Asianet News TeluguAsianet News Telugu

షాక్: ఎమ్మెల్యే హరిప్రియకు తండ్రి చిక్కులు

ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తండ్రి సీతారాములు భూవివాదాల్లో తలదూరుస్తూ, ఎవరైనా ఎదురు చెబితే ఎమ్మెల్యే తండ్రినంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా ఒక పోలీస్ కంప్లయింట్ కూడా ఫైల్ అయింది. 

TRS MLA Hari priya's Political Career In Deep Trouble Because Of Her father
Author
Yellandu, First Published Oct 5, 2020, 1:07 PM IST

సాధారణంగా రాజకీయాల్లో కుమారుడి వల్ల తండ్రికి అపఖ్యాతి అని వార్తలు రావడం, లేదా బంధు గణం ఓవర్ యాక్షన్ వల్ల చెడ్డ పేరు రావడం మనం చాలా సందర్భాల్లో చూసాము. కానీ ఒక ఎమ్మెల్యేకు మాత్రం ఏకంగా తన తండ్రి వల్లే అపఖ్యాతి రావడమే కాకుండా తన రాజకీయ భవిష్యత్తునే ప్రశ్నార్థకంగా మార్చే పరిస్థితి దాపురించింది. ఆ సంగతేమిటో ఒక లుక్కేయండి... 

2018 డిసెంబర్ లో కేసీఆర్ గాలికి కూడా ఎదురు నిలిచి కాంగ్రెస్ పార్టీ టికెట్ పై తొలిసారి ఇల్లందు ఎమ్మెల్యేగా గెలిచింది భానోత్ హరిప్రియ నాయక్. సిట్టింగ్ ఎమ్మెల్యే కోరం కనకయ్య ను ఓడించి సంచలనం సృష్టించింది ఈ యువ ఎమ్మెల్యే. ఎన్నికైన కొద్దీ రోజులకే తెరాస ఆపరేషన్ ఆకర్ష్ కు ఆకర్షితురాలై తెరాస లో చేరిపోయింది. 

వైరి పార్టీ నేత తెరాస లో చేరడంతో స్థానిక నాయకులకు అది జీర్ణం అవడం లేదు. ఆమె చేరిన నాటి నుండే వచ్చే పర్యాయం ఆమెకు టికెట్ దక్కకుండా ఏం చేయాలని స్కెచ్చులేస్తున్నారు ఆమె ప్రత్యర్థులు. దీనితో పార్టీలోనే పట్టు కోసం ఆమె తీవ్ర ప్రయత్నాలను చేస్తున్నారు. 

ఇలాంటి కష్టకాలంలో ఆమెకు ఆమె తండ్రి రూపంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆమె తండ్రి చేసే పనుల వల్ల ఈమె చుట్టూ వివాదాలు అలుముకుంటున్నాయి. సదరు ఎమ్మెల్యే గారి తండ్రి బయట వెలగబెడుతున్న రాచకార్యాల్లో ఎమ్మెల్యే గారి పేరు విపరీతంగా వాడేస్తూ ఆమెను బద్నామ్ చేస్తున్నారట. 

ఇంతకీ వివరాల్లోకి వెళితే ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తండ్రి సీతారాములు భూవివాదాల్లో తలదూరుస్తూ, ఎవరైనా ఎదురు చెబితే ఎమ్మెల్యే తండ్రినంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా ఒక పోలీస్ కంప్లయింట్ కూడా ఫైల్ అయింది. 

కొత్తగూడెం పరిధిలోని బాబు క్యాంపు లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేసేందుకు పంచాయితీ తీర్మానం చేసి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సహా అందరూ హాజరైన వేళ.... ఆ డంపింగ్ యార్డు నిర్మాణాన్ని అడ్డుకున్నారు. తన అనుచరులతో అక్కడకు వచ్చి హంగామా చేసి తాను ఎమ్మెల్యే తండ్రినని వీరంగమాడుతూ సర్పంచ్ ని చంపేస్తానని బెదిరించాడు. 

సర్పంచ్ ని చంపేస్తానంటూ బెదిరించడం, అది కూడా ఇతర పార్టీ పెద్దలు ఉన్న వేళా అవడంతో సదరు సర్పంచ్ పోలీస్ స్టేషన్లో ఇందుకు సంబంధించి ఫిర్యాదు చేసారు. అసలే సొంత పార్టీలోనే వైరి వర్గం కాచుకొని కూర్చున్న వేళ.... హరిప్రియ తండ్రి చేసిన ఈ రచ్చ ఆమెకు తలనొప్పులు తీసుకువస్తుంది. 

కూతురికి తెలియకుండానే తండ్రి ఇదంతా చేస్తాడా? కూతురే ఈ ల్యాండ్ సెటిల్మెంట్లు చేపిస్తుందని వారు జోరు ప్రచారాలను చేస్తున్నారు. ఇది హరిప్రియ భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మారుస్తుంది. వచ్చే ఈనికల్లో హరిప్రియకు ఎలాగైనా టికెట్ దక్కనివ్వొద్దు అని కాచుకొని కూర్చొన్న వైరి వర్గం ఆమెను కూడా ఈ వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. 

ఈ అన్ని పరిస్థితులను గమనించిన హరిప్రియ తండ్రి వల్ల చెలరేగిన వివాదాన్ని సద్దుమణిగేలా ప్రయత్నాలను చేస్తున్నారు. వివాదాల్లో ఇక మీదట తన తండ్రి తలదూర్చబోరని అందరికి నచ్చజెపుతూ తన రాజకీయ భవిష్యత్తును చక్కదిద్దుకునే పనిలో పడ్డారట. చూడాలి. ఇది ఎలాంటి ఫలితాలను ఇస్తుందో.. 

Follow Us:
Download App:
  • android
  • ios