Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ తో ఢీ: పక్కా ప్రణాళికతో తెలంగాణ కాంగ్రెస్ దూకుడు

రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని దక్కించుకోవాలని గులాబీ పార్టీ చూస్తుంటే... కర్ణాటక ఎన్నికల్లో గెలిచినా జోష్ తో, ఎలాగైనా కేసీఆర్ ని ఓడించి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఉవ్విల్లూరుతుంది..!

telangana election-congress goes ahead with a master plan to counter kcr-sir
Author
First Published Jun 27, 2023, 12:26 PM IST

తెలంగాణ శాసనసభ ఎన్నికలకు కొద్ది నెలల గడువు మాత్రమే ఉంది. ఈ స్థితిలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం పూర్తిగా తెలంగాణ వ్యవహారాలపై ద్రుష్టి కేంద్రీకరించింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్వయంగా రంగంలోకి దిగి వ్యూహరచన చేస్తూ తెలంగాణ నాయకులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ ను ఓడించడానికి తగిన వ్యూహాలను రచిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తున్నారు.

మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూపల్లి క్రిష్ణారావుతో పాటు 35 మంది బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధపడ్డారు. వారు ఢిల్లీలో రాహుల్ గాంధీని, ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిశారు. ఖమ్మంలో జులై 2వ తేదీన జరిగే సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. అలాగే జులై 14 లేదా 16వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలో సభను ఏర్పాటు చేసి జూపల్లి క్రిష్ణారావు కాంగ్రెస్ లో చేరుతారు. ఈ సభకు ప్రియాంక గాంధీ వచ్చే అవకాశం ఉంది. ఇతర పార్టీలకు చెందిన మరింత మంది నాయకులు కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయి.

బిజెపి నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. వీరిద్దరు ఇటీవల జరిగిన బిజెపి జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా సమావేశానికి డుమ్మా కొట్టారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బిజెపిలో చేరి మునుగోడు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంతకు ముందు బిఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బిజెపిలో చేరి హుజూరాబాద్ శాసనసభ సీటుకు జరిగి ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ఈటల రాజేందర్ విజయం తర్వాత హైదరాబాద్ నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసీ) ఎన్నికల్లో బిజెపి గణనీయమైన స్థానాలు సాధించింది. దీంతో అప్పట్లో బిజెపికి తెలంగాణలో ఓ ఊపు వచ్చింది. అయితే, మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి పరాజయం తర్వాత పరిస్థితి కొంత మారింది. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత పరిస్థితి బిజెపికి మరింత ప్రతికూలంగా మారింది. 

ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కు తెలంగాణలో ఊపు వచ్చింది. ఆ ఊపును కొనసాగించడానికి అవసరమైన ప్రణాళికను కాంగ్రెస్ అధిష్టానం రూపొందిస్తోంది. మరో వైపు, కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ కు పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నట్లు అంచనా వేస్తున్నారు. కేసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పథకంపై విమర్శలు వస్తున్నాయి. రైతు బంధు, దళిత బంధు వంటి పథకాలపై కూడా విమర్శలు వస్తున్నాయి. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, వ్రుద్ధ్యాప్య పింఛన్ల వంటి సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తే అవకాశాలున్నాయి.

మరో వైపు, ఢిల్లీ లిక్కర్ కంభకోణం కేసులో కేసిఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయకపోవడాన్ని కాంగ్రెస్ అస్త్రంగా ఎంచుకుంది. బిజెపితో రహస్య అవగాహన ఉన్నందువల్లనే కవితను అరెస్టు చేయలేదని కాంగ్రెస్ నేతలు పదే పదే విమర్శిస్తున్నారు. కవితను అరెస్టు చేయకపోవడం వల్ల బిజెపితో కెసీఆర్ అవగాహనకు వచ్చారనే అభిప్రాయం బలపడిందని, అది బిజెపికి తెలంగాణలో నష్టం చేస్తుందని బిజెపి నేత కొండా విశ్వేశ్వర రెడ్డి ఒకానొక సందర్భంలో వ్యాఖ్యానించారు. బిజెపి, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పోరాటం చేయాలనే కేసిఆర్ మాటలు ఉత్తవేననే అభిప్రాయం క్రమంగా బలపడుతోంది. 

ఈ అవకాశాన్ని వినియోగించుకోవడమే కాకుండా కాంగ్రెస్ తెలంగాణ సీనియర్ నేతలు విభేదాలను పక్కన పెట్టి ముందుకు సాగడానికి సిద్ధపడ్డారు. ఇదే సమయంలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓ మెట్టు దిగి వచ్చారు. తానంటే ఇష్టం లేని నాయకులు నేరుగా అధిష్టానంతో మాట్లాడుకోవచ్చునని, పార్టీలో చేరదలుచుకున్న నేతలు కూడా అధిష్టానంతో మాట్లాడుకుని పార్టీలో చేరవచ్చునని చెప్పారు. ఈ స్థితిలో కాంగ్రెస్ అధిష్టానం నేరుగా రంగంలోకి దిగి వ్యూహాలను రచిస్తూ ఉంది. మరో వైపు, సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క తెలంగాణలో పాదయాత్ర చేస్తూ ప్రజలకు హామీలు ఇస్తున్నారు. ఇది కూడా కాంగ్రెస్ కొంత ఊపునిచ్చింది. మొత్తం మీద, కేసిఆర్ ను ఓడించాలనే లక్ష్యం కాంగ్రెస్ నేతలను ముందుకు నడిపిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios