Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ కు షాక్, జగన్ కు ఊరట: వైఎస్ షర్మిల టార్గెట్ తెలంగాణ

వైఎస్ కూతురు వైఎస్ షర్మిల అన్న జగన్ కు ఊరటనిచ్చే రాజకీయాలే చేస్తున్నట్లు అర్థమవుతోంది. అదే సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆమె టార్గెట్ చేసినట్లు కూడా కనిపిస్తున్నారు.

YS Sharmila political party Targets Telangana May effect TRS
Author
Hyderabad, First Published Feb 9, 2021, 1:03 PM IST

హైదరాబాద్: వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల తెలంగాణను టార్గెట్ చేసినట్లు కనిపిస్తున్నారు. తెలంగాణలో తన సత్తా చాటడానికే ఆమె రాజకీయ పార్టీ పెడుతున్నట్లు అర్థమవుతోంది. ఆమె మంగళవారం ఆత్మీయ సమావేశం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి.

వైఎస్ లేని లోటు తెలంగాణలో కనిపిస్తోందని, తాను తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని ఆమె చెప్పారు. దీన్ని బట్టి ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నాయకత్వంలోని టీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తున్నారు. ఇది కేసీఆర్ కు తలనొప్పిగా పరిణమించే అవకాశాలు లేకపోలేదు. ఆమె పార్టీ పెడితే తెలంగాణలోని మైనారిటీ, దళిత వర్గాల ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. దీంతో బిజెపి లాఫపడే అవకాశాలున్నాయి. మెజారిటీ సమాజాన్ని టీఆర్ఎస్, బిజెపి చీల్చుకుంటాయని, షర్మిల వల్ల టీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండి పడుతుందని అంటున్నారు. 

కాగా, షర్మిల రాజకీయ పార్టీ వల్ల ఎక్కువగా నష్టపోయేది మాత్రం కాంగ్రెసు పార్టీ అనే వాదన వినిపిస్తోంది. కాంగ్రెసు పార్టీలో ఇప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితులైన నాయకులు కొంత మంది ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా కూడా ఉన్నారు. వారంతా షర్మిలతో కలిసి నడిచే అవకాశాలున్నాయని అంటున్నారు. 

ఇప్పటికే కొండా సురేఖ కుటుంబ సభ్యులు వైఎస్ షర్మిలను కలిసినట్లు చెబుతున్నారు. అదే విధంగా ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా షర్మిలతో భేటీ అయినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. టీఆర్ఎస్ లోని అసంతృప్తివాదులు కూడా షర్మిల వైపు చూస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. 

ఇదే సమయంలో ఆమె ఆంధ్రప్రదేశ్ జోలికి వెళ్లరనే మాట వినిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణను వదిలేశారు. ఆ గ్యాప్ లో షర్మిల తెలంగాణలో పనిచేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ కు చిక్కులు కల్పించకుండా తెలంగాణను తన వేదికగా షర్మిల ఎంచుకున్నట్లు చెబుతున్నారు. 

వైఎస్ జగన్ తో షర్మిలకు విభేదాలున్నాయని, దానివల్ల ఆమె పార్టీ పెట్టబోతున్నారని ఊహాగానాలు చెలరేగుతూ వస్తున్నాయి. అయితే, ప్రస్తుతానికైతే ఆమెకు ఆంధ్రప్రదేశ్ ను టార్గెట్ చేసే ఆలోచన లేనట్లు తెలుస్తోంది. విశాఖఫట్నం లోకసభ సీటును గానీ రాజ్యసభ సీటును గానీ జగన్ ఇవ్వకపోవడం వల్ల ఆమె అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. రాజకీయాలకు మాత్రం ఆమె చాలా కాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ ఆమె లక్ష్యం ఆంధ్రప్రదేశ్ కాదనే మాట వినిపిస్తోంది. 

తెలంగాణలో షర్మిలను ముందుకు తేవడం వెనక బలమైన కారణాలే ఉన్నాయని చెబుతున్నారు. కేసీఆర్ మీద వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో వైఎస్ అబిమానులకు కూడగట్టి ఆమె పాగా వేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆమె బిజెపితో జత కడుతారా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. మొత్తం మీద, కేసీఆర్ కు చెక్ పెట్టే దిశగానే తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నట్లు భావిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios