Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు, లోకేష్, పవన్‌లకు చెక్‌ పెట్టేందుకు జగన్ మాస్టర్ ప్లాన్.. ఆ నిబంధన వైసీపీకి మాత్రమేనా..!

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లపై  సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ జగన్ సర్కార్‌ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనల అనంతరం ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం వెలువడింది. అయితే ఈ నిర్ణయం ద్వారా సీఎం జగన్.. ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

Ys Jagan master plan to counter chandrababu lokesh and pawan kalyan
Author
First Published Jan 3, 2023, 10:25 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లపై  సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తూ జగన్ సర్కార్‌ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనల అనంతరం ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం వెలువడింది. అయితే ఈ నిర్ణయం ద్వారా సీఎం జగన్.. ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో 15 నెలలు మాత్రమే సమయం ఉంది. దీంతో ఈ ఏడాది ఏపీ రాజకీయాల్లో కీలకం కానుంది. దీంతో అటూ అధికార పార్టీ.. ఇటూ విపక్ష పార్టీలు ఎవరికి వారు గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఈ రాజకీయ వేడి మరింతగా పెరుగుతూనే ఉంటుంది. 

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో జనాల్లోకి వెళ్తుండగా.. ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ జాతీయ  ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ నెల 27 నుంచి యువగళం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. మరోవైపు ఇప్పటికే వారాహి పేరుతో వాహనాన్ని సిద్దం చేసుకన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా జనాల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇక, పవన్.. ఎప్పటి నుంచి ప్రజల్లోకి వస్తారనే దానిపై మాత్రం ఇప్పటివరకు స్పష్టత లేదు. అయితే ఇప్పటికే పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన సందర్భంగా పోలీసులు అడ్డుకోవడం, ఇప్పటం పర్యటన సందర్భంగా చోటుచేసుకన్న పరిణాామాలు బాగా హైలెట్ అయ్యాయి. 

లోకేష్ పాదయాత్ర, పవన్ వారాహి యాత్రకు చెక్..!
సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం ప్రతిపక్షాలకు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఇకపై రోడ్లపై సభలు, ర్యాలీలకు అనుమతి లేనందున.. వారు తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతించిన ప్రదేశాలలో మాత్రమే సభలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక రకంగా ప్రతిపక్ష పార్టీలకు ఇబ్బందికరమైన విషయమనే చెప్పాలి. ఇక, పాదయాత్ర, బస్సు యాత్ర‌లకు అనుమతి ఉంటుందా? లేదా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన జీవో.. రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయితీ రాజ్ రహదారులను ప్రజలు, సరుకుల రవాణాకు మాత్రమే వినియోగించాలని స్పష్టం చేస్తుంది. అంటే దాదాపుగా పవన్ పాదయాత్ర, పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు అనుమతి లేనట్టేనని చెప్పాలి. అయితే దీనిపై ప్రతిపక్ష పార్టీలు కోర్టుకు వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు.

అయితే ప్రభుత్వం తీసుకన్న ఈ నిర్ణయం టీడీపీ, జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రజల్లో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకితను ఎత్తిచూపుతున్నందుకే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. చంద్రబాబు సభలకు పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారని.. అది చూసి వైసీపీ ఓర్వలేకపోతుందని టీడీపీ విమర్శలు  చేస్తోంది. మరోవైపు లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడానికే ప్రభుత్వం కుట్ర పన్నిందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. గుంటూరు తొక్కిసలాట ఘటన తర్వాత టీడీపీ కూడా ప్రభుత్వంపై దాడిని పెంచాయి. గతంలో చంద్రబాబు ఎన్నో సభలు నిర్వహించారని.. ఎప్పుడూ ఇలా జరగలేదని టీడీపీ చెబుతోంది. వరుసగా జరుగుతున్న తొక్కిసలాట ఘటన వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపించింది. ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. 

ఇక, వారాహి వాహనం రంగు విషయంలోనే వైసీపీ నానా రాద్దాంతం చేసిందని.. ఇప్పుడు రోడ్లపై సభలు, ర్యాలీల నిషేధం విధించడం ద్వారా పవన్ ప్రజల్లోకి వెళ్లకుండా చూస్తుందని జనసేన నుంచి వినిపిస్తున్న ఆరోపణ.

సమర్ధించుకునేందుకు వైసీపీకి అవకాశం.. 
అయితే ప్రభుత్వం తీసుకన్న ఈ నిర్ణయాన్ని వైసీపీ శ్రేణులు సమర్ధించుకునేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల నెల్లూరు జిల్లా  కందుకూరులో చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది, గుంటూరులో చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతిచెందారు. ఈ రెండు  ఘటనలు కూడా ఐదు రోజుల వ్యవధిలోనే చోటుచేసుకున్నాయి. అయితే గుంటూరు ఘటన తర్వాత ప్రతిపక్ష టీడీపీపై అధికార వైసీపీ విమర్శల దాడిని పెంచింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బయటకు రావడం, బాధితులు చేస్తున్న విమర్శల‌తో వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో టీడీపీ టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. 

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. చంద్రబాబు సభలకు అనుమతులు ఇవ్వొద్దని కూడా పలువురు మంత్రులు, వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్లపై సభలు, ర్యాలీల నిర్వహణలో లోపాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని.. అందుకే ప్రజలు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకునే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వైసీపీ శ్రేణులు సమర్ధించుకునే అవకాశం ఉంది. 

జగన్ మాస్టర్ ప్లాన్.. ఆ నిబంధన ఎవరికీ!
అయితే ప్రభుత్వం జారీ చేసిన జీవోలో.. అత్యంత అరుదైన సమయాల్లో ఎస్పీలు లేదా సీపీలు కచ్చితమైన షరతులతో సభలు, ర్యాలీలు అనుమతులు ఇవ్వొచ్చని ప్రభుత్వం తెలిపింది. అందుకు ముందుగా నిర్వాహకులు లిఖితపూర్వకంగా అనుమతి  తీసుకోవాలని పేర్కొంది. సభను ఎందుకు నిర్వహిస్తున్నారు, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు నిర్వహిస్తారు అనే సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. అలాగే రూట్‌ మ్యాప్, సభకు వచ్చే జనాల సంఖ్య, ప్రజల భద్రతకు తీసుకుంటున్న చర్యలను కూడా నిర్వాహకులు వివరించాల్సి ఉంటుంది. 

అయితే ఈ నిబంధన ప్రతిపక్షాలకు వర్తిస్తుందా? అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే దీని వెనక జగన్‌ మాస్టర్ ప్లాన్ ఉందనే వాదనలు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతులు ఇస్తామని అంటున్నారని.. వైసీపీ శ్రేణులకు మాత్రమే ఆ ప్రత్యేక పరిస్థితులు వర్తిస్తాయా? అని సీపీఐ రామకృష్ణ ప్రశ్నించారు. ప్రత్యేక పరిస్థితులను సాకుగా చూపి.. వైసీపీ నాయకుల సభలకు మాత్రం అనుమతులు ఇస్తారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios