హైదరాబాద్: దేశమంతా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చట్టాన్ని కొందరు ముఖ్యమంత్రులు స్వాగతిస్తుంటే...బీజేపీయేతర ముఖ్యమంత్రుల్లో కొందరు ఈ చట్టాన్ని అమలు చేసేది లేదని తెగేసి చెబుతున్నాయి. బీజేపీకి మిత్రపక్షమైన నితీష్ కుమార్ కూడా ఈ చట్టాన్ని బీహార్ లో అమలు చేసేది లేదని తెగేసి చెప్పాడు. 

ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అయితే ఏకంగా భారీ ర్యాలీ నిర్వహించిమరీ ఈ చట్టాన్ని వ్యతిరేకించింది. అంతటితో ఆగకుండా నరేంద్ర మోడీ, అమిత్ శాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పౌరసత్వ చట్టానికి అనుకూలంగా పార్లమెంటులో ఓటు వేసినప్పటికీ ఎన్నార్సిని మాత్రం ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసేదే లేదని తేల్చి చెప్పాడు. 

Also read: సీఎం పీఠాలు ఎక్కిన నేతలు: తెర వెనక భార్యల వ్యూహాలు

ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా ఓటు వేసినప్పటికీ కూడా దాన్ని అమలు చేసేది లేదని అన్నాడు. తెలంగాణాలో ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ దేశమంతా తిరుగుతూ పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా మద్దతు కూడగడుతూ తీవ్రస్థాయిలో బీజేపీ ప్రభుత్వం పై విరుచుకు పడుతున్నారు. 

ఇంత జరుగుతున్న కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం మౌనం వహిస్తున్నారు. ఒక వైపు కాంగ్రెస్ ఏమో బిల్లుపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకున్నట్టు వ్యతిరేక నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తీసుకువస్తుండగా... బీజేపీ ఏమో కెసిఆర్ పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేసాడని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. 

ఇంతమంది ఇన్ని విధాలుగా కెసిఆర్ పై ఒత్తిడి తీసుకువస్తున్నప్పటికీ కెసిఆర్ మాత్రం మౌనం వీడడం లేదు. ఆయన నోరు మెదపకుండా ఉండడానికి కారణమేంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

మామూలుగా చూడడానికి కేసీఆర్ ఏదో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు కాబట్టి దానిపైన మాట్లాడితే ఇంకా ఇబ్బందులు తలెత్తవచ్చు కాబట్టి మాట్లాడడం లేదు అని అనిపించవచ్చు.

ఇది ఒకింత వాస్తవం కూడా. వాస్తవానికి కెసిఆర్ ఆర్టికల్ 370 రద్దుకు బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారు. అప్పుడు కూడా దానిపై ఎటువంటి వైఖరి ఓపెన్ గా తీసుకోలేదు. దానిపై ఆయనతోసహా ఏ తెరాస నాయకుడు కూడా మాట్లాడలేదు. 

అప్పుడు కెసిఆర్ గనుక దానిపై మాట్లాడి ఉంటె వాస్తవానికి ఆయన బీజేపీ ప్రయోగించే హిందుత్వ కార్డును ఒకింత సమర్థవంతంగా ఎదుర్కొనేవాడు కూడా. కాకపోతే ఆయనదానిపై గనుక మాట్లాడి ఉంటే కాంగ్రెస్ పార్టీ కెసిఆర్ ను ముస్లిం ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేసేది.

Also read: పౌరసత్వ సెగ: ప్రతిపక్షాలపై మోడీ విసుర్లు

దానితోపాటు అసదుద్దీన్ ఓవైసీపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగేవి. ప్రస్తుతానికి ఎవరు అవునన్నా కాదన్న ఒవైసి తెరాస కు మిత్రపక్షం. మిత్రపక్షాన్ని అప్పుడు ఇబ్బంది పెట్టె ప్రయత్నం కెసిఆర్ చేయదల్చుకోలేదు.

కేవలం వోట్ వేయడం వల్ల కెసిఆర్ ను వారు ఏమి అనలేకపోయారు. దానికి కారణం కూడా లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలే స్వయంగా ఆ బిల్లును సమర్థించారు. కాబట్టి కెసిఆర్ ను ఎత్తి చూపే నైతికతను వారు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వారు కెసిఆర్ ను విమర్శించలేకపోయారు. 

ఇప్పుడు ఈ పౌరసత్వ చట్టం పై వ్యతిరేకంగా గనుక కెసిఆర్ ఓపెన్ గా మాట్లాడితే బీజేపీ దాన్ని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి కెసిఆర్ హిందువులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నదని, ముస్లిం ఓట్ల కోసం గర్లాడుతున్నదని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. 

బీజేపీ సోషల్ మీడియా ఆర్మీ ఎంత బలంగా పనిచేస్తుందో కెసిఆర్ కు పార్లమెంటు ఎన్నికల సమయంలోనే ఒకసారి తెలిసొచ్చింది. ఆయన ఏదో వివరణ ఇస్తూ హిందువులు బొందువులు అన్న పదాన్ని బీజేపీ తమకు అనుకూలంగా ఎలా మార్చుకుందో ఆయన స్వయంగా చూసాడు. ఆ దెబ్బకు ఆయన ఉత్తరతెలంగాణ జిల్లాల్లో 3 సీట్లను కోల్పోవాలిసి వచ్చింది. 

కేవలం ఆ ఒక్క మాటకే ఇంత చేయగలిగిన బీజేపీ ఇప్పుడు దేశమంతా ఈ పౌరసత్వ చట్టం హిందువులు వర్సెస్ ముస్లిమ్స్ అన్నట్టుగా సాగుతున్న వేళ ఆయనగనుక ఏ ఒక్క చిన్న మాట మాట్లాడినా బీజేపీ దాన్ని చాలా శక్తివంతంగా, సమర్థవంతంగా తెరాస కు వ్యతిరేకంగా....బీజేపీ బలపడడానికి ఎలా వాడుకుంటుందో కెసిఆర్ కు తెలియంది కాదు. 

పసుపు బోర్డు అనే ఒక చిన్న లోకల్ ఇష్యూ ని తీసుకునే ఏకంగా తన కూతురిని బీజేపీ ఎలా ఓడగొట్టిందో ఆయన ఇంకా మరిచిపోయి ఉండరు. లోకల్ విషయాన్నే అంత బలమైన ప్రచార అస్త్రంగా బీజేపీ వాడుకోగలిగినప్పుడు...ఇంత పెద్ద విషయాన్నీ బీజేపీ ఖచ్చితంగా కెసిఆర్ కు వ్యతిరేకంగా వాడుకుంటుంది. ఇది తథ్యం. 

ఈ నేపథ్యంలోనే కెసిఆర్ ఎటువంటి జాతీయ అంశాలపైనా కూడా నోరు మెదపకుండా వ్యూహాత్మక మౌనాన్ని వహిస్తున్నాడు. ప్రస్తుతానికి కెసిఆర్ మౌనం ఇటు బీజేపీ కి కానీ కాంగ్రెస్ కి కానీ ఎటువంటి రాజకీయాస్త్రాలను అందించకుండా ఉంటుందని కెసిఆర్ భావిస్తున్నారు.