ప్రయోగం: వైఎస్ షర్మిల వ్యూహకర్త ప్రియ వెనక ప్రశాంత్ కిశోర్
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రియ వ్యూహకర్తగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ప్రియను వెనక ఉండి ప్రశాంత్ కిశోర్ నడిపిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెనక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రియను ముందు పెట్టి ఆయన వ్యవహారం నడుపుతున్నట్లు సమాచారం. వైఎస్ షర్మిల వ్యూహకర్తగా ప్రియ పనిచేస్తున్న విషయం తెలిసిందే. ప్రియ ఎప్పటికప్పుడు ప్రశాంత్ కిశోర్ సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. అందుకు ఆమె తరుచుగా ఢిల్లీ వెళ్తున్నట్లు చెబుతున్నారు.
ప్రియ ప్రశాంత్ కిశోర్ జట్టులో పనచేశారు. తమిళనాడులోని తిరువల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే రాజేంద్రన్ కూతురు ప్రియ. డిఎంకె కోసం ప్రశాంత్ కిశోర్ తో తన సర్వే సంస్థ ఎన్పీసీ ద్వారా డిఎంకె కోసం కలిసి పనిచేశారు. ఓసారి ప్రియ హైదరాబాదు వచ్చి వైఎస్ షర్మిలతో భేటీ అయ్యారు. అ తర్వాత ఎప్పటికప్పుడు వ్యూహాలు రచిస్తూ వైఎస్ షర్మిలకు ఆమె సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, మంత్రి కేటీఆర్ మీద, బిజెపి మీద షర్మిల వాగ్బాణాలు సంధించడం వెనక ప్రియ వ్యూహమే ఉన్నట్లు చెబుతున్నారు. షర్మిల కోసం ఇప్పుడిప్పుడే నేరుగా రంగంలోకి దిగడం సరి కాదని ప్రశాంత్ కిశోర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. వైఎస్ షర్మిల పార్టీపై ప్రజల స్పందనను ఎప్పటికప్పుడు ప్రియ వైఎస్ షర్మిలకు అందజేస్తున్నట్లు తెలుస్తోంది.
వైఎస్ రాజశేఖర రెడ్డిని ప్రజలు గుర్తు పెట్టుకున్నారా, మరిచిపోయారా, ఆయా నియోజకవర్గాల్లో బలమైన నేతలు ఎవరు వంటివాటిపై సర్వే చేసి వివరాలను ప్రియ షర్మిలకు అందిస్తున్నట్లు తెలుస్తోంది. తన జట్టుతో పనిచేయిస్తున్న ప్రియ నేరుగా హైదరాబాదు రావడం లేదు. ప్రియ నేరుగా షర్మిలతోనే మాట్లాడుతున్నట్లు సమాచారం.
సర్వేలో తనకు లభించిన సమాచారం గురించి ప్రియ ఢిల్లీ వెళ్లి ప్రశాంత్ కిశోర్ తో చర్చిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయన ఇచ్చిన సూచనలను తెలంగాణలో వైఎస్ షర్మిల కోసం ప్రియ వాడుతున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల సమయానికి ప్రశాంత్ కిశోర్ నేరుగా రంగంలోకి దిగుతారా అనేది కూడా చూడాల్సే ఉంది. ఒక ప్రయోగంగా ప్రశాంత్ కిశోర్ ప్రియకు మొత్తం అప్పగిస్తారా అనేది కూడా చూడాల్సిందే.