కరోనా మహమ్మారి పేద, ధనిక, సెలబ్రిటీ సామాన్యుడు అన్న తేడా లేకుండా అందరినీ వణికిస్తోంది. తనముందు అందరూ సమానులే అన్నట్టుగా తన ప్రతాపాన్ని చూపెడుతోంది కరోనా వైరస్. తాజాగా తెలంగాణకు చెందిన తొలి ఎమ్మెల్యే, జనగామ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న తెరాస శాసనసభ్యుడు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కరోనా బారినపడ్డారు. ఇక నిన్న మరో తెరాస ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. 

ఆయన కరోనా బారిన పడగానే అత్యవసరంగా ఆసుపత్రిలో చేరిపోయారు ముత్తిరెడ్డి గారు. ఆసుపత్రిలో అనగానే తెలంగాణ కోవిడ్ స్పెషలిటీ హాస్పిటల్ అనుకునేరు... కాదు, సదరు ఎమ్మెల్యే గారు చేరింది ఒక ప్రఖ్యాత కార్పొరేట్ ఆసుపత్రిలో. 

తెలంగాణాలో ఎవ్వరికి కరోనా వైరస్ వచ్చినా చికిత్స గదిలోనే అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కోవిడ్ స్పెషలిటీ ఆసుపత్రి అని అన్నారు. గాంధీ దేశంలోనే భేష్ అన్నారు. అన్ని వసతులు ఉన్నాయి, ప్లాస్మా థెరపీని కూడా స్టార్ట్ చేసారు. 

ఇన్ని వసతులు ఉన్నప్పటికీ..., సునిశితులు, నిష్ణాతులైన డాక్టర్లు తమ సేవలను అందిస్తున్నప్పటికీ... మన ఎమ్మెల్యే గారికి అక్కడ చికిత్స మీద నమ్మకం లేదా? అధికార పార్టీ ప్రజాప్రతినిధులకే ప్రభుత్వం అందించే అత్యుత్తమ వైద్యంపై నమ్మకం లేనప్పుడు సామాన్య ప్రజలకు ఎలా నమ్మకం కలుగుతుంది?

ఇక మరో అంశం... ఎమ్మెల్యే గారిని పరీక్షించి ఆయనను పరిశీలించిన వైద్యులు ఆయనను ఐసొలేషన్ లో ఉండమన్నారు. ఆయన ఆరోగ్యము నిలకడగానే ఉంది. ఇది స్వయంగా ఎమ్మెల్యే గారు చెప్పిన మాట. 

ఆరోగ్యం నిలకడగా ఉంటె.. వైద్యులు ఇసోలాటిన్ అని సూచిస్తే... తెలంగాణ ఆరోగ్యశాఖామంత్రి ఈటల రాజేందర్ గారు చెప్పినట్టు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవాలి కానీ... ఇలా ఆసుపత్రిలో చేరడం ఏమిటి...?

తెలంగాణాలో ప్రజలకు కరోనా సోకినప్పుడు ఎలా ప్రభుత్వ ట్రీట్మెంట్ ఉంటుందో అలానే ఉండాలి కానీ... ఇలా ఎమ్మెల్యేలకు ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఏమిటని అందరూ ప్రశ్నిస్తున్నారు. 

ఇకపోతే ఈటెల రాజేందర్ గారితో క్లోజ్ గా జూడాల సమ్మె సమయంలో ఆయనకు సూచనలు చేసిన ఓ ప్రముఖ నెఫ్రాలోజిస్ట్ కరోనా బారినపడ్డారు. ప్రోటోకాల్ ప్రకారం మంత్రిగారినకి టెస్టులు చేయకుండా క్వారంటైన్ కి మాత్రమే తరలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 

బహుశా ఎమ్మెల్యేలకు కూడా కరోనా సోకుతుండడంతో ఇన్ని రోజులకు టెస్టింగ్ చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చిందేమో. కరోనా ప్రభావం అధికంగా ఉన్న 5 జిల్లాల పరిధిలో 50వేల కరోనా పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలిపారు. 

ఆలస్యంగానయినా తెలంగాణ సర్కార్ మంచి నిర్ణయం తీసుకున్నారు. టెస్టింగులను గనుక అధికంగా నిర్వహించి, ట్రేస్ చేసి ఐసోలేటె చేసినప్పుడు మాత్రమే ఈ కరోనా మహమ్మారిని మనం ఎదుర్కోగలము. 

ఇంకో లాక్ డౌన్ ను భారతదేశం తట్టుకునే స్థితిలో లేదు. ప్రజల ముందున్న ఏకైక పరిష్కారం ఫిజికల్ డిస్టెంసింగ్ ను పాటించడం, మాస్కును ధరించడం. ప్రభుత్వం తమ బాధ్యతగా సాధ్యమైనన్ని టెస్టులను నిర్వహించడం, ఇసోలాటిన్ కి తరలించడం. ఈ విధంగా మాత్రమే కేసులను తగ్గించగలం. 

ప్రభుత్వం ఎంతగా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేదు అని చెబుతున్నప్పటికీ.... నిపుణులు మాత్రం ఇప్పటికే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ మొదలయిందని అంటున్నారు. అందుకే కేసీఆర్ ఇలా టెస్టింగులకు ఆదేశించారు అని అంటున్నారు. 

ఇక నేడు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.... తెలంగాణాలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సలకు అనుమతించడమే కాకుండా ప్రైవేట్ ల్యాబుల్లో టెస్టింగులకు కూడా అనుమతిచ్చారు. బహుశా సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నందున ఇలా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా కరోనా చికిత్సల రేట్లను ఫిక్స్ చేసి ఉండొచ్చని అంటున్నారు.