Asianet News Telugu

మోడీ పేరు చెప్పి టీఆర్ఎస్ ఓదార్పు: అంతకన్నా గంభీరమైందే...

దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ హవా వల్ల రాష్ట్రంలో బిజెపికి సీట్లు వచ్చాయని టీఆర్ఎస్ నాయకులు ఆత్మసంతృప్తి గానం చేస్తున్నారు. కరీంనగర్ లోకసభ స్థానంలో ఓటమి పాలైన వినోద్ కుమార్ క్రెడిట్ మోడీకే ఇచ్చారు. మోడీ హవా వల్ల తాను ఓడిపోయానని చెప్పుకున్నారు. 

TRS consoling itself giving credit to Modi wave
Author
Hyderabad, First Published May 31, 2019, 1:05 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

తెలంగాణ లోకసభ ఎన్నికల్లో అనూహ్యంగా కమల వికాసం జరిగింది. కారు స్పీడుకు బ్రేకులు పడ్డాయి. కొంత మేరకు కాంగ్రెసుకు ఓదార్పు లభించింది. సార్, కారు, సర్కార్ అనే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నినాదం బొక్క బోర్లా పడింది. శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన టీఆర్ఎస్ నాలుగు నెలలు తిరగకుండానే వచ్చిన లోకసభ ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బ తింది.

దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ హవా వల్ల రాష్ట్రంలో బిజెపికి సీట్లు వచ్చాయని టీఆర్ఎస్ నాయకులు ఆత్మసంతృప్తి గానం చేస్తున్నారు. కరీంనగర్ లోకసభ స్థానంలో ఓటమి పాలైన వినోద్ కుమార్ క్రెడిట్ మోడీకే ఇచ్చారు. మోడీ హవా వల్ల తాను ఓడిపోయానని చెప్పుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెటీ రామారావు తనయ కల్వ కుంట్ల కవిత నిజామాబాద్ స్థానంలో ఓడిపోయారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైన వినోద్ కుమార్, కల్వకుంట్ల కవిత ఓటమి పాలు కావడం టీఆర్ఎస్ నాయకులకు మింగుడు పడని విషయం.  

మోడీ హవా వల్ల టీఆర్ఎస్ కొన్ని సీట్లలో ఓటమి పాలైందని అనుకుందాం. శాసనసభ ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓటమి పాలైన కాంగ్రెసు పార్టీ మూడు స్థానాల్లో విజయం సాధించి, చేవెళ్లలో అతి తక్కువ మెజారిటితో ఓడిపోయింది. కాంగ్రెసు నుంచి 11 మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ లాక్కున్న తర్వాత కూడా కాంగ్రెసుకు లోకసభ ఫలితాలు ఊరటనిచ్చాయి. దీన్ని ఏ హవా కింద తీసుకోవాలనేది ప్రశ్న. దేశవ్యాప్తంగా కాంగ్రెసుకు ప్రజలు చుక్కలు చూపిస్తే, ఇక్కడ పన్నీరు చల్లారు.  

ముఖ్యంగా అంతా తానై వ్యవహరించిన కేటీఆర్ కు ఏ మాత్రం మింగుడుపడని విషయం.. బయటకు ఆయన ఏం చెప్పినా, అది తన వైఫల్యం కాదని చెప్పుకునే ప్రయత్నం చేసినా ఎవరూ అంగీకరించే విషయం కాదు. తనది కాకపోతే ఆ వైఫల్యం కేసీఆర్ ది అయినా కావాలి. కాదని అనడానికి లేదు.

డిసెంబర్ లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. టీఆర్ఎస్ దాదాపుగా ఊడ్చేసింది. కానీ, ఆ తర్వాత నాలుగు నెలలకే వచ్చిన లోకసభ ఎన్నికల్లో ఆ ఫలితాలను పునరావృతం చేయలేకపోయింది. లోకసభ ఎన్నికల్లో తగిన ఫలితాలు సాధించకపోవడం వెనక కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యమే ప్రధానంగా ఉంది. 

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఓ మాట అన్నారు. యువకులు కొంత నిరాశతో ఉన్న మాట వాస్తవమేనని, ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మాటలను ఆయన టీఎస్ పిఎస్సీ గురించి చెప్పి ఉంటారనేది అందరికీ అర్థమయ్యే విషయమే. కేసీఆర్ మాటలతో యువకులు టీఎస్ పిఎస్సీ నోటిఫికేషన్స్ విడుదలవుతాయని ఆశపడ్డారు. కానీ అదేం జరగలేదు. 

టీఎస్ పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మాత్రం తమ వద్ద పెండింగులో ఏమీ లేవని, అన్ని నోటిఫికేషన్లు వేసేశామని గంటా బజాయించి చెబుతారు. కానీ గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసం మాత్రం యువకులు ఎదురు చూస్తున్నారనేది వాస్తవం. డిఎస్సీ కూడా లేకుండా పోయింది.

ప్రభుత్వం నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించలేదనే మాట టీఆర్ఎస్ వర్గాల నుంచి ఇటీవల కాలంలో వినిపిస్తోంది. అది నిజమే. కానీ, ఉన్న ఉద్యోగాల ఖాళీలైనా భర్తీ చేయడానికి పూనుకుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది.

