కరోనా వ్యాప్తి: లాక్ డౌన్ కు రోజా, రజిని సహా వైసీపీ పెద్దల కొత్త అర్థాలు ఇవే...
వైసీపీ నేతలకు ఈ లాక్ డౌన్ నియమాలంటే లెక్కలేకుండా పోయింది. లాక్ డౌన్ నియమాలు మాకు పట్టవు అన్నట్టుగా, ఈ లాక్ డౌన్ లో ప్రజలకు అందించే సహాయ కార్యక్రమాలను ప్రజా ప్రతినిధులుగా తమ బాధ్యతతో కాకుండా ఏదో ప్రచారా ఆర్భాటాల కోసం అన్నట్టుగా వాడుకుంటున్నారు.
కరోనా దెబ్బకు ప్రపంచమంతా అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. ప్రపంచదేశాలన్ని, ఈ మహమ్మారిపై యుద్ధం ఎలా సాగించాలో అర్థం కాక తలలు బాదుకుంటున్నాయి.
ప్రజల ప్రాణాలను ఈ మహమ్మారి పంజా నుండి కాపాడుకోవడానికి లాక్ డౌన్ ఒక్కటే ఏకైక మార్గం అని ఒక నిర్ణయానికి వచ్చి, ఆర్థికంగా వేల కోట్ల నష్టం వాటిల్లుతున్నా లాక్ డౌన్ ను విధించింది భారత ప్రభుత్వం.
కరోనా వైరస్ కి మందు లేదు, వాక్సిన్ రావడానికి కనీసం ఇంకో పది నెలల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో గత్యంతరం లేక, ఆర్ధిక భారం మోయలేకుండా ఉన్నప్పటికీ కూడా భారత దేశం లాక్ డౌన్ బాటలో ప్రయాణించక తప్పలేదు.
ఇలా లాక్ డౌన్ విధించడానికి ప్రధానోద్దేశం జనాలు తమ మధ్య భౌతిక దూరం పాటించడం ద్వారా ఈ కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకకుండా అరికట్టవచ్చని. ప్రజల కదలికలను పూర్తిగా నిరోధించడం ద్వారా ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చన్నది ప్రభుత్వ ఆలోచన.
కానీ మన వైసీపీ నేతలకు మాత్రం ఈ లాక్ డౌన్ నియమాలంటే లెక్కలేకుండా పోయింది. లాక్ డౌన్ నియమాలు మాకు పట్టవు అన్నట్టుగా, ఈ లాక్ డౌన్ లో ప్రజలకు అందించే సహాయ కార్యక్రమాలను ప్రజా ప్రతినిధులుగా తమ బాధ్యతతో కాకుండా ఏదో ప్రచారా ఆర్భాటాల కోసం అన్నట్టుగా వాడుకుంటున్నారు.
మొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కోవిడ్ ర్యాలీ అంటూ ట్రాక్టర్ ర్యాలీ తీసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ పేరుతో తీసిన ఈ ర్యాలీ వల్ల రావలిసి ప్రచారంతో పాటుగా కరోనా వైరస్ కూడా వచ్చింది. ప్రభుత్వోద్యోగులు కరోనా పాజిటివ్ గా తేలారు.
ఈ ఘటన అయిపోయింది అనుకోగానే మన నగరి ఎమ్మెల్యే రోజా గారు లాక్ డౌన్ వేళ బోర్ పంప్ ను ప్రారంభించడానికి పయనమయ్యారు. ఆమె నడుస్తుండగా ప్రజలంతా పూలు కూడా చల్లడం ఇక్కడ గమనార్హం. ఆమెకు ఇంకా సినిమా వాసనలు పూర్తిగా పోయినట్టులేవు.
ఈ సంఘటనలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన తరువాత కూడా మన సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గారు కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సరుకులు అందించడానికి ట్రాక్టర్ల ద్వారా సామాను పంపించారు.
ఈ సామానంతా వివిధ పారిశ్రామిక వేత్తల సహాయ సహకారాలతో కొన్నవి. అయినా కూడా వీటిని ఇలా ర్యాలీ గా పంపించడం, దానికి ఇంకో ఎంపీ చీఫ్ గెస్ట్ గా హాజరయి జెండా ఊపి ప్రారంభించడం. ఈ వింత వైపరీత్యాలేమిటో అర్థం కావడం లేదు.
ఈ ఎత్తున మీడియా, సామజిక కార్యకర్తలు గొంతెత్తి అరుస్తున్నా కూడా వైసీపీ నేతలు మాత్రం ఊరుకునే విధంగా కనబడడం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని గారు కరోనా పై అవగాహన పేరుతో మీటింగ్ నిర్వహించారు.
కరోనా గురించి తెలిసిన ఎవరైనా ప్రజలను చైతన్య పరచాలని అనుకున్నప్పుడు, చైతన్య పరచడంలో చేయాల్సిన ముఖ్యమైన పని ఏదైనా ఉంది అంటే.. అది ఎక్కడా గుమికూడొద్దని చెప్పడం. అంతే తప్ప అవగాహన సదస్సుల పేరిట ఇలా ప్రజల చేత లాక్ డౌన్ ని ఉల్లంఘింపజేయడం మాత్రం కాదు!
బహుశా వైసీపీ నేతలంతా తాము అధికార పక్షానికి చెందినవారం అని కరోనా భయపడుతుందనుకున్నారో ఏమో కాబోలు.... ఇలా సభలు సమావేశాలు పెడుతున్నారు.
వీరంతా ఒకెత్తయితే చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని ఒకెత్తు. ఆమె ఈ మొత్తం కరోనా ఎపిసోడ్ లో ఫోటో గ్రాఫర్లను, వీడియో గ్రాఫర్లను వెనకేసుకు తిరగడం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
ఇలా వీడియోలు తీయించుకోవడంతో పాటుగా వాటికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆడ్ చేసి సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేయడం, వాటిని ప్రమోట్ కూడా చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న వేళ, ఇప్పటికైనా వైసీపీ నాయకులంతా ఈ లాక్ డౌన్ నియమాలను వారు స్వయంగా పాటిస్తూ, పాటిస్తున్న ప్రజలను మీటింగుల పేరిట, ఓపెనింగుల పేరిట, సభలు, సమావేశాల పేరిట, పంపకాల పేరిట బయటకు పిలవకుండా ఉంటే చాలు.