దేశమంతా కరోనా వైరస్ గురించిన చర్చ నడుస్తున్నప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ కరోనా వైరస్ కన్నా కూడా రాజకీయపరమైన అంశాలపై చర్చ అధికంగా నడుస్తుంది. దేశంలో ఇంకెక్కడా ఈ పరిస్థితిని మనం చూడలేము (బెంగాల్ లో కూడా రాజకీయ వేడి ఉంది, కానీ అక్కడ ఎన్నికలు సమీపిస్తున్నందున ఆ వేడి కనబడుతుంది). 

మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎన్నికలు ఇప్పుడప్పుడు దరిదాపుల్లో కూడా లేకున్నప్పటికీ, మొన్ననే ముగిసిన ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి 150 పైచిలుకు సీట్ల అఖండ మెజారిటీతో గెలిచి ప్రతిపక్షాన్ని తుత్తనీయాలు చేసినప్పటికీ.... కరోనా వేళ ఇక్కడ రాజకీయ వేడి పెరగడం నిజంగా ఆశ్చర్యకరం. 

ఎలా ఓడమో, ఎందుకు ఓడమో అర్థం కాక ప్రతిపక్ష టీడీపీ కొట్టుమిట్టాడుతన్న సమయంలో అమరావతి నుంచి రాజధాని తరలింపు వారిలో జవసత్వాలు నింపింది. ఈ కరోనా మహమ్మారి విజృంభణ మొదలవడంతో ఆ విషయం కనుమరుగవుతుందని అంతా అనుకుంటున్నా తరుణంలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ చేసిన ఒక పొరపాటు ఆయనకు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులను తెచ్చి పెడుతుంది. 

స్థానిక సంస్థల ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని రంగం సిద్ధం చేసుకున్న జగన్ సర్కార్.... కరోనా వైరస్ కారణం చెప్పి ఎన్నికల ప్రధానాధికారి రమేష్ కుమార్ వాయిదా వేయడం పై తీవ్రంగా ఫైర్ అయింది. 

ఆయనతోని బహిరంగంగానే యుద్ధానికి దిగింది. అక్కడి నుండి మొదలు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఈగోకు పోవడంతో ఒక్కోసమస్య వారిని చుట్టముట్టడం మొదలుపెట్టింది. 

రమేష్ కుమార్ పై రాజకీయ దాడికి దిగడంతో అందరూ కూడా ఈ కరోనా వైరస్ ని జగన్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంలేదంటూ ఎదురుదాడికి దిగారు. ఎప్పుడైతే కేంద్రమే నేషనల్ లాక్ డౌన్ ప్రకటించిందో.... పరిస్థితి ఇంత సీరియస్ గా ఉంటే జగన్ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని, ప్రజల ఆరోగ్యం కన్నా ఎన్నికలు, రాజకీయాలే ఎక్కువయ్యాయని ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా నుంచి సాధారణ ప్రజల వరకు ఈ విషయం గట్టి చర్చకే దారి తీసింది. 

ఇక ఆ తరువాత మెల్లిగా ఎన్నికల ప్రధాన అధికారి రమేష్ కుమార్ ని తొలిగించడం.(జీవో తీసుకొచ్చి చట్టపరంగానే తొలిగించారా లేదా అనే విషయం కోర్ట్ కి వదిలేద్దాము) ఆయనను తొలిగించడంతో ఈ కరోనా కష్టకాలంలో కేసులు పెరుగుతున్నప్పటికీ కూడా ఆయన  రాజకీయ కక్షసాధింపు చర్యలమీదనే దృష్టిపెట్టారు తప్ప వేరే విషయాల మీద్ద లేదు అనే అపవాదును మూటగట్టుకున్నారు. 

ఇక ఆతరువాత ఆయన రమేష్ కుమార్ తొలిగింపు ఉత్తర్వుతోపాటుగా నూతన ఎన్నికల ప్రధానాధికారిని నియమించారు. కనగరాజ్ తమిళనాడు నుంచి ఆగమేఘాలమీద వచ్చి ప్రమాణస్వీకారం చేసారు. 

ఇలా ప్రమాణస్వీకారము చేసిన తరువాత రాజ్ భవన్ అధికారులకు కరోనా వ్యాధి సోకింది. ఏకంగా గవర్నర్ కే పరీక్షలు చేయవలిసి వచ్చింది. కరోనా ఎక్కువగా ఉన్న తమిళనాడు నుంచి ఆయనను తీసుకువచ్చారు. 

సాధారణంగా పక్కరాష్ట్రాల నుంచి ఎవ్వరిని రానివ్వమంటూ బీరాలు పలికిన జగన్ సర్కార్ ఆయనను రానివ్వడమే కాకుండా, ఎటువంటి క్వారంటైన్ లో కూడా ఉంచలేదు. (ఈ కాలంలో పక్కరాష్ట్రాల నుంచి వచ్చి జడ్జిలుగా ప్రమాణస్వీకారం చేసినవారు కూడా క్వారంటైన్ లోకి వెళ్లి, ఆ తరువాత బాధ్యతలను స్వీకరిస్తున్నారు)

ఇప్పుడు రాజ్ భవన్ అధికారులకు కరోనా సోకడంతో దానికి కనగరాజ్ గారిని కారణం చేస్తుంది టీడీపీ. ఆయన నిజంగా కారణమా కాదా అనే విషయం పక్కనపెడితే.... ఆ ఆరోపణ చేసేందుకు ఛాన్స్ ఇచ్చింది మాత్రం వైసీపీ సర్కారే.