నాలుగు నెలల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం నిద్రావస్థలో ఉందనేది అందరూ అంగీకరించే విషయమే. ఈ నిద్రావస్థనే టీఆర్ఎస్ కొంప ముంచిందని చెప్పవచ్చు. శానససభ ఎన్నికల ప్రచారంలోకి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దిగడం టీఆర్ఎస్ కు కలిసి వచ్చింది. తిరిగి తెలంగాణ సెంటిమెంటుకు ప్రాణం పోసింది. కేసీఆర్ ప్రభుత్వంపై కాస్తో కూస్తో అసంతృప్తితో ఉన్న తటస్థ ఓటర్లు టీఆర్ఎస్ వైపు మళ్లడానికి చంద్రబాబు కారణమయ్యారు. 

శాసనసభ ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు, కనీసం కాంగ్రెసు నాయకులైనా ప్రజల వద్దకు వెళ్లి ఉంటే, చంద్రబాబు టీఆర్ఎస్ విజయానికి ఎలా దోహదం చేశారో అర్తమై ఉండేది. అయితే, లోకసభ ఎన్నికలకు చంద్రబాబు దూరంగా ఉన్నారు. పైగా, కాంగ్రెసుతో పొత్తు కూడా పెట్టుకోలేదు. తెలంగాణ సెంటిమెంటును రగిల్చడానికి తగిన అవకాశం కూడా లేకుండా పోయింది. 

ఆ స్థితిలో తటస్థ ఓటర్లు, తటస్థ మేధావులు టీఆర్ఎస్ కు దూరమయ్యారు. నాలుగు నెలల ప్రభుత్వ నిష్క్రియాపరత్వంతో వారు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా మంత్రులు, టీఆర్ఎస్ నాయకుల వ్యవహారశైలి వారిని విసుగుకు గురి చేసింది. ఒక రకంగా కమ్యూనిస్టుల మాదిరిగా, టీఆర్ఎస్ పిడివాదాన్ని ఆశ్రయించింది. మేం చేసేది ఏదైనా సరే సరిగ్గానే ఉంటుంది, మీరు మమ్మల్ని బలపరచాల్సిందే అనే ధోరణి ప్రబలిపోయింది. 

గతంలో టీఆర్ఎస్ కు లేదా కేసీఆర్ కు లేదా కేటీఆర్ కు సన్నిహితంగా ఉండే మేధావులు గతంలో గుంపులను కూడగట్టారనే అభిప్రాయం ఉండవచ్చు. అలా ఉన్నవారు పదవుల్లో కూరుకుపోయిన తర్వాత ఆ పాత్రను నిర్వహించడానికి సరిపోవడం లేదు. ఆ గుంపులను కూడగట్టడం వారి శక్తి వల్ల, వారి సమర్థత వల్ల జరిగింది కాదనే విషయాన్ని గ్రహించాల్సి ఉంటుంది. తెలంగాణ కోసం ఇష్టం ఉన్నా లేకపోయినా చాలా మందికి వారి సరసన నడవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయింది. ఆ అవసరం లేకుండా చేయడం వెనక ఆ అధికారుల వ్యవహారశైలి, వారిపై కేసీఆర్ కు లేదా కేటీఆర్ కు ఉన్న అపారమైన నమ్మకం పనిచేసిందని చెప్పక తప్పదు.

తెలంగాణ ఉద్యమ కాలంలో పనిచేసిన మేధావులతో పాటు వివిధ సెక్షన్లకు చెందినవారు ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులకు, ప్రస్తుత పరిస్థితులకు మధ్య తేడా కనిపించక దిగాలు పడిపోయారు. దానికితోడు, ప్రభుత్వ పదవుల్లో కూరుకుపోయిన మేధావులు, ప్రభుత్వం నుంచి ఏదో రీతిలో ప్రయోజనం పొందిన కళాకారులు, రచయితలు, కవులు, గాయకులు, ఇతర వర్గాల వారు చేస్తున్న వాదనలు కూడా చీదరపెట్టే స్థాయికి చేరుకున్నాయి.

కాళేశ్వరం నుంచి నీళ్లు పోయించడం తప్ప కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదు. పైగా, ఏ కొద్ది పాటి విమర్శలు వచ్చినా, ఆ విమర్శలు రావడానికి గల కారణాలేమిటనే ఆలోచన చేయడం కూడా మానేసి, ఎదురుదాడికి దిగడం పరిస్థితిని మరింత దిగజార్చింది. 

ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆలింగనం చేసుకోవడం వంటివి అసలు సమస్యలే కావు. ఈ విషయంలో వస్తున్న విమర్శలనే ప్రధానంగా ఎత్తి చూపుతూ వాటికి వివరణలు ఇచ్చే ప్రయత్నం టీఆర్ఎస్ వర్గాల నుంచి జరుగుతోంది. కానీ, సమస్య అంతకన్నా గంభీరమైందనే విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది. 

- కె. నిశాంత్

Follow Us:
Download App:
  • android
  • ios