రెజ్లర్లకు మద్దతుగా నిలిచారు. ఒలింపిక్ కాంస్య పతక విజేతలైన సాక్షి మాలిక్, బజరంగ్ పునియా , వినేష్ ఫోగట్‌లు నిరసనల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారం మొత్తం ఈ ఏడాది జనవరి నాటిది. అన్షు మాలిక్, సోనమ్ మాలిక్, రవి దహియా, దీపక్ పునియాలతో పాటు భారత రెజ్లర్లంతా ఏకతాటిపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని వారంతా అప్పట్లో డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుతం మాత్రం సాక్షి, వినేష్, బజరంగ్‌లు మాత్రమే నిరసనల్లో పాల్గొన్నారు. బ్రిష్ భూషణ్‌ను అరెస్ట్ చేయడమే కాకుండా డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఆయనన తొలగించి, ఫెడరేషన్‌ను రద్దు చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు.
దేశానికి ఎంతో కీర్తిని తెచ్చిపెట్టిన అథెట్లు వీధుల్లో నిరసనలు చేయాల్సి రావడంపై పలువురు ప్రముఖులు, క్రీడాకారులు తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 2008 బీజింగ్‌లో జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో వ్యక్తిగత స్వర్ణం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచిన మాజీ ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా సైతం రెజ్లర్లకు మద్ధతుగా నిలిచారు. అలాగే మరో బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా కూడా మద్ధతు ప్రకటించారు. నిరసన తెలియజేస్తున్న రెజ్లర్ల ఆవేదనను తప్పక వినాలని బింద్రా ట్వీట్ చేశారు. వారి ఆరోపణలు చాలా తీవ్రమైనవని.. అందువల్ల సరైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. క్రీడలలో లైంగిక వేధింపుల సమస్యలను పరిష్కరించడానికి భారతదేశంలో రక్షిత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని బింద్రా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
అథ్లెట్లుగా అంతర్జాతీయ వేదికలపై మనదేశానికి ప్రాతినిథ్యం వహించడానికి తాము ప్రతిరోజూ కష్టపడి శిక్షణ పొందుతామన్నారు. భారత రెజ్లింగ్ అడ్మినిస్ట్రేషన్‌లో వేధింపుల ఆరోపణలకు సంబంధించి మన అథ్లెట్లు వీధుల్లోకి వచ్చి నిరసన తెలపడం చాలా ఆందోళనకరమన్నారు బింద్రా. అథ్లెట్ల ఆందోళనలను విని న్యాయబద్ధంగా , స్వతంత్రంగా పరిష్కరించబడుతుందని హామీ ఇవ్వాలన్నారు. అథ్లెట్లందరూ మరింత అభివృద్ధిలోకి వచ్చేందుకు సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించే దిశగా మనం కృషి చేయాలని అభినవ్ బింద్రా ఆకాంక్షించారు. ఆయన ట్వీట్‌కు గుత్తా జ్వాలా స్పందిస్తూ.. తాను దీనిని అంగీకరిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
ఇదిలావుండగా.. బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన లైంగిక వేధింపులు, బెదిరింపు ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 23న ఆరుగురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఏప్రిల్ 5న ప్యానెల్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఈ కమిటీకి వ్యతిరేకంగా రెజ్లర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలనలో వున్నందున.. అందులో ఏం ప్రస్తావించారన్న దానిపై ప్రజలకు ఇంకా వెల్లడించలేదు.