Asianet News TeluguAsianet News Telugu

కొంటె బాలయ్య.. చిలిపి చంద్రుడు.. వీళ్ల అల్లరి అన్ స్టాపబుల్...

అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికే ఈ షో చూసేదాకా చంద్రబాబులో ఇంత హాస్యం, చిలిపిదనం, కొంటెతనం.. ఉన్నాయని ఎవ్వరూ ఊహించరు. ఇక పిల్లనిచ్చిన అల్లుడు, మేనల్లుడు అయిన నారా లోకేష్ ను కూడా ఒక్క ఆట ఆడుకున్నాడు బాలయ్య. వెండి తెరమీది బాలయ్యకు బుల్లితెరమీది అన్ స్టాపబుల్ బాలయ్యకు పోలికే లేదు. 

unstoppable with NBK opinion
Author
First Published Oct 15, 2022, 1:20 PM IST

అన్ స్టాపబుల్ షో.. హీరోగానే కాదు బాలకృష్ణ.. హోస్ట్ గా కూడా .. ‘నచ్చావయ్యా.. బాలయ్యా’.. అనిపించాడు. నటుడిగా, రాజకీయనాయకుడిగా నచ్చని వారికి కూడా తాను నచ్చేలా చేశాడు. ఈ షోలో బాలకృష్ణలో యాక్టింగ్ కనిపించదు..ఆయనలోని భోళాతనం.. సూటిగా అడిగే ప్రశ్నలు.. ఎంత కాంట్రావర్సీ క్వశ్చన్ అయినా అలా ఈజీగా వదలేయడం.. సమాధానం రాబట్టడం.. ఇంటర్వ్యూలో తనూ, తన పర్సనల్ లైఫ్ ను అందులోని ఎత్తుపళ్లాలను నిజాయితీగా అవసరానికి తగ్గట్టుగా బయటపెట్టడం.. అసలు బాలకృష్ణ ఎలాంటివాడో పట్టిస్తాయి. 

అందుకే, తెరమీది బాలయ్యకు అన్ స్టాపబుల్ బాలయ్యకు పోలిక లేదు. నిజానికి బాలకృష్ణ అంటే అభిమానులకు ఓ సంబరం.. ‘గిల్లితే గిచ్చిపించుకోవాలి కానీ అరవకూడదు..’ అని పోకిరిలో ప్రకాష్ రాజ్ అన్నట్టుగా.. ఆయన అభిమానులు బాలకృష్ణ కొడితే కొట్టించుకుంటారు తప్పితే కిక్కురుమనరు. మొదటి సీజన్, మొదటి ఎపిసోడ్ చూసినప్పుడే బాలకృష్ణ.. నాకు తెగ నచ్చేశాడు.. అంతకు ముందు బాలకృష్ణ అంటే నాకు తెగ కామెడీ.. ‘బాబోయ్ బాలకృష్ణ సినిమా’.. ‘ఈ పిచ్చి పీక్స్ అభిమానులేంట్రా బాబు’.. కళ్లతో ట్రైన్ వెనక్కి పంపడం.. కంటి చూపుతో చంపేయడం.. ఒక్క దెబ్బకు సూమోలు గాల్లో ఎగరడం..పెద్ద అతి..ఎలా చూస్తార్రా నాయనా ఈయన సినిమాలు అనిపించేది.

unstoppable with NBK opinion

కానీ, దాన్నంతా ఒక్క షోతో తుడిచిపడేశాడు. నాలాంటి వారిని కూడా తన ఫ్యాన్స్ ఖాతాలో చేర్చుకున్నాడు మా బంగారు బాలయ్య..ఇక రీసెంట్ గా రిలీజైన సెకండ్ సీజన్ అన్ స్టాపబుల్.. ఫస్ట్ ఎపిసోడ్ బంపర్ బ్లాస్ట్.. మాజీ ముఖ్యమంత్రి, బావ, తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో చేసిన ఈ ఎపిసోడ్.. అస్సలు చంద్రబాబులోని చిలిపికోణాన్ని భలే పట్టించింది. బావమరిదితో కలిసి మరో చంద్రబాబు మనముందు కనిపిస్తాడు. ఆ క్రెడిట్ అంతా మళ్లీ మన బాలయ్యదే. 

ఓ ప్రశ్న అడుగుతూ.. మా చెల్లికి ఫోన్ చేసి ఐలవ్యూ చెప్పు బావా అంటే.. చంద్రబాబు సిగ్గుల మొగ్గ అవుతూ.. ఐ లైక్ యూ అని చెప్పడం.. ‘ఏ లవ్వు చేయరా’.. అంటూ బాలకృష్ణ ఆట పట్టించడం.. అది షోలాగా కాకుండా ఇంట్లో బావాబావమరుదులు సరదాగా మాట్లాడుకున్నట్టు కనిపిస్తుంది. ఇలాంటి షోల్లో సెలబ్రిటీలు చాలా కాన్షియస్ గా ఉంటారు. ముందే అడిగే క్వశ్చన్ల ప్రిపరేషన్, గట్రా ఉంటుంటాయి. ఇక్కడ కూడా స్క్రిప్ట్ ప్రకారమే నడిచింది.. కానీ దాన్ని బాలయ్య హ్యాండిల్ చేసిన తీరు అద్భుతహ: అంతే.. ఇక.. 

చంద్రబాబు కాలేజీ రోజుల్లో చేసిన చిలిపి చేష్టలు, అల్లుడైన నారా లోకేష్ స్మిమ్మింగ్ పూల్ లో అమ్మాయిలతో ఉన్న ఫొటో వైరల్ అవ్వడం.. తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడవడం మీద.. తాజాగా ఎన్టీఆర్ హెల్త్  యూనివర్సిటీ పేరు మార్చడం మీద.. ఇలా అనేక ప్రశ్నలు.. ఎంతటి సీనియర్ జర్నలిస్ట్ అయినా, ఎంత సాన్నిహిత్యం ఉన్న వ్యక్తులైనా అడగడానికి జంకే ప్రశ్నలు.. సరదా సంభాషణల మధ్య అలవోకగా.. అలా విసిరి.. సమాధానాలు రాబట్టాడు మన బాలయ్య బాబు. 

unstoppable with NBK opinion

ఈ షో చూసేదాకా చంద్రబాబులో ఇంత హాస్యం, చిలిపిదనం, కొంటెతనం.. ఉన్నాయని ఎవ్వరూ ఊహించరు. భార్యకు ఐలవ్యూ చెప్పమంటే సిగ్గులమొగ్గవ్వడం, బాలకృష్ణ జుట్టుకు రంగువేసుకున్నాడంటూ ఛలోక్తులు విసరడం.. సెకండ్ ఫ్యామిలీ గురించి వసుంధరకు చెబుతానుండూ అంటూ ఆటపట్టించడం.. అల్లరి అన్నయ్య చేతిలో ఇరుక్కుపోయా అంటూ భార్యకు కంప్లైంట్ చేయడం.. ఇలాంటివి భలే నచ్చేస్తాయి. ఇక షో మధ్య మధ్యలో రాజకీయాలు కాస్త సీరియస్ టాపిక్ అయినా.. అందులో వైఎస్సార్ తో తన స్నేహం, ఎన్టీఆర్ పై తిరుగుబాటు గురించి చెప్పేవి.. అంత ధైర్యంగా, పబ్లిక్ వేదిక మీద అంత ఓపెన్ గా చెప్పడం, చెప్పించడం ఈ షోకు హైలెట్. 

పిల్లనిచ్చిన అల్లుడు, మేనల్లుడు అయిన నారా లోకేష్ ను కూడా ఒక్క ఆట ఆడుకున్నాడు బాలయ్య. అన్నీ నావి నావి అంటూ బ్రాహ్మణిని పట్టేశావ్.. అని,బ్రాహ్మణి పెళ్లికి ఒప్పుకోకపోతే చదువు పెరి చెప్పి.. బుట్టలో పెట్టేశావ్ అంటూ.. స్మిమ్మింగ్ పూల్ ఫోటో చూపించి.. ఏంటీ కథా.. బ్రాహ్మణికి తెలుసా?.. మండలిలో కూడా చూపించారు కదా..అనడం... మంగళగిరిలో ఓడిపోవడం గురించి.. ఇలా ఒక్కటేంటి.. చెడుగుడు ఆడేశాడు. ఓ సందర్భంలో చంద్రబాబు జూబ్లీహిల్స్ లోని బాలయ్య ఇంటిగురించి చెబుతుంటే.. ‘కొంపదీసి ఇల్లు నాదే అంటావా ఏంటి బావా’ అని.. ఛలోక్తి విసరడం.. దానికి బాబు హాయిగా నవ్వేయడం.. బాగుంది.

‘నారా.. నందమూరి ఒక్కటే’.. సీనియర్ ఎన్టీఆర్ తో విభేధించి ఎమ్మెల్యేలతో వేరు కుంపటి పెట్టడం విషయంలో.. ‘ఆ రోజు జరిగింది కరెక్టే’..ఇలాంటి పొలిటికల్ క్లారిటీలు కూడా బాలకృష్ణ నోటినుంచి రావడం చూసేవారికి కాస్త షాక్ కు గురి చేస్తాయి. ఇక యాజ్ యూజ్ వల్ గా చంద్రబాబు కామెడీ టైమింగ్ ఉండనే ఉంది.. ‘హైదరాబాద్ ను అభివృద్ధి చేయడం’..‘బిల్ గేట్స్ ఒక్క నిమిషం టైం ఇచ్చి.. 45 ని.లపాటు మాట్లాడడం..’, విజన్ ఉన్న నాయకుడు లాంటివి కూడా మిమ్మల్ని అలరిస్తాయి. 

ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే.. బాలకృష్ణ అదుర్స్ అంతే.. కిందా మీదా ఊపు.. బాలయ్య బాబు తోపు.. అంటే.. అంతేగా, అంతేగా.. అనడమే మన వంతు... ఈ ఎపిసోడ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఇది చూశేశాక... ఫస్ట్ సీజన్ మొత్తం చూడకుండా మీరు ఉండలేరు.. నేనూ గ్యారంటీ... ఇక చివరగా ఈ షో డిజైన్ చేసిన వారిని మెచ్చుకోకుండా ఉండలేం.. తెరవెనుక వారెంత హార్డ్ వర్క్ చేస్తున్నారో.. ఈ షో సక్సెసే చెబుతోంది. హ్యాట్సాఫ్ టు దెమ్...

- సుమబాల 

Follow Us:
Download App:
  • android
  • ios