Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర బడ్జెట్ మీద టీఆర్ఎస్ గప్ చుప్: కేసీఆర్ ఆంతర్యం?

పార్లమెంటులో నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన బడ్జెట్ మీద టీఆర్ఎస్ ఎంపీలు నోరు మెదపడకపోవడం వెనక ఆంతర్యం ఏమిటనేది చర్చనీయాంశాంగా మారింది. కేసీఆర్ లో మార్పునకు కారణాలు ఏమిటనే ప్రశ్న ఉదయిస్తోంది.

TRS mum on Nirmala Seetharaman budget 2021
Author
Hyderabad, First Published Feb 2, 2021, 8:08 AM IST

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మీద తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మౌనం పాటించడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వంపై తరుచుగా ఒంటి కాలి మీద లేస్తూ వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన వైఖరిని పూర్తిగా మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. ఆ మధ్య ఆయన ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత బిజెపిపై గానీ కేంద్ర ప్రభుత్వంపై గానీ కాలు దువ్వడం మానేశారు. కేంద్ర బడ్జెట్ మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీలు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ఓ వైపు వైసీపీ ఎంపీలు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తే టీఆర్ఎస్ ఎంపీలు నోరు మెదపకపోవడంలోని ఆంతర్యం ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. గత బడ్జెట్ విషయంలో కేసీఆర్, సమీక్ష నిర్వహించి కేంద్ర ప్రభుత్వంపై ఒంటి కాలి మీద లేచారు. మోసం... దగా అంటూ ఆయన వ్యాఖ్యానించారు కేంద్రాన్ని నమ్మితే శంకరగిరి మాన్యాలే అని ఆయన వ్యాఖ్యానించారు. ఈసారి మాత్రం ఆయన నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు. 

కేసీఆర్ మాట అలా ఉంచితే రాష్ట్ర మంత్రులు గానీ ఎంపీలు గానీ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుామర్ గానీ ఏమీ మాట్లాడకపోవడం వెనక జరిగిన వ్యవహారం ఏమిటనేది అర్థం కావడం లేదు. జనవరి 26వ తేదీన ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన కేసీఆర్ ఇంకా అక్కడే ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ ను కలిశారు. ఆ తర్వాత వారు బడ్జెట్ మీద ఏమీ మాట్లాడలేదు. 

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సోమవారం సిరిసిల్ల పర్యటనలో మూడు కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. కానీ వారు బడ్జెట్ మీద స్పందించలేదు. కేసీఆర్ నుంచి ఏ విధమైన ఆదేశాలు రాకపోవడం వల్లనే అందరూ మౌనంగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. బడ్జెట్ మీద పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించిన తర్వాత పార్టీ పరంగా, ప్రభుత్వపరంగా స్పందిస్తారని అంటున్నారు. అయితే, దానీ మీద కూడా స్పష్టత లేదు. 

జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేంద్రంలోని బిజెపిపై సమరం సాగిస్తామని కేసీఆర్ ప్రకటించారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బిజెపి అనూహ్యమైన ఫలితాలు సాధించడంతో కేసీఆర్ కంగు తిన్నారని అంటున్నారు. జిహెచ్ఎంసీ ఫలితాలు వెలువడిన తర్వాత కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రదాని నరేంద్ర మోడీని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. ఆ తర్వాత బిజెపిపై సమరంలో కేసీఆర్ వెనక్కి తగ్గారు. సాగు చట్టాల విషయంలో,  ఆయుష్మాన్ భారత్ విషయంలో ఆయన వెనక్కి తగ్గారనే విమర్శలు వచ్చాయి. 

రైతుల ఆందోళనకు మద్దతుగా 16 రాజకీయ పార్టీలు పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించగా, టీఆర్ఎస్ హాజరైంది. బడ్జెట్ మీద అన్ని వైపుల నుంచి తీవ్రమైన వీమర్శలు వెలువడుతున్న స్థితిలో టీఆర్ఎస్ ఎంపీలు కనీసం ఒక్క మాట కూడా మాట్లడకపోవడంలోని ఆంతర్యం అర్థం కావడం లేదని అంటున్నారు. మొత్తం మీద, బిజెపిపై పోరాటం విషయంలో కేసీఆర్ వెనక్కి తగ్గడం వెనక జరిగిన వ్యవహారాలే ఎవరికీ అర్థం కావడం లేదు.

Follow Us:
Download App:
  • android
  • ios