యాదాద్రిలో ప్రోటోకాల్ స్వాగతం.. అసెంబ్లీలో సాఫీగా గవర్నర్ ప్రసంగం.. విభేదాలకు తెరపడినట్టేనా..?
తెలంగాణలో గత కొంతకాలంగా గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు, సీఎం కేసీఆర్‌కు మధ్య విభేదాలు కొనసాగిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో గత కొంతకాలంగా గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు, సీఎం కేసీఆర్‌కు మధ్య విభేదాలు కొనసాగిన సంగతి తెలిసిందే. గవర్నర్ కామెంట్స్‌కు బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇవ్వడం, ప్రభుత్వంపై పరోక్షంగా గవర్నర్ కామెంట్ చేయడం కనిపించింది. గవర్నర్ తమిళిసై రాష్ట్రంలో పలుచోట్ల పర్యటించిన సందర్భంలో ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం లభించలేదు. గతేడాది బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రాజ్‌భవన్‌లో జరిగిన పలు కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పలు సందర్భాల్లో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.
అయితే ప్రస్తుతానికి ఆ పరిస్థితుల్లో కొంతమార్పు కనిపిస్తోంది. ఇటీవల తెలంగాణ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి గవర్నర్ ఆమోదం తెలుపలేదు. మరోవైపు బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందా? అని రాజ్‌భవన్ ప్రభుత్వాన్ని అడిగింది. ఈ క్రమంలోనే కేసీఆర్ సర్కార్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ క్రమంలోనే నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం చెప్పడం.. అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఆమోదం తెలుపడం జరిగిపోయింది.
దీంతో అప్పటినుంచి పరిస్థితులు ప్రశాంతంగానే కనిపిస్తున్నాయి. ఇక, ఈ రోజు ఉదయం యాదాద్రి ఆలయానికి చేరుకున్న గవర్నర్‌కు ప్రోటోకాల్ స్వాగతం లభించింది. గవర్నర్ తమిళిసైకు కలెక్టర్ పమేలా సత్పతి, పోలీసులు స్వాగతం పలికారు. ఆలయానికి వచ్చిన గవర్నర్ తమిళిసైకు ఇంచార్జ్ ఈవో, ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పండితులు గవర్నర్‌కు ఆశీర్వచనం, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ తమిళిసైకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, సీఎం కేసీఆర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం పోడియం వద్దకు చేరుకున్న గవర్నర్ తమిళిసై సభలో తన ప్రసంగం కొనసాగించారు. ప్రభుత్వం పంపిన ప్రసంగాన్ని చదివారు. జై తెలంగాణ నినాదంతో గవర్నర్ స్పీచ్ ముగించారు. అనంతరం గవర్నర్ సభలో నుంచి వెళ్తున్న సమయంలో సభ్యులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిలను అనుసరిస్తూ గవర్నర్ తమిళిసై ముందు సాగగా.. కేసీఆర్, ప్రశాంత్ రెడ్డి ఆమె వెంట నడిచారు. ఈ సమయంలో సభలో సభ్యులు కూడ లేచి నిల్చుని గవర్నర్‌కు అభివాదం చేశారు.
అయితే గతంలో పలు సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిన గవర్నర్ తమిళిసై.. అసెంబ్లీ ప్రసంగించే సమయంలో మాత్రం కేంద్రం ప్రస్తావన తీసుకురాలేదు. ప్రభుత్వం పంపిన ప్రసంగాన్ని మాత్రమే చదివి వినిపించడంతో అంతా సాఫీగా సాగిపోయింది.
ఈ పరిణమాలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గత కొంతకాలంగా రాజ్‌భవన్ వర్సెస్ ప్రగతి భవన్‌గా కొనసాగిన పరిణామాలకు ఇక తెరపడినట్టేనా? అనే చర్చ సాగుతుంది. అయితే అలాంటిదేమి ఉండకపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఇరువైపుల నుంచి మైత్రి వైఖరి అవలంభించినట్టుగా చెబుతున్నారు. కొందరు రాజకీయ విశ్లేషకులు మాత్రం.. కొంతకాలం పాటు పరిస్థితుల ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.