అమరావతి: తన హయాంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టుదలతో ఉన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయం అమలు కాకుండా చూడాలనే వ్యూహాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. రమేష్ కుమార్ ఎస్ఈసీగా ఉన్నంత కాలం పంచాయతీ ఎన్నికలు నిర్వహించకూడదని ఆయన భావిస్తున్నారు. అయితే, ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడానికి రమేష్ కుమార్ కోర్టులను ఆశ్రయిస్తున్నారు.

తాజాగా, ఎన్నికల నిర్వహణ విషయంలో హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో ముగ్గురు అధికారులు చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా వైరస్ కారణం చూపించి గతంలో రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు. అదే కారణం చూపించి ఎన్నికలు నిర్వహించలేమని జగన్ ప్రభుత్వం వాదిస్తూ వస్తోంది. 

బీహార్ శానససభ ఎన్నికలను, తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎన్నికలను చూపించి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి వీలుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాదిస్తూ వస్తున్నారు. అయితే, తాజాగా ఎన్నికలను అడ్డుకోవడానికి వైఎస్ జగన్ కు అస్త్రం అంది వచ్చింది. కరోనా వైరస్ స్ట్రేయిన్ ను చూపించి ఎన్నికలను నిర్వహించడం సాధ్యం కాదని జగన్ ప్రభుత్వం చేతులు ఎత్తేసే అవకాశం ఉంది. 

బ్రిటన్ లో వెలుగు చూసిన కొత్త కరోనా వైరస్ ప్రమాదం రాష్ట్రానికి పొంచి ఉందని జగన్ ప్రభుత్వం వాదించే అవకాశం ఉంది. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రికి కరోనా వైరస్ సోకిన ఓ మహిళ చేరుకుంది. ఢిల్లీ కర్వారంటైన్ నుంచి తప్పించుకుని ఆమె రాజమండ్రికి వచ్చింది. ఆమె, ఆమె కుమారుడి రక్త నమూనాలను పూణే వైరాలజీ ల్యాబ్ కు పంపించారు. ఆమెకు సోకింది పాత కరోనా వైరసా, కొత్త వైరసా అనేది తేలాల్సి ఉంది. 

ఆలాగే, బ్రిటిన్ నుంచి వచ్చినవారిలో 22 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది.  వారికి కొత్త రకం వైరస్ మ్యూటెంట్ స్ట్రేయిన్ సోకిందా, లేదా అనేది తేలాల్సి ఉంది. ఆ స్థితిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలేమని జగన్ ప్రభుత్వం ఎస్ఈసీకి చెప్పే అవకాశం ఉంది.