నేతన్ననేస్తం ఈరోజే ఎందుకంటే...????
గత ఆరునెలల్లో వరుస సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగన్ తన పుట్టిన రోజున వైయస్సార్ నేతన్న నేస్తం పథకానికి శ్రీకారం చుడుతున్నారు. నా పుట్టినరోజు నాకు చేనేతలే గుర్తు వచ్చారన్నారు జగన్
ఏపీ సీఎం వైయస్ జగన్‌కి ఈ పుట్టిన రోజు చాలా ప్రత్యేకం అనుకోవాలి. ఎందుకంటే తొలిసారిగా ముఖ్యంత్రి హోదాలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారాయన. పార్టీ పెట్టి నిండా పదేళ్లు నిండక ముందే, పోటీ చేసిన రెండో ఎలక్షన్‌తోనే భారీ మెజారిటీ సొంతం చేసుకుని అధికారం చేపట్టడంలోనే రికార్డ్ క్రియేట్ చేసారు జగన్. కిందటి ఏడాది ఇదే రోజు ఆయన పాదయాత్రలో ఉన్నారు. ఈ సంవత్సరం తన పుట్టినరోజు నాడు చేనేతలకు ఆర్థికసాయం అందిస్తానని ప్రకటించారు.
గత ఆరునెలల్లో వరుస సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగన్ తన పుట్టిన రోజున వైయస్సార్ నేతన్న నేస్తం పథకానికి శ్రీకారం చుడుతున్నారు. నా పుట్టినరోజు నాకు చేనేతలే గుర్తు వచ్చారన్నారు జగన్. అమ్మ ఒడి, నాడు-నేడు లాంటి ప్రతిష్టాత్మక పథకాలెన్నో ఉండగా దీన్ని మాత్రమే తన బర్త్‌డే రోజు లాంచ్ చేయడం ఏమిటి అని చాలామందికి సందేహాలు ఉత్పన్నం అయ్యాయి. చేనేతలతో తన తండ్రి వైయస్సార్ గారికున్న అనుబంధాన్ని గుర్తుచేసుకునేందుకే సీఎం జగన్ తన పుట్టిన రోజున నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభిస్తున్నారంటున్నారు సన్నిహితులు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ ఎప్పుడూ చేనేత వస్త్రాలే ధరించేవారు. వ్యవసాయ సదస్సుకు అమెరికాకు వెళ్లేటప్పుడు సూటు వేసుకోమన్నా, నేను రైతుబిడ్డను అంటూ చేనేత పంచకట్టుతోనే సమావేశానికి హాజరయ్యారు. తానే కాదు ప్రభుత్వోద్యోగులంతా వారానికి రెండు రోజులు నేతన్నలు నేసిన బట్టలు కట్టుకోవాలని చెబుతూ డ్రెస్ కోడ్ పెట్టి, దానికి ఓ జీవో కూడా పాస్ చేసారు. నేతకార్మికుల పట్ల వైయస్సార్‌కు అంత అభిమానం ఉండేది. 2004లో ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.327కోట్ల చేనేత రుణాలు బేషరతుగా మాఫీ చేసారు. బాబు హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు పరిహారం ఇచ్చారు.
చేనేత కార్మికులకు పావలా వడ్డీ రుణాలు, 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్, నెలకు 35 కిలోల బియ్యం, అత్యంత వెనుకబడిన చేనేత కార్మికులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం, ఇళ్లు, చేనేత కార్మికుల పిల్లలకు ఫీజ్ రీయంబర్స్‌మెంట్ వంటివి ఎన్నో చేసి ఆదుకున్నారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పోచంపల్లిలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేసి10,000 మంది నేతకార్మికులకు ఉపాధి కల్పించారు. బాబుహయాంలో రూ.47 కోట్లు మాత్రమే ఉండే ఆప్కో టర్నోవర్ ను వైయస్ రూ.250 కోట్లకు పెంచారు. ఆగస్టు 7వ తేదీని చేనేత దినోత్సవంగా జరపాలని ఆదేశాలు జారీచేసారు. 2009లో రెండోసారి సీఎం అయ్యిన తర్వాత కూడా మరో మారు రూ. 312 కోట్లు చేనేత రుణాలు మాఫీ చేస్తూ జీవో ఇచ్చారు. కానీ ఆయన మరణించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చలేదు.
తండ్రి వైయస్సార్ మాత్రమే కాదు జగన్ కూడా పాదయాత్ర సమయంలో చేనేతల కష్టాలు కళ్లారా చూసి చలించిపోయానని స్వయంగా చెప్పారు. గతంలో ప్రతిపక్ష నేతగా చేనేత కార్మికుల దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. రుణాలు తీర్చలేక, మగ్గం పని చేసేందుకు పెట్టుబడి కరువై, పని లేక పస్తులుంటున్న కుటుంబాలను చూసి ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఒక రోజు ఆరోగ్యం సహకరించక, పని చేయలేకపోతే పూటగడవని స్థితిలో ఉన్నామని మహిళలు ఆవేదనతో చెప్పడం విని, వారికోసమే 45 ఏళ్లకే పింఛను పథకం గురించి పాదయాత్ర ప్రారంభంలో ప్రకటించారు.
అయితే అంత తక్కువ వయసుకే పింఛన్లు ఇస్తాననడంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో పింఛన్ల బదులుగా వారికి ఏటా ఆర్థిక సాయం అందించేలా పథకంలో మార్పులు చేసారు. చేనేతల పట్ల తండ్రి సెంటిమెంట్‌ను వైయస్ జగన్ కొనసాగిస్తున్నారు. తెల్ల రేషన్ కార్డ్, మగ్గం ఉన్న చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. సుమారు 85,000 కుటుంబాలు ఈ స్కీం ద్వారా లబ్ది పొందుతున్నాయి. డిసెంబర్ 21 తేదీ తన 47వ పుట్టినరోజున అనంతపురంలోని ధర్మవరంలో ప్రముఖ జూనియర్ కళాశాలలో వైయస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని సీఎం ప్రారంభిస్తున్నారు