పుట్టెడు కష్టాలతో పుట్టి ..... అధికారం చేపట్టి...

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. పుట్టి పదేళ్లే అయ్యింది. పెట్టింది రాజకీయాల్లో ఓనమాలు దిద్దుతున్న యువకుడు. తండ్రి మరణం తర్వాత ఆయన నుంచి సంక్రమించిన అశేష జనాభిమానం మాత్రమే పెట్టుబడిగా తండ్రి పేరునే పార్టీ పేరుగా, తండ్రి ఆశయాలే ఎజెండాగా మార్చుకుని రాజకీయ రణక్షేత్రంలో దూకాడు. 

YS Jagan's YSR Congress party completes 10 years

ఒక రాజకీయ పార్టీ నుంచి ప్రజలేం ఆశిస్తారు?  ఒక్కమాటలో చెప్పాలంటే హామీలు. రాజకీయ పార్టీ నాయకుడి నుంచి ఏం ఆశిస్తారు? అధికారంలో ఉంటే తమ సమస్యలు తీర్చాలని, ప్రతిపక్షంలో ఉంటే తమ తరఫున నిలబడి వారి గోడు ప్రభుత్వానికి వినిపించాలని. ఈ దేశంలో పుట్టగొడుగుల్లా పుట్టిన పార్టీలెన్నో. జాతీయ స్థాయిలో రాణించినవి, ప్రాంతీయ పార్టీలుగా పాతుకుపోయినవీ ఎన్నో ఉన్నా వాటి చరిత్రలు పరిశీలిస్తే కొన్ని సామీప్యాలు కనిపిస్తాయి. అయితే వీటన్నిటికంటే భిన్నంగా ఒక పార్టీ మన తెలుగు రాష్ట్రంలో కనిపిస్తుంది. అదే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP). పుట్టి పదేళ్లే అయ్యింది. పెట్టింది రాజకీయాల్లో ఓనమాలు దిద్దుతున్న యువకుడు. తండ్రి మరణం తర్వాత ఆయన నుంచి సంక్రమించిన అశేష జనాభిమానం మాత్రమే పెట్టుబడిగా తండ్రి పేరునే పార్టీ పేరుగా, తండ్రి ఆశయాలే ఎజెండాగా మార్చుకుని రాజకీయ రణక్షేత్రంలో దూకాడు. 

2010 నవంబర్‌లో కాంగ్రెస్ పార్టీని వీడి 2011 మార్చిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన క్షణం నుంచీ వైయస్ జగన్ జీవితంలో ప్రతి అడుగూ  ముళ్లబాటలోనే సాగింది. ఒకపక్క సోనియాగాంధీ నుంచి రాజకీయ కక్షసాధింపులు, మరోపక్క బలమైన ప్రత్యర్థిగా ఉన్న ప్రాంతీయ పార్టీ టీడీపీ ఆ కుట్రకు సహకరించడం, అండగా ఉంటారనుకున్న సొంతవాళ్లే దూరంకావడం వంటి సమస్యలన్నీ చుట్టుముట్టి ఉన్న గడ్డు కాలం. దీనితో పాటు జారిపోతున్న నాయకులు, కూడగట్టుకోవాల్సిన ప్రజాబలం పెద్ద సవాళ్లు. వీటన్నిటినీ అధిగమిస్తూ తొలిసారి శాసన సభ ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. గెలుపుకు 2% తక్కువ ఓట్ల దూరంలో ఉండిపోయింది. కానీ ఓటమిని కూడా ఓర్చుకుని విజయానికి బాటలు వేసుకుంది. పరిణితి చెందిన నాయకుడిగా వైయస్ జగన్ మోహన్‌ రెడ్డి పరిణామ క్రమం పార్టీ పరిణామక్రమం ఏకకాలంలో జరిగిందని చెప్పుకోవాలి. బలమైన నాయకులను, కేడర్‌ను సిద్ధం చేసుకోవడంలో, ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో వేగం పెంచింది. ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూ, ప్రజా సమస్యలపై నిత్యపోరాటం చేస్తూ, విభజన హామీలే అస్త్రంగా మార్చుకుని రాజకీయాల్లో దూకుడు పెంచింది. ఒకపక్క ప్రభుత్వ ప్రలోభాలకు పార్టీ నేతలు పక్కచూపులు చూసినా సరే అణువంతైనా బెదరకుండా, నేరుగా ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్లిన ఘనత వైయస్ జగన్‌ది అనే చెప్పాలి. విలువలతో కూడిన రాజకీయాలు చేద్దామనుకుంటున్నాను అంటూ ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రారంభించి వారి నమ్మకాన్ని చూరగొన్నారు జగన్. అనుభవం లేదని పెదవి విరిచిన వారితోనే ఔరా అనిపించుకునే రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు, ప్రజాభిమానాన్ని పుష్కలంగా పొందారు. ఎంతలా అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా 175 సీట్లకు 151 సీట్ల అఖండ మెజారిటీని సాధించి సంచలన రికార్డులు నమోదు చేసింది. అలాగే పార్లమెంట్ లోనూ అత్యధిక ఎంపీలతో మూడో పెద్దపార్టీగా అవతరించింది. సోషల్ మీడియా వినియోగంలోనూ జాతీయ పార్టీలతో పోటీపడుతోంది. 

ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా సీఎం జగన్ అధ్యక్షతన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ సంచలన నిర్ణయాలకు వేదికయ్యింది. అధికారం చేపట్టిన 4 నెలల్లోపే 4 లక్షల ఉద్యోగాలిచ్చి యువత మనసు కొల్లగొట్టింది. అమ్మ ఒడి లాంటి మేజర్ ఎఫెక్టివ్ పథకాలతో పాటు, ఇంటికే పింఛన్లు, నాడునేడు ద్వారా స్కూళ్లు ఆసుపత్రుల అభివృద్ధి వంటి  వినూత్న నిర్ణయాలతో ప్రత్యేకత చాటుకుంటోంది. దేశంలోనే తొలిసారిగా రివర్స్ టెండరింగ్ విధానం, మూడు రాజధానులు, ఒకేరోజు 25లక్షలకు పైగా పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, పోలీసులకు వీక్లీఆఫ్, సచివాలయాలు, వాలంటీర్లు, ఇంగ్లీష్‌ మీడియం, దిశ యాక్ట్,  50% నామినేటెడ్ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు ఇవ్వడం, 75% ఉద్యోగాలు స్థానికులకు లాంటి సంచలనాత్మక నిర్ణయాలతో ఆదర్శంగా నిలిచింది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వ విధానాలకు, నిర్ణయాలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణాతో పాటు జార్ఖండ్, కర్ణాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, దిల్లీ రాష్ట్రాలు సైతం ఈ ప్రభుత్వ నిర్ణయాలను ఫాలో అయ్యేందుకు సిద్ధమౌతున్నాయి. 

మొత్తానికి దేశ రాజకీయాల్లో ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తున్న వైసీపీ భవిష్యత్తులో మరెన్ని ప్రయోగాలకు కేంద్రం అవుతుందో, మరెన్ని సంచలనాలను సృష్టిస్తుందో వేచి చూడాలి. పదేళ్ల ప్రస్థానంలో చెప్పుకోదగ్గ, మెచ్చుకోదగ్గ ఎదుగుదలతో ప్రాంతీయ పార్టీల పవర్‌ను ప్రూవ్ చేస్తోంది వైసీపీ. 

- దీప్తిశ్రీ కవులూరు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios