Asianet News TeluguAsianet News Telugu

బిజెపికి విరుగుడు: రేవంత్ రెడ్డి హిందూత్వ ఎజెండా

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హిందూత్వ ఎజెండాను ముందుకు తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వంద నియోజకవర్గాల్లో రామాలయాలు నిర్మిస్తామని ఆయన చెప్పారు. భద్రాచలంలో ఆయన ఆ విషయం చెప్పారు.

Telangana pcc chief Revanth Reddy takes hindutva line
Author
First Published Feb 15, 2023, 4:48 PM IST

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బిజెపికి విరుగుడు కనిపెట్టినట్లున్నారు. బిజెపిని ఎదుర్కోవడానికి ఆయన హిందూత్వ వైఖరిని తీసుకున్నట్లు కనిపిస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని వంద నియోజకవర్గాల్లో రామాలయాలు నిర్మిస్తామని ఆయన చెప్పారు. అందుకు 10 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేస్తామని చెప్పారు.తన హాత్ సే హాత్ పాదయాత్ర సందర్భంగా మంగళవారం భద్రాచలంలో జరిగిన సభలో ఆయన ఆ విషయం ప్రకటించారు. భద్రాచలంలో భక్తుల మన్ననలు పొందిన రామాలయం ఉన్న విషయం తెలిసిందే. అందువల్ల రేవంత్ రెడ్డి ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

భద్రాచలంలో రామాలయం ఉందని, రాష్ట్రంలోని వంద నియోజకవర్గాల్లో రామాలయాలు ఉంటే మంచిదని తమ పార్టీ నాయకులు అన్నారని, అది గొప్ప ఆలోచన అని, దాన్ని పరిగణనలోకి తీసుకుంటామని, అది యువతకు ఎంతో మేలు చేస్తుందని, వేయి కోట్లతో రామాలయాలను నిర్మించే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని రేవంత్ రెడ్డి వివరించారు. 

రేవంత్ రెడ్డి ఆలయాల నిర్మాణ ఎజెండాను ఎత్తడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది ఆఖరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తరుచుగా మజీదు గురించి, ఆలయాల గురించి మాట్లాడుతూ హిందువుల సెంటిమెంట్ ను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే.

రామాలయాల ఎజెండాను ఎత్తుకుంటూనే రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. నరేంద్రమోడీ మత ప్రాతిపదికపై సమాజాన్ని చీల్చే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని ఆయన తప్పు పట్టారు.  తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బిజెపి నాయకులు చెబుతున్నారని, అది బట్టతల ఉన్న వ్యక్తి తల మీద వెంట్రుకలు మొలిపించుకుంటానని చెప్పే విధంగా ఉందని, తమను బిజెపి నాయకులు హేళన చేస్తున్నారని, అయితే తమ బలమేమిటో నిరూపిస్తామని ఆయన అన్నారు.

అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఆలయాలకు, హోమాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. యాద్రాద్రి నిర్మాణాన్ని పెద్ద యెత్తున ఆయన చేపట్టారు. అదే విధంగా కొండగట్టు ఆలయానికి ఆయన రూ.500 కోట్లు ప్రకటించారు. ఇదంతా చూస్తుంటే మెజారిటీ ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి అన్ని పార్టీలు ప్రయత్నాలు సాగిస్తున్నాయనేది అర్థమవుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios