అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతపర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. నిన్న అహ్మదాబాద్ లో నమస్తే ట్రంప్ ఈవెంట్ లో పాల్గొన్న ట్రంప్ అక్కడి నుండి తాజ్ మహల్ సందర్శనకు వెళ్లారు. అక్కడి నుండి ఢిల్లీ చేరుకున్నారు. దేశ రాజధానిలో నేడు బిజీ బిజీగా గడపనున్నారు. 

ఒక పక్క ట్రంప్ పర్యటన జరుగుతుంటే.... మరొపక్కనేమో ఢిల్లీలో అల్లర్లు చెలరేగుతున్నాయి. అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ట్రంప్ ఉండే, పర్యటించే ప్రాంతాలు అల్లర్లు జరుగుతున్న ఈశాన్య ఢిల్లీ ప్రాంతానికి చాలా దూరంలో ఉన్నాయి.

వాటి వళ్ళ ట్రంప్ షెడ్యూల్ పై ఎటువంటి ప్రభావం పడకపోయినప్పటికీ..... ఇలా అగ్ర దేశాధినేత పర్యటిస్తున్నప్పుడు ఇలాంటి అల్లర్లు చెలరేగడం మాత్రం అంత మంచి విషయం మాత్రం కాదు. 

గతంలో ఎప్పుడు ఏ అమెరికా అధ్యక్షుడి భారత పర్యటన జరిగినా కూడా కాశ్మీర్ ప్రాంతంలో సరిహద్దు వెంబడి పాక్ కవ్వింపు చర్యలకు దిగేది. కాశ్మీర్లో శాంతియుత వాతావరణం లేదని, కాశ్మీర్ ప్రజలు భారత ప్రభుత్వం పట్ల సంతోషంగా లేరనే అబద్ధాన్ని....  నిజం అని చూపెట్టడానికి ఆ పని చేసేవారు. 

ఈసారి కూడా సరిహద్దుల్లో పాకిస్తాన్ అలాంటి దుశ్చర్యలకు ఒడిగడుతుందేమో అని గస్తీ పెంచడంతోపాటు సరిహద్దును కట్టుదిట్టం చేసింది. కానీ ఈసారి అక్కడ కాకుండా ఢిల్లీలో ఇలాంటి అల్లర్లు చెలరేగడం ఆందోళన కలిగించే అంశం. 

అక్కడ ఈశాన్య ఢిల్లీలో పరిస్థితి గంటగంటకు దిగజారుతోంది. పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూల వర్గాలు, వ్యతిరేకవర్గాలు ఒకరిమీద ఒకరు రాళ్లు రువ్వుకుంటూ బీభత్సానికి పాల్పడుతున్నారు. ఒక హెడ్ కానిస్టేబుల్ తోపాటు 7గురు పౌరులు మరణించారు. దాదాపు 150 మంది గాయాలపాలయ్యారు. ఇందులో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. 

ఈ సమయంలో అలా జరగడం నిజంగా ఆందోళనకరమైన అంశం. వాస్తవానికి గత రెండు నెలలకు పైగా ఢిల్లీలోని షహీన్ బాగ్ లో నిరసనలు నడుస్తున్నాయి. కానీ ఒక్కసారిగా ట్రంప్ పర్యటన ఖరారు కాగానే జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర బైఠాయించడం మొదలుపెట్టారు. 

వారు శాంతియుతంగానే ఉన్నారు. కాకపోతే ఇలా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇలా నిరసనలు దేశ రాజధానిలో మెయిన్ రోడ్ ఎక్కడం అంత మంచి విషయం కాదని అందరికి అనిపించొచ్చు. దీనితో నిరసనలు తెలుపుతుండగా... మద్దతుదారులు పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా ర్యాలీ తీశారు. 

ఈ రెండు గుంపులు ఒక దగ్గరకు రాగానే ఘర్షణ చోటు చేసుకోవడం సహజం. దాన్ని అరికట్టడంలో మాత్రం ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని చెప్పవచ్చు. అంత హై ప్రొఫైల్ ట్రంప్ పర్యటన జరుగుతుండగా అలా ఇంటలిజెన్స్ వైఫల్యం నిజంగా ఘోరమైన అంశం. 

ట్రంప్ వస్తున్న సందర్భంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారత్ లో నిరసనలు జరుగుతున్నాయనే విషయాన్నీ ట్రంప్ దృష్టికి తీసుకెళ్లడానికి పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న వారు ప్రయత్నం చేసి ఉండవచ్చు. దాన్ని ఆపడంలో ఢిల్లీ పోలీసులు ఖచ్చితంగా విఫలమయ్యారు. 

కనీసం మత పెద్దలతోనయినా మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చునంటే బాగుండేది. ఎన్నికల ప్రచారంలో జరిగిన విషపు ప్రచారం కూడా ఇందుకు ఒక కారణం. ఒక్క పార్టీ అని కాకుండా తిలా పాపం తలా పిరికెడు అన్నట్టుగా అన్ని పార్టీలు ఆ టెన్షన్ కి కారణమయ్యాయి. 

కనీసం ఇప్పటికయినా భారత ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, ఉన్నతాధికారులు అంతా కలిసికట్టుగా కూర్చొని మాట్లాడారు. శాంతియుత వాతావరణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

ఇప్పటికైనా అక్కడ శాంతియుత వాతావరణం ఏర్పడాలని, హింసకు ఎండ్ కార్డు పడాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.