తెలంగాణలో ప్రాంతీయ పార్టీ పెట్టి ముందుకు దూకాలనే ప్రయత్నంలో ఉన్న వైఎస్ కూతురు షర్మిలకు పలు సవాళ్లు ఎదురు కానున్నాయి. కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి మీద తెలంగాణలో ఉన్న అభిమానంతో అధికారానికి చేరువ కావడం అంత సులభమేమీ కాదు. వైఎస్ అభిమానులు, తెలంగాణలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులూ కార్యకర్తలూ ఆమె పార్టీకి బలం చేకూర్చవచ్చు గానీ అది అధికారాన్ని అందుకోవడానికి తగినంత ఉండదనేది అందరికీ తెలిసిన విషయమే.

రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికీ విభజన చట్టంలోని హామీలు అమలులోకి రాని స్థితిలో వైఎస్ షర్మిల పలు సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంది. పైగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగనన్నను కూడా సవాల్ చేయాల్సి వస్తుంది. తెలంగాణ ప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వంతో కూడా పోరాడుతామని కొండా రాఘవ రెడ్డి అనే మద్దతుదారు అన్నారు. కానీ, అది అంత సులభం కాదు. ఇప్పటికే షర్మిలకు కాంగ్రెసు పార్టీ నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. 

ప్రధానంగా కృష్ణా జలాల పంపకంపై షర్మిల జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుంది. అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో షర్మిల ఏం చెబుతారని కాంగ్రెసు నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి ప్రశ్నలే ఇంకా ఆమెకు ఎదురవుతాయి. పైగా, ఆంధ్ర ముద్ర కూడా ఆమె మీద ఉంది. 

వైఎస్ రాజశేఖఱ రెడ్డి మీద తెలంగాణలో ఎంత అభిమానం ఉన్నప్పటికీ మెజారిటీ ప్రజలను కదిలించే అజెండా అది కాబోదు. వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా పనిచేశారు. హైదరాబాదు వెళ్లాలంటే పాస్ పోర్టు తీసుకోవాలట అనే ఆయన వ్యాఖ్య ఇంకా తెలంగాణ ప్రజల్లో పచ్చి పచ్చిగానే ఉంది. టీఆర్ఎస్ దీన్ని అవకాశంగా తీసుకుని షర్మిలపై ఎదురు దాడికి దిగవచ్చు.

గత శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీతో కాంగ్రెసు పొత్తు పెట్టుకోవడం టీఆర్ఎస్ కు కలిసి వచ్చింది. కాంగ్రెసు, టీడీపీ గెలిస్తే మళ్లీ తెలంగాణలో ఆంధ్ర పెత్తనం వస్తుందని టీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేసింది. కాంగ్రెసు పార్టీ దానివల్ల దారుణంగా దెబ్బ తిన్నది. మళ్లీ అదే ఎజెండాను షర్మిల విషయంలో టీఆర్ఎస్  ముందుకు తెచ్చే అవకాశం లేకపోలేదు. ఈ ఎజెండాపై టీఆర్ఎస్ కు ఓపినియన్ మేకర్స్ ను కూడగట్టే వెసులుబాటు కూడా దక్కుతుంది.

ఆ ఎజెండాను ముందుకు తెస్తే ప్రజా సమస్యలు, పరిష్కారం కాని సమస్యలు వెనక్కి వెళ్లవచ్చు. ఉద్యోగాలు వచ్చాయా వంటి పలు సమస్యలను షర్మిల ప్రస్తావించారు. ఆ సమస్యలను పరిష్కరించడమే రాజన్న రాజ్యం చేస్తుందని ఆమె అంటున్నారు. కానీ ఎన్నికల వేడి రగులుకున్న తర్వాత సెంటిమెంట్ బలంగా పనిచేస్తే షర్మిల లేవనెత్తే సమస్యలేవీ పనిచేయకపోవచ్చు.