Asianet News TeluguAsianet News Telugu

జగన్ చేతుల్లోకి సినిమా టికెట్ల విక్రయం: వెనక పనిచేసింది ఎన్టీఆర్, చంద్రబాబులే

సినిమా టికెట్ల విక్రయాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవడంపై వివాదం నడుస్తోంది. జగన్ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవడం వెనక బలమైన కారణాలే ఉన్నాయి.

YS Jagan govt to sell cinema tickets: Reason behind it
Author
Amaravati, First Published Sep 15, 2021, 10:44 AM IST

సినిమా టికెట్లను తామే విక్రయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చర్చ సాగుతోంది. సినిమా టికెట్లను ఆన్ లైన్ లో ప్రభుత్వమే విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. జగన్ ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, దాని వెనక ఆలోచన ఏమిటి అనేది ఆలోచించాల్సిన విషయం. గతంలో కొన్ని థియేటర్లు తక్కువ టికెట్ ధరతో పాత సినిమాలను మార్నింగ్ షోలుగా ప్రదర్శించేవి. ఆ పద్ధతి కనుమరుదైంది.

కాగా, భారీ పెట్టుబడితో, పెద్ద హీరోలతో నిర్మితమైన సినిమాలు తెల్లవారు జాము షోలను వేయడం పరిపాటి అయింది. టికెట్ ధరలు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెడుతూ వస్తున్నారు. ఏ సినిమా కూడా పట్టుమని వారం పాటు ఆడడం లేదు. కానీ, కలెక్షన్లు మాత్రం పెద్ద సినిమాలకు రెండు, మూడు రోజుల్లోనే దండిగా వస్తున్నాయి. కోట్లాది రూపాయల పెట్టబడితో వచ్చిన సినిమాలు లాభాలను ఆర్జిస్తున్నాయి. సినిమా థియేటర్లు చాలా వరకు మూతపడి షాపింగ్ మాల్స్ గానో, కల్యాణ మండపాలుగానో, హోటల్స్ గానో మారిపోయాయి. 

చిన్న సినిమాలు పెద్ద సినిమాల కారణంగా నిలదొక్కుకోలేని పరిస్థితి, థియేటర్లు మూతపడడానికి దారి తీసిన పరిస్థితి గత ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే కారణమని అంటున్నారు. వీరిద్దరికి కూడా సినిమా రంగం నుంచి విశేషమైన మద్దతు లభిస్తూ వచ్చింది. తెలుగుదేశం పార్టీ సినిమా హీరోలకు, సినిమా దర్శకులకు పెద్ద పీట వేస్తుండడం ఇప్పటికీ చూస్తుంటాం. 

థియేటర్లు పన్నులు సరిగా చెల్లించడం లేదనే కారణంతో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయంలో ప్రభుదత్వం స్లాబ్ సిస్టంను ప్రవేశపెట్టింది. సినిమా ప్రేక్షకుల సంఖ్య ఆధారంగా కాకుండా థియేటర్ లో ఉన్న సీట్ల సంఖ్య ఆధారంగా థియేటర్ యజమానులు పన్నులు చెల్లించే విధానం ఇది. థియేటర్ నిండకపోయినా, ప్రేక్షకులు సినిమాకు తక్కువ సంఖ్యలో వచ్చినా వాటితో నిమిత్తం లేకుండా సీట్లను బట్టి పన్ను చెల్లించాల్సిందే. ఈ కారణంగా పలు సినిమా హాళ్లు మూతపడ్డాయి. 

పాత సినిమాలను ప్రదర్శిస్తూ వచ్చిన సినిమా హాళ్లు దీంతో కొత్త సినిమాలనే, అదీ పెద్ద హీరోలు నటించిన సినిమాలనే ప్రదర్శించాల్సిన అనివార్యతలో పడ్డాయి. థియేటర్లలో సీట్లు నిండాలంటే ఇలా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దాంతోనే ఒక్కటొక్కటిగా సినిమా థియేటర్లు మూతపడుతూ వచ్చాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఏ సినిమాకైనా టికెట్ ధర ఒక్కటే ఉండేది. భారీ పెట్టుబడి, పెద్ద హీరోలు నటించిన సినిమాలకైనా చిన్న సినిమాలకైనా థియేటర్లలో టికెట్ ధర ఒక్కటే ఉండేది. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. తొలిసారి భారతీయుడు సినిమాకు టికెట్ ధరలు పెంచుకోవడానికి చంద్రబాబు అనుమిత ఇచ్చారు. దీంతో ఆ సంప్రదాయం ఇంకా కొనసాగుతోంది. పెద్ద హీరోల సినిమాలకు టికెట్ ధరలు పెంచుకుని అదనపు షోలు నిర్వహించే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. 

దాంతో సినిమా రంగంలోని ఒకటి, రెండు సామాజిక వర్గాలవారు మాత్రమే ప్రయోజనం పొందుతున్నారు. పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలు ఈ సామాజిక వర్గాలకు చెందినవారే కావడంతో అది ఆ సామాజిక వర్గాలకు ప్రయోజనకరంగా మారింది. చిన్న సినిమాలకు థియేటర్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఆ రెండు సామాజిక వర్గాలకు చెందిన సినీ పెద్దలు తెలుగుదేశం పార్టీ వెంటే ఉంటూ వస్తున్నారు. వారి వల్ల జగన్ కు గానీ, జగన్ పార్టీకి గానీ ఏ విధమైన ప్రయజోనం లేదు. 

ఆ స్థితిలోనే సినిమా టికెట్ల విక్రయాన్ని జగన్ ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. దానివల్ల చిన్న సినిమాలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పైగా, టికెట్ ధరలతో విచ్చలవిడి వ్యాపారానికి అడ్డుకట్ట వేయడానికి అవకాశం చిక్కతుందని భావిస్తోంది. దీని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios