తిరుమల శ్రీవారి ఆస్తుల వేలం: ప్రత్యామ్నాయాలు ఇవీ.....

అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ భగవంతుడి ఆస్తులను అమ్మడం మాత్రం మత విశ్వాసాలతో ఆదుకోవడమే! భగవంతుడి పై ప్రేమతో, భక్తితో సదరు భక్తుడు దేవుడికి సమర్పించుకునే ఒక కానుక, తన భక్తికి ప్రతిరూపం. 

TTD Assets Auction Issue: Many Options Lie Ahead Than Sale

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో హాట్ టాపిక్ నడుస్తున్న విషయం తెలిసిందే! తాజాగా శ్రీవారి భూముల వేలం మరో హాట్ టాపిక్ గా మారింది. వేంకటేశ్వరస్వామి భూములు అమ్మకం అనేది భక్తుల మత విశ్వాసాలకు సంబంధించిన అంశం అవడంతో అది రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. అధికార విపక్షాలు ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. 

అసలు ఈ పూర్తి వివాదం అర్థమవ్వాలంటే.... అధికార విపక్షాలు వారి వాదనలను మనం అవగతం చేసుకోవాల్సి ఉంటుంది. టీటీడీకి సంబంధించి చెన్నై నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను అమ్మడానికి టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. 

అన్ని ఆస్తులను అమ్మడంలేదని, కేవలం వివిధ ప్రాంతాల్లో ఉన్న చిన్నాచితకా ఆస్తులను మాత్రమే అమ్ముతున్నామని చెబుతున్నారు, ఆస్తులన్నీ చిన్నవిగా ఉండడం, విసిరేసినట్టుగా అక్కడొకటి, అక్కడొకటి ఉండడం వల్ల వాటిని కాపాడడం కష్టమవుతుందని అంటుంది. 

భూములు అలా ఉండడం వలన అవి అన్యాక్రాంతమవుతున్నాయని వాటి నుండి వచ్చే ఆదాయం కంటే... వాటిని కాపాడడం కోసం పెట్టె ఖర్చే అధికమవుతుందని అంటుంది ప్రభుత్వం. 

ఇక ప్రభుత్వం ఇలా అనడం పై ప్రతిపక్షాలు తీవ్రంగా ఫైర్ అవుతున్నాయి. ఇక్కడొక మర్చిపోకూడని అంశం ఏమిటంటే... ప్రస్తుత టీటీడీ బోర్డు ఇప్పుడు ఏ ఆస్తుల చిట్టానయితే అమ్ముదామని ముందుపెట్టిందో.... వాస్తవానికి ప్రస్తుత చిట్టాతో మరికొన్ని భూములను అమ్మాలని అప్పటి టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఆ పాత చిట్టాలోని చాలా వరకు తగ్గించి మాత్రమే ప్రస్తుత టీటీడీ బోర్డు అమ్మకానికి పెట్టింది. 

అంటే గతంలో టీడీపీ హయాంలో ఏర్పడ్డ బోర్డే ఆ ఆస్తుల అమ్మకాల ప్రతిపాదన పెట్టింది. అంటే టీడీపీ, బీజేపీ హయాంలో ఏర్పడ్డ బోర్డే ఆ ప్రతిపాదనను పెట్టింది. ఆ ప్రశ్నకు ప్రస్తుతం ఆరోపణలు చేస్తున్న టీడీపీ, బీజేపీల వద్ద సమాధానం లేదు. 

ఇకపోతే....అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ భగవంతుడి ఆస్తులను అమ్మడం మాత్రం మత విశ్వాసాలతో ఆదుకోవడమే! భగవంతుడి పై ప్రేమతో, భక్తితో సదరు భక్తుడు దేవుడికి సమర్పించుకునే ఒక కానుక, తన భక్తికి ప్రతిరూపం. 

అలాంటి ఆస్తిని గనుక అమ్మకానికి పెట్టినప్పుడు సదరు భక్తుడి మనోభావాలు దెబ్బతినే ఆస్కారం లేకపోలేదు. ఒకవేళ గనుక వేలంలో ఆ భూమిని వేరే ఎవరో కొనుక్కున్నప్పుడు దాన్ని స్వామికి సమర్పించుకున్న భక్తుడులో తన కానుక వ్యర్థమయిందనే భావన ఉంటుంది. 

భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండే ఒక అపురూపమైన బంధాన్ని తనకు నచ్చిన రీతిలో ఆ బంధాన్ని గౌరవిస్తూ, భగవంతుడిపై ప్రేమను చూపెట్టుకుంటాడు ఇలాంటి కానుకల ద్వారా భక్తుడు.  

ఇప్పుడు ఆస్తులను అమ్మడమంటే.... భక్తుడి ప్రేమను అమ్మడమే. ప్రభుత్వం ఇలా ఆస్తులను అమ్మడానికి చెప్పిన కారణం ఏమిటంటే... ఈ ఆస్తులన్నీ కూడా చిన్నవిగా ఉండడం వల్ల వాటిని మెయింటైన్ చేయలేకపోతున్నామని అంటున్నారు. 

ఇలా గనుక ఆస్తులను కాపాడలేముఈ అనే కారణం చేత గనుక టీటీడీ ఆస్తులను అమ్మకానికి పెడితే.... ఇక మీదట ఇలా చిన్న చిన్న ఆస్తులను భగవంతుడికి ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. కాబట్టి వాటిని అమ్మకానికి పెట్టి డబ్బులు సంపాదించే కన్నా వాటిని వేరే విధాలుగా ఉపయోగించడం మేలు. 

ఉదాహరణకు ఒక ఊరిలో ఉన్న ఆస్తులను టీటీడీ గనుక నిర్వహించలేకపోతే.. అదే ఊరిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఇస్తే... వేరే ఏ ధార్మిక కార్యక్రమానికో ఉపయోగిస్తారు. అంతే కాకుండా భక్తుడు తాను ఇచ్చిన భూమి కూడా సరైన రీతిలో ఉపయోగం చెందుతుందని ఆనందంగా ఫీల్ అవుతాడు. 

ఒకవేళ ధార్మిక సంస్థలకు అవసరం లేకపోతే... స్కూల్స్, ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు. నేరుగా టీటీడీ నిర్మించకపోయినా ప్రభుత్వం నిర్మిస్తాననుకుంటే భూమిని ఇవ్వొచ్చు లేదా ఎవరైనా దాతలు నిర్మిస్తామన్నా కూడా భూమి ఇవ్వొచ్చు. అప్పుడు శ్రీవారిపేరు మీద నిరంతరం ప్రజా సేవ మాత్రం జరుగుతూనే ఉంటుంది. 

ఇలా ఇవే కాకుండా అనేక రకాల ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ప్రభుత్వం దీనిపైనా ఒక కమిటీని కూడా వేయవచ్చు. కానీ ఇలా నిరర్ధకం అనే పేరుతో అమ్మడం మాత్రం అది భక్తుల విశ్వాసాలతోని ఆదుకోవడమే!

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios