ఆంధ్రప్రదేశ్‌లోకి బీఆర్ఎస్ ఎంట్రీ.. కేసీఆర్, జగన్‌ల మధ్య మైత్రి కొనసాగేనా..?
భారత రాష్ట్ర సమితితో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ విస్తరణపై దృష్టి సారించారు. కేసీఆర్ ఏపీలోకి ఎంట్రీ ఇస్తుండటంతో.. అక్కడి అధికార పార్టీ వైసీపీతో ఇదివరకు ఉన్న సఖ్యత కొనసాగుతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.
భారత రాష్ట్ర సమితితో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ విస్తరణపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఏపీ మజీ మంత్రి రావెల కిషోర్ బాబు, తోట చంద్రశేఖర్, చింతల పార్థ సారథి.. తదితరులు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అయితే కేసీఆర్ ఏపీలోకి ఎంట్రీ ఇస్తుండటంతో.. అక్కడి అధికార పార్టీ వైసీపీతో ఇదివరకు ఉన్న సఖ్యత కొనసాగుతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.
గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్‌ల మధ్య మంచి సఖ్యత ఉంది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ విజయానికి కేసీఆర్ ఏదో ఒక విధంగా పరోక్షంగా సాయం అందించారని కొందరు చెబుతుంటారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీఎం జగన్ దంపతులు.. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్ ఆతిథ్యం స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. వైఎస్ జగన్‌కు స్వీటు కూడా తినిపించారు. అప్పటి నుంచి వారి మధ్య సఖ్యత కొనసాగుతూనే ఉంది.
ఆ తర్వాత కొద్దిరోజులకే తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మించిన ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం జగన్ హాజరయ్యారు. అయితే ఆ సమయంలో టీడీపీ చేసిన విమర్శలను సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా తిప్పికొట్టారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఆ ప్రాజెక్టును ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. ఆ తర్వాత కూడా ఒకసారి సీఎం జగన్ ప్రగతి భవన్‌కు వెళ్లి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఒకటి రెండు ప్రైవేట్ ఫంక్షన్‌లకు హాజరైన సమయంలో ఇరువురు నేతలు కలుసుకున్నారు. అప్పుడు వారిద్దరు నవ్వుతూ మాట్లాడుకోవడం కనిపించింది.
అయితే మధ్యలో కొన్ని అంశాల విషయంలో ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటుచేసుకున్నప్పటికీ.. అవి కొద్దిరోజులకు సద్దుమణగుతూ వచ్చాయి. మౌలిక సదుపాయాలకు సంబంధించి ఏపీలో కంటే తెలంగాణలో మెరుగైన పరిస్థితులు ఉన్నాయని కేటీఆర్ చేసిన కామెంట్స్ అయితే తీవ్ర దుమారమే రేపాయి. అయితే దీనికి స్వయంగా కేటీఆర్ ఫుల్‌స్టాప్ పెట్టారు. సీఎం జగన్ తనకు సోదరుడిగా భావిస్తానని చెప్పిన కేటీఆర్.. ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని తెలిపారు. మరోవైపు ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే కేసీఆర్, జగన్‌ల మధ్య మైత్రి కొనసాగుతూనే ఉంది.
బీఆర్ఎస్ ప్రకటనతో..
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే ప్రకటన వెలువడిన తర్వాత.. ఏపీలో ఆయన ఎంట్రీ ఎలా ఉండబోతుందనే చర్చ కూడా ఆసక్తిని రేపింది. కేసీఆర్ వారి బీఆర్‌ఎస్ తమ మద్దతు ఇవ్వాలని అడిగితే ఏం చేయాలనే విషయంపై ఆలోచిస్తామని గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఒక రాజకీయ పార్టీగా ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చని చెప్పారు. అయితే తమకు మాత్రం తమిళనాడు, కర్ణాటక లేదా మరే రాష్ట్రంలోనూ ఎన్నికల్లో పోరాడే ఆలోచనలు, ఉద్దేశాలు లేవని ఆయన అన్నారు.మరోవైపు కొడాలి నాని కూడా గతంలో మాట్లాడుతూ.. ఏపీలో బీఆర్ఎస్ మనుగడకు కాలమే సమాధానం చెప్పాలన్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని వ్యాఖ్యానించారు.
మారిన వైసీపీ వాయిస్..!
అయితే సోమవారం ఏపీ ప్రాంతానికి చెందిన కొందరు నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. మరోవైపు తాము ఏపీలో 175 స్థానాల్లో పోటీ చేస్తామని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. అదే విధంగా ఏపీలో మూడు రాజధానుల నిర్ణయం సరైనది కాదని బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముందు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు చెప్పారు. అలాగే బీఆర్ఎస్ అధికారంలో వస్తే.. రాజధాని, సెక్రటేరియట్ నిర్మిస్తామని కూడా చెప్పారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో కొందరు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు.. బీఆర్ఎస్‌పై విమర్శలు చేశారు. తమకు ఏ పార్టీతోని పొత్తు ఉండబోదని కూడా స్పష్టం చేస్తున్నారు.
మాజీ మంత్రి పేర్ని నాని అయితే బీఆర్ఎస్‌పై ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఏపీలో కేఏ పాల్ పార్టీ 175 స్థానాలకు పోటీ చేసిందని.. బీఆర్‌ఎస్ పోటీ చేస్తానంటే తప్పుబట్టడం ఎందుకు అంటూ సెటైర్లు వేశారు. ఏపీలో కేసీఆర్ ఏం చేస్తారు?, ఏపీని వాళ్లు ఉద్దరించేదేంటని పేర్ని నాని ప్రశ్నించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో దొంగ కరెంట్ తీసుకోవడం లేదా, ఏపీకు వెన్నుపోటు పొడుస్తున్నదెవరు, కాస్తైనా సిగ్గుండాలి కదా అని పేర్ని నాని మండిపడ్డారు. మా ఆస్తులు మాకు పంచివ్వకుండా మోసం చేశారని.. ముందు విద్యుత్ బకాయిలు చెల్లించి మాట్లాడండి అని అన్నారు.
మరో మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ ప్రభావం శూన్యం అని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. కేసీఆర్ వల్లే రాష్ట్రం విడిపోయిందని, తాము నష్టపోయామని ఏపీ ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు.
రోజా కామెంట్స్‌కు ప్రాధాన్యత..
ఇక, మంత్రి రోజా మాట్లాడుతూ.. ఎవరైనా ఎక్కడైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చని అన్నారు. అందరూ అన్నదమ్ముల్లాగా ఉన్న సమయంలో మాకు రాష్ట్రం కావాలని చెప్పి ఏపీ, తెలంగాణను విడగొట్టారు. ముందు తెలంగాణ నుంచి ఏపీ రావాల్సిన వాటి సంగతి తేల్చి ఇక్కడి ప్రజలకు సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ రోజా వ్యాఖ్యలను ప్రత్యేకంగా చూడాల్సి ఉంది. ఎందుకంటే.. కేసీఆర్ రాజకీయాల పట్ల రోజా అభిమానంతో ఉంటారు. గతంలో కూడా పలు సందర్భాల్లో వీరిద్దరూ భేటీ అయ్యారు. గతంలో తమిళనాడుకు వెళ్లే సమయంలో కేసీఆర్.. రోజా ఇంటికి వెళ్లి ఆతిథ్యం స్వీకరించారు. రోజా తాను మంత్రి అయ్యాక కూడా కేసీఆర్‌ను రోజా కుటుంబ సమేతంగా వెళ్లి కలిశారు. ఈ క్రమంలోనే రోజా చేసిన కామెంట్స్‌కు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కేసీఆర్, జగన్‌ల మధ్య మైత్రి కొనసాగేనా..?
ఈ క్రమంలోనే కేసీఆర్, జగన్‌ల మధ్య మైత్రి కొనసాగుతుందా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా కొన్ని రోజుల పాటు ఈ విమర్శలు కొనసాగుతాయా? లేకపోతే ఏపీలోకి బీఆర్ఎస్ రాకను వైసీసీ వ్యతిరేకిస్తుందా? అనేది వేచి చూడాల్సి ఉంది. అయితే బీఆర్ఎస్‌లో చేరుతున్న నేతలు, ఏపీలో ఎంట్రీ వల్ల కలిగే లాభనష్టాలను అంచనా వేసుకున్న తర్వాతే జగన్ పార్టీ ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే బీఆర్ఎస్, వైసీపీల మధ్య మాటల యుద్దం రాజకీయాలకే పరిమితం అవుతుందా?.. జగన్, కేసీఆర్‌ల మైత్రి అలాగే కొనసాగుతుందా అనేది కూడా తెలియాల్సి ఉంది